ఏపీ కేబినెట్‌లో మంత్రులుగా ఉన్నప్పుడు ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా పనిచేశారు కొందరు నాయకులు. రాజకీయ అలజడి నెలకొంటే వెంటనే సీన్‌లోకి వచ్చేవారు. మంత్రులంటే వీరే అన్నట్టుగా బిల్డప్ ఉండేది. తరచూ సీఎమ్ క్యాంపు కార్యాలయానికి రావటం.. మీడియా సర్కిళ్లలో హడావిడి చేయటం మామూలే. అంతెందుకు.. ముఖ్యమంత్రికి పలానా సలహా ఇచ్చిందే నేనే.. సీఎమ్ స్వయంగా నన్ను పిలిచి మూడు గంటలుపాటు నాతో కూర్చుని చర్చించి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు అని చెప్పినవాళ్లూ ఉన్నారు. ఆ అంశంపై సీఎమ్‌కు సమాచారం ఇచ్చింది ఎవరో తెలుసా? అది నేనే..!! అనే డైలాగులు తాడేపల్లి సర్కిళ్లలో గట్టిగానే వినిపించేవి. నారా లోకేష్ ట్వీట్ చేసినా.. చంద్రబాబు విమర్శించినా.. వారిని ఉక్కిరిబిక్కిరి చేసేలా చాకిరేవు పెట్టేవారు అప్పటి కేబినెట్‌లో ఉన్న కొందరు మంత్రులు. ఈ విషయంలో ఒక్కో నాయకుడిదీ ఒక్కో శైలి. ఒకరు అదే పనిగా నోటికి పనిచెబితే.. ఇంకొకరు వ్యంగ్యాస్త్రాలు సంధించేవారు. మ్యానిరిజాలతో చెలరేగిపోయేవారు.
టీడీపీ అంటే కొడాలి నాని కాలు దువ్వడానికి క్షణం ఆలోచించేవారు కాదు. పవన్ కల్యాణ్‌పై కౌంటర్ అనగానే కేరాఫ్ అడ్రస్ మచిలీపట్నంగా తేలేది. పేర్ని నాని వెంటనే ఎంట్రీ ఇచ్చేవారు. పవన్ మ్యానరిజాన్ని ఇమిటేట్ చేస్తూ విమర్శలకు వ్యంగ్యాస్త్రాలు జోడించే వారు పేర్ని నాని. పార్టీని.. ప్రభుత్వాన్ని డిఫెండ్ చేయడంతో ఈ ఇద్దరూ పోటీపడుతున్నారా అనేలా చర్చ సాగేది. ఇక బీజేపీని విమర్శించడానికి వెలంపల్లి శ్రీనివాస్ మీడియాను వెతుక్కుంటూ ప్రత్యక్షం అయ్యేవారు. ఇప్పుడు తెరమీద సీన్ మారిపోయింది. ఏపీ కేబినెట్‌లోకి కొత్త ముఖాలు వచ్చాయి. 14 మంది మాజీ లయ్యారు. అప్పటి వరకు హడావిడి చేసిన నాయకులంతా మంత్రి పదవి పోగానే సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు.
చంద్రబాబు నాలుగు రోజుల పాటు ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో పర్యటించి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మునుపటిలా మాజీ మంత్రి కొడాలి నాని పెదవి విప్పలేదు. పొత్తుల గురించి పవన్ కల్యాణ్ ప్రకటనలు చేస్తున్నా.. వైసీపీ నేతలపై సెటైర్లు వేస్తున్నా.. పేర్ని నాని మీడియా ముందుకు రాలేదు. అంటీముట్టనట్టు చాలా గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు. కౌలు రౌతుల కోసం జనసేన కార్యక్రమాలు చేపట్టినా.. నాటి వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు కాకినాడ గడప దాటి రావడం లేదు. గప్‌చుప్ అయిన మాజీ మంత్రుల జాబితాలో నెల్లూరు జిల్లాకు చెందిన అనిల్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు. ఇలా ఎవరికి వారు మంత్రి పదవి పోయాక మాకేం పట్టింది అని మౌనవ్రతం దాల్చారు. దాంతో చేతిలో పదవి ఉంటేనే పెదవి విప్పుతారా అనే చర్చ పార్టీ సర్కిళ్లలో చర్చ జరుగుతోంది.