బాలినేని గౌరవానికి తగ్గట్టు ప్రకటన లేదని అనుచరులు నిరాశ బాలినేని శ్రీనివాసరెడ్డి. మాజీ మంత్రి. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో ఆదిమూలపు సురేష్‌ను ఉంచి.. బాలినేనికి గుడ్‌బై చెప్పారు. దాంతో ఆయన అభిమానులు ఎలాంటి హంగామా చేశారో రాష్ట్రమంతా చూసింది. రెండురోజుల హైడ్రామా తర్వాత సీఎం జగన్‌తో భేటీ అయ్యాక అలకవీడారు బాలినేని. వైసీపీలో సముచిత స్థానం ఇవ్వడంతోపాటు త్వరలో జిల్లా పర్యటనకు వస్తానని ఆ సమయంలో బాలినేనికి మాట ఇచ్చారట సీఎం జగన్. ఆ క్రమంలోనే ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ పదవి మాజీ మంత్రికి కట్టబెట్టింది వైసీపీ. అయితే జిల్లా పర్యటనలో బాలినేని గౌరవానికి తగ్గట్టుగా ఏదో ఒకటి సీఎం జగన్ మాట్లాడతారని మాజీ మంత్రి అనుచరులు భావించారట. సీఎం జగన్ ప్రసంగం ఆసాంతం ఏపీలోని తాజా రాజకీయ పరిస్థితులు.. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల తీరు తెన్నుల గురించే సాగింది. బాలినేని పేరును ప్రస్తావించకపోవడం.. జిల్లాలో అభివృద్ధి పనులు, ప్రాజెక్టుల ఊసే లేకపోవడంతో ఆయన అనుచరులను నిరాశ పర్చిందట.
కేబినెట్‌లో చోటు కోల్పోవడంతో బాలినేనికి వేదికపైనే గట్టి భరోసా ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని అనుచరులు భావించారట. పైగా సీఎం మాట్లాడే సమయంలో ఆయన వెనక ఉండేందుకు బాలినేని ప్రయత్నించగా.. అక్కడ ఉండొద్దని చెప్పడంతో బాధ కలిగించిందని మాజీ మంత్రి దగ్గర అనుచరులు వాపోయారట. దీంతో కేడర్‌కు ఎలా సర్దిచెప్పాలో తెలియక బాలినేని హడావుడిగా హైదరాబాద్ వెళ్లిపోయారట. ఆ తర్వాత కూడా మరికొన్ని అంశాలపై జిల్లా పార్టీలో చర్చ మొదలైంది. మంత్రిగా ఉన్నప్పుడు సీఎం కాన్వాయ్‌లో బాలినేని కాన్వాయ్‌ను కూడా పోలీసులు అనుమతించేవారు. మొన్నటి పర్యటనలో ఒక్క బాలినేని కారుకే పోలీసులు ఒకే చెప్పారట. దీంతో అక్కడే బాలినేని అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పోలీస్ బాస్ కలుగుజేసుకుని మాజీ మంత్రికి సర్దిచెప్పారట.
కేబినెట్‌లో చోటు కోల్పోయాక… మాజీ మంత్రిగా జిల్లాలో బాలినేని అడుగుపెట్టినప్పుడు భారీ ర్యాలీ నిర్వహించారు ఆయన అనుచరులు. అది బలప్రదర్శనలా సాగడంతో వైసీపీ వర్గాల్లో చర్చగా మారిందట. ఆ విషయం పార్టీ అధిష్ఠానం దృష్టికి వెళ్లడం.. అక్కడ నుంచి సీఎం దగ్గరకు చేరిందట. బలప్రదర్శనలా స్వాగత కార్యక్రమం సాగడంతో రాంగ్ సిగ్నల్ పంపినట్టు తెలుస్తోంది. అందుకే ఒంగోలు పర్యటనలో బాలినేనికి ప్రాధాన్యం ఇవ్వలేదన్నది కొందరి వాదన. తాజా పరిణామాలను ఇబ్బందిగా భావిస్తున్న మాజీ మంత్రి.. ఏం చేస్తారో.. ఎలా స్పందిస్తారో అని చర్చ జరుగుతోందట. మరి.. ఒంగోలు అధికారపార్టీలో అంతర్గత వ్యవహారాలు టీ కప్పులో తుఫానుగా సమసిపోతాయో.. పార్టీలో బాలినేని పట్టు నిలుపుకొంటారో కాలమే చెప్పాలి.