కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ పేరుతో చేపడుతున్న రచ్చబండ కార్యక్రమాలు.. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య పోటీకి దారితీస్తున్నాయి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. కొందరు నేతలు పోటీపోటీగా కార్యక్రమాలు చేపడుతున్నారు. బోధన్‌తోపాటు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో ఈ రేస్ మరీ ఎక్కువగా ఉందట. బోధన్ నుంచి మరోసారి పోటీకి మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి రెడీ అవుతున్నారు. ఈ మధ్య అదే పనిగా పర్యటనలు చేస్తున్నారు. వరంగల్ డిక్లరేషన్ పేరుతో ఇంటింటా ప్రచారం మొదలుపెట్టేశారు కూడా. అయితే బోధన్‌కే చెందిన మరో కాంగ్రెస్ నేత కెప్టన్ కరుణాకర్‌రెడ్డి సైతం పోటాపోటీగా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఆయనకు పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ ఆశీసులు ఉన్నాయట. ఒకరికొకరు రాజకీయంగా చెక్ పెట్టేందుకు వేస్తున్న ఎత్తుగడలు నియోజకవర్గం కాంగ్రెస్‌లో వేడి పుట్టిస్తున్నాయి.
నిజామాబాద్ రూరల్‌లో మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ నగేష్ రెడ్డిల మధ్య యుద్ధం ముదురుతోందట. వచ్చే ఎన్నికల్లో ఇద్దరూ పోటీ చేయాలని చూస్తున్నారు. భూపతిరెడ్డి నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్నారు. అధిష్ఠానం ఆశీసులు తనకే అనే ధీమాతో మాజీ ఎమ్మెల్సీ ఉంటే.. జనం మద్దతు తనకు ఉందని చెబుతున్నారు నగేష్‌రెడ్డి. ఎవరికి వారుగా నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో.. ఎవరి వెంట ఉండాలో.. ఎవరి వెంట వెళ్తే ఏమౌతుందో అనే ఆందోళనలో కేడర్ సతమతం అవుతోందట.
బోధన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పరిస్థితిని చూశాక.. కొందరు సీనియర్లు పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారట. టికెట్ రేస్ వల్ల కేడర్ నలిగిపోతోందని.. కాంగ్రెస్ పార్టీ దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారట. నియోజకవర్గాల్లో కేవలం ఇద్దరే కాకుండా.. టికెట్ ఆశిస్తున్న మరికొందరు నేతలు కూడా వేరు కుంపట్లు పెట్టుకుంటున్నారు. ఈ సమస్యలకు ఇప్పుడే చెక్ పెట్టకపోతే ఎన్నికల నాటికి ప్రతికూల ప్రభావం చూపించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారట. మరి.. పీసీసీ ఈ రెండు నియోజకవర్గాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టి.. కేడర్‌కు క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి.