ఆ మధ్య తెలంగాణ బీజేపీలో కొందరు సీనియర్లు.. పాతతరం నాయకుల తీరు కలకలం రేపింది. పార్టీ వ్యవహారాలపై గుర్రుగా ఉన్న వాళ్లంతా.. బీజేపీ నిర్ణయాలకు వ్యతిరేకంగా జట్టుకట్టే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చూస్తున్న తరుణంలో ఈ పరిణామాలు కమలాన్ని కలవర పెట్టాయి. సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డిని రంగంలోకి దించి.. అసమ్మతి నేతలను బుజ్జగించే ప్రయత్నం చేశారు. దాంతో పాత నేతలు చల్లబడినట్టు సమాచారం. అయినప్పటికీ తమకు బీజేపీలో తగిన గౌరవం ఇవ్వడం లేదనే అభిప్రాయంలోనే అసమ్మతి నేతలు ఉన్నారట.
బీజేపీ జాతీయ కార్యవర్గంలో కొత్త వారికి చోటు ఇచ్చారు. పాత నాయకులను పరిగణనలోకి తీసుకోలేదు. ఆ అసంతృప్తి చల్లారకముందే.. యూపీ నుంచి తెలంగాణ బీజేపీ నేతను రాజ్యసభకు పంపుతారనే చర్చ ఓల్డ్ లీడర్స్‌ను కలవర పెట్టింది. ఆ సమయంలో చర్చకు వచ్చిన పేర్లలో అన్నీ కొత్తగా బీజేపీలో చేరిన వారివే వినిపించాయి. వారే ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నట్టు ప్రచారం సాగింది. కాషాయ కండువా కప్పుకొనే సమయంలోనే రాజ్యసభ హామీతోనే వచ్చారని వార్తలు వచ్చాయి. దీంతో బీజేపీ పాత నేతలు.. సీనియర్లు నారాజైన పరిస్థితి కనిపించింది.
అయితే కొత్తవారిని బీజేపీ జాతీయ నాయకత్వం పక్కన పెట్టేసింది. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్‌ను ఎంపిక చేయడం.. ఆయన ఎన్నిక కావడం చకచకా జరిగిపోయింది. కొత్తగా వచ్చిన వారికి జాతీయ నాయకత్వంలో చోటు కల్పించిన తర్వాత ఏం జరిగింది? రాజ్యసభ విషయంలో వారిని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? లక్ష్మణ్ విషయంలో వర్కవుట్ అయిన సమీకరణాలేంటి? అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
లక్ష్మణ్ ఎంపిక అప్పటి వరకు కంగారు పడిన బీజేపీ పాత నేతలకు పెద్ద ఊరట నిచ్చిందట. వాళ్లకు రాలేదు.. హమ్మయ్య..! మన లక్ష్మణ్‌కు ఇచ్చారు చాలు.. అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారట. ఇదంతా తమ పోరాట ఫలితమే అన్నది కొందరు అసంతృప్త నాయకుల వాదన. ఈ వేడిలో కొత్తవారికి రాజ్యసభ సీటు ఇస్తే పరిస్థితి వేరేలా ఉండేదని కామెంట్స్ చేస్తున్నారట. ఓల్డ్ లీడర్స్ వైఖరి ఇలా ఉంటే.. కొత్త నేతలు మాత్రం డీలా పడినట్టు సమాచారం. ఎక్కడ తేడా కొట్టింది అని ఆరా తీస్తున్నారట. అయితే రాజ్యసభ రేస్‌లో చివరి వరకు పేరు వినిపించిన ఒక నాయకుడు మాత్రం మరోలా ఆలోచిస్తున్నారట. తన సామాజికవర్గానికి చెందిన ప్రతినిధులతో సమావేశమయ్యే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.