రాజకీయాల్లో గ్రూపులు కామన్. కానీ గ్రూపుల కోసమే రాజకీయాలు నడపడం అనకాపల్లి స్పెషల్. ఇక్కడ వైసీపీలో మూడు ప్రధాన గ్రూపులు ఉన్నాయి. గత ఎన్నికల్లో తొలిసారి విజయం సాధించారు ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్.. ఎంపీ భీశెట్టి సత్యవతి. మాజీమంత్రి దాడి వీరభద్రరావు కుటుంబానికి కూడా అనకాపల్లి రాజకీయాలతో 3 దశాబ్దాల అనుబంధం ఉంది. ఇటీవల మంత్రిగా ప్రమోషన్ కొట్టేశారు అమర్నాథ్. ఆ తర్వాత నియోజకవర్గంపై మంత్రి అనుచరుల పట్టు పెరిగింది. గ్రూప్ రాజకీయాల్లో కొత్త హుషారు మొదలైంది. ఇదే సమయంలో కొత్త వివాదం రాజుకుంది.
అనకాపల్లి వేల్పుల వీధిలోని గౌరీపరమేశ్వరుల ఆలయ ప్రారంభోత్సవ వేడుకలో ఎంపీ, మంత్రి వర్గాల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. నేతల అంతర్యం తెలుసుకున్నారో.. ప్రాధాన్యం మార్చుకున్నారో ఏమో.. ఆహ్వాన కరపత్రాలు, పోస్టర్లపై ఎంపీ ఫోటో తొలగించడం చర్చగా మారింది. ఈ ఉత్సవం కోసం ముద్రించిన పోస్టర్లపై ఎంపీ వెర్సస్ మినిస్టర్ అనేలా ఫైట్ మొదలైంది. గుడి ప్రారంభోత్సవం కోసం మూడు నెలల ముందుగానే సత్యవతి, అమర్నాథ్‌ల దగ్గర ఆలయ కమిటీ సమయం తీసుకుంది. అందుకు తగ్గట్టుగానే ఇద్దరూ షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. అయితే ఆలయ కమిటీ ముద్రించిన పోస్టర్ వివాదానికి కేంద్రంగా మారింది. పంప్లేట్ పై ఎంపీ, మంత్రి ఫోటోలను ఒకే సైజులో ముద్రించడంపై అమర్నాథ్ అనుచరులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థానిక రాజకీయాల గురించి తెలిసి కూడా ఒకే విధమైన ప్రాధాన్యం ఇస్తారా అని ఆలయ నిర్వహాకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు భోగట్టా.
అయితే గుడి సాక్షిగా రాజకీయాలు చేయడంపై ఎంపీ వర్గం గుర్రుగా ఉందట. చివరకు ఎవరికి సర్ది చెప్పాలో తెలియక ఎంపీ ఫోటో పీకేసి.. కేవలం మంత్రి అమర్నాథ్ ఫోటోతోనే ఆహ్వాన పత్రికలు పంపించింది ఆలయ కమిటీ. ఈ చర్య ఎంపీ వర్గానికి మరింత ఆగ్రహం కలిగించింది. అవమానంగా భావించిన ఎంపీ సత్యవతి ప్రారంభోత్సవానికి వెళ్లకూడదని నిర్ణయంచుకున్నట్టు తెలిసింది. వ్యక్తిగత పనులు మీద ఎంపీ అవుటాఫ్ స్టేషన్ వెళ్లారని కార్యాలయ వర్గాలు చెబుతున్నాయట. అనకాపల్లి అధికారపార్టీలో కోరి గిల్లికజ్జాలు ఆడుకోవడం అలవాటుగా మారింది. వినే వాళ్లకు చులకన.. చూసే వాళ్లకు పలుచన అన్నట్టుగా ఉంటున్నాయి ఇక్కడి పరిణామాలు.
అమర్నాథ్, సత్యవతిల మధ్య కొంతకాలం నుంచి ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్నది. పార్టీ శ్రేణులు రెండు వర్గాలుగా విడిపోయి చెరో పక్షం నిలిచాయి. ఆ వర్గపోరు ఇంతవరకు ఎక్కడా బయటపడలేదు. కాకపోతే తాజాగా గుడి ప్రారంభోత్సవ పోస్టర్ల విషయంలో రగడ రాజుకుంది. ఒకే సైజ్‌లో.. సమాంతరంగా మంత్రి ఎంపీల ఫొటోలను ముద్రించడం.. అమర్నాథ్‌కు నచ్చలేదని ప్రచారం జరుగుతోంది. మంత్రి, ఎంపీల మధ్య మొదటి నుంచి పడటం లేదు. రేషన్ బియ్యం రగడ బాగా గ్యాప్ తీసుకొచ్చింది. గతంలో ఎంపీ సత్యవతి ట్రస్టు కార్యాలయ భవనం వద్ద రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. దానివెనక రాజకీయ కుట్ర ఉందని ఎంపీ వర్గం అనుమానిస్తోంది. అమర్నాథ్ తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని.. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల భర్తీలో సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఎంపీ సత్యవతి సీఎంకు ఫిర్యాదు చేశారట.
అయితే పోస్టర్ల గొడవ మంత్రి నోటీసుకు వెళ్లగా ఆయన తన సన్నిహితులను మందలించినట్టు పార్టీలో మరోవర్గం ప్రచారం చేస్తోంది. అందరినీ కలుపుకొని వెళ్లాలని హైకమాండ్ సూచిస్తోంటే.. చిన్నచిన్న విషయాలు కోసం పట్టింపులకు పోవద్దని మంత్రి అమర్నాథ్ సున్నితంగా హెచ్చరించారట. మరి.. అసలు లోగుట్టు ఏంటో.. ఈ కోల్డ్‌వార్ ఎలాంటి మలుపులు తిప్పుతుందో చూడాలి.