బాబూమోహన్. మాజీ మంత్రి. గతంలో ఆందోల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ, టీఆర్‌ఎస్‌ల నుంచి గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టారు కూడా. గత ఎన్నికల సమయంలో బీజేపీలో చేరిపోయారు. ఈ దఫా ఎలాగైనా గెలిచి తిరిగి పట్టు సాధించాలని చూస్తున్నారు బాబూమోహన్. నియోజకవర్గంపై పట్టు ఉండటంతో తప్పకుండా తనకే బీజేపీ సీటు ఇస్తుందని లెక్కలేసుకుంటున్నారు. అయితే ఆందోల్ బీజేపీలో పరిస్థితులు మరోలా ఉన్నాయట. అక్కడ జడ్పీ మాజీ ఛైర్మన్ బాలయ్య నుంచి గట్టి పోటీ ఉందట బాబూమోహన్‌కు. దీంతో నియోజకవర్గంలో బీజేపీ రెండు వర్గాలుగా మారిపోయింది. బాలయ్య పూర్వాశ్రమం కాంగ్రెస్ పార్టీ. కొన్ని నెలల క్రితమే కాషాయ కండువా కప్పుకొన్నారు. బాలయ్య చేరిక బాబూమోహన్‌కు ఇష్టం లేదని టాక్. దాంతో లుకలుకలు.. అలకలు కామన్‌గా మారిపోయాయి. ప్రస్తుతం ఈ రగడ సీటు పంచాయితీగా టర్న్ తీసుకుంది.
బీజేపీలో ముందుగా చేరింది తానే కాబట్టి తనకే పార్టీ టికెట్ ఇవ్వాలన్నది బాబూమోహన్ వాదనగా ఉందట. దీనిని బాలయ్య వర్గం కొట్టి పారేస్తోంది. ఇద్దరూ అస్సలు మింగిల్ కావడం లేదట. బీజేపీ ఏదైనా కార్యక్రమానికి పిలుపిస్తే కలిసి నిర్వహించే పరిస్థితి లేదు. ఎవరి కుంపటి వారిదే. ఒక నియోజకవర్గం.. రెండు వర్గాలు.. రెండు శిబిరాలు అన్నట్టుగా ఆందోల్ బీజేపీ మారిపోయింది. బలం పెంచుకునేందుకు రెండు వర్గాలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయట. క్షేత్రస్థాయిలో ఒకరినొకరు చెక్ పెట్టుకునేందుకు వేస్తున్న ఎత్తులు కాషాయ శిబిరంలో కాక రేపుతున్నాయి.
ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వచ్చిన అధికార ప్రతినిధి ప్రేమ్‌జీ శుక్లాను ఆందోల్ పంపింది పార్టీ. ఈ సందర్బంగా నియోజకవర్గం విస్తృత సమావేశాన్ని జోగిపేటలో ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో బాబూమోహన్, బాలయ్య వర్గాల మధ్య ఆధిపత్యపోరాటం కనిపించింది. మీటింగ్ రసాభాసగా మారిపోయింది. అక్కడితో ఆగకుండా బాబూమోహన్‌కు వ్యతిరేకంగా బాలయ్య వర్గం నినాదాలు చేయడంతో ఉద్రిక్తతకు దారితీసింది. బాబూమోహన్ వర్గం కూడా తగ్గేదే లేదన్నట్టుగా పోటీగా నినాదాలు చేయడంతో సమావేశంలో ఏం జరుగుతుందో శుక్లా సహా పార్టీ నేతలకు ఎవరికీ అర్థం కాలేదు. కొందరు తోపులాటకు సిద్ధ పడటంతో బిత్తరపోయారట శుక్లా. ఇక లాభం లేదని భావించారో ఏమో.. ఆయన అక్కడ నుంచి మెల్లగా బయటపడి ఊపిరి పీల్చుకున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు.
ఈ రగడపై బీజేపీ రాష్ట్ర పెద్దలు కూడా ఫోకస్ పెట్టినట్టు చెబుతున్నారు. కలిసి సాగాల్సిన చోట రెండు వర్గాలుగా విడిపోయి రోడ్డెక్కడంపై కేడర్ సైతం గందరగోళంలో ఉందట. సమస్య శ్రుతిమించి.. చెయ్యి దాటిపోకుండా.. పార్టీ పెద్దలు దిద్దుబాటు చర్యలు చేయాలని కోరుతున్నారట. అయితే పార్టీ కార్యక్రమాలతో బిజీగా ఉన్న బీజేపీ తెలంగాణ నేతలు.. ఆందోల్ రచ్చపై ఫోకస్ పెడతారా లేదా అనేది పెద్ద ప్రశ్న. పైగా బాబూమోహన్, బాలయ్యలకు పార్టీలో ఎవరి లాబీయింగ్ వాళ్లదే. దాంతో సమస్య కొలిక్కి వస్తుందా.. లేక తెగే వరకు వదిలేస్తారో చూడాలి.