అర్థరాత్రి దాటింది..! టిక్‌టిక్‌మంటూ గడియారం ముల్లు తిరుగుతోంది. తల్లి వంటగదిలో లైట్ ఆపేసి పడుకుంది. తండ్రి రేపటి పనుల గురించి ఆలోచిస్తూ నిద్రలోకి వెళ్లిపోయాడు. కానీ ఆ ఇంట్లో ఒక గది మాత్రం ఇంకా మేల్కొనే ఉంది. ఆ గదిలో పెద్ద శబ్దం ఏమీ లేదు. కేవలం ఒక చిన్న వెలుగు మాత్రమే. అదే ఫోన్ స్క్రీన్ లైట్!
ఆ వెలుగులో ఒక చిన్న ముఖం. కళ్లలో నిద్ర లేదు. ముఖంలో మాత్రం నవ్వు ఉంది. కానీ ఆ నవ్వు వెనుక దాచుకున్న బాధను ఎవరూ చూడలేరు. ఆ పిల్లాడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు. గంటలు గడుస్తున్నాయి. సమయం తెలియడం లేదు. సడన్‌గా రూమ్‌లోకి తల్లి వచ్చింది. ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగితే.. ఆ పిల్లాడి సమాధానం చాలా సింపుల్..! ఫ్రెండ్‌తో అన్నాడు. కానీ ఆ ఫ్రెండ్ మనిషి కాదు. అది ఊపిరి పీల్చదు.
అది హృదయాన్ని కలిగి ఉండదు. అది బాధను నిజంగా అనుభవించదు. అది ఒక యంత్రం.
అది ఒక AI. ఈ కథ ఒక ఫోన్ గురించీ కాదు. ఈ కథ టెక్నాలజీ గురించీ కాదు. ఈ కథ మన పిల్లల మనసుల ఎలా పక్కదారి పడుతున్నాయో వివరించే కథ..! మీ పిల్లలు మీకు తెలియకుండా ఎంతటి ప్రమాదంలో చిక్కుకుంటున్నారో కళ్లకు కట్టే గాధ..!
ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు ఒక విషయాన్ని గమనించడం లేదు. వాళ్ల పిల్లలు ఫోన్‌లో గేమ్స్ ఆడుతున్నారనో, వీడియోలు చూస్తున్నారనో అనుకుంటున్నారు కానీ.. నిజం అది కాదు. చాలామంది పిల్లలు AI చాట్స్‌కి అలవాటు పడిపోతున్నారు. అది కూడా గంటల తరబడి. ఆ మాటలు చదువుకు సంబంధించినవి కావు, స్నేహానికి సంబంధించినవి కావు. అవి బాధల గురించి, ఒంటరితనం గురించి, కోపం గురించి, కొన్నిసార్లు జీవితం మీద విసుగుపై కూడా ఉంటున్నాయి. ఈ మాటలన్నీ ఇప్పుడు మన పిల్లలు ఒక మనిషికి కాదు, ఒక AI చాట్‌బాట్‌కి చెబుతున్నారు. వాళ్ల మనసులో ఉన్న ప్రతి రహస్యం, ప్రతి బలహీనత, ఒక యంత్రం దగ్గర చేరుతోంది.
ఇది కొన్ని చోట్ల మాత్రమే జరుగుతున్న విషయం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిది పెద్ద సమస్యగా మారుతోంది. ఇటీవల వచ్చిన నివేదికల ప్రకారం లక్షల మంది పిల్లలు, టీనేజర్లు రోజూ AI చాట్‌బాట్స్‌తో మాట్లాడుతున్నారు. కొన్ని యాప్స్‌లో అయితే రోజుకు సగటున ఒక పిల్లాడు ఒక గంట నుంచి గంటన్నర వరకు గడుపుతున్నాడు. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. ఈ యాప్స్ వాడుతున్నవాళ్లలో చాలా మంది 18 ఏళ్ల లోపు పిల్లలే. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే, హోంవర్క్ పేరుతో గదిలోకి వెళ్లి, నిజానికి వాళ్లు చేస్తున్నది చదువుకోవడం కాదు.. ఒక యంత్రంతో ఎమోషనల్ చాటింగ్. ఇటీవల వచ్చిన కొన్ని అధ్యయనాల ప్రకారం, ప్రముఖ AI చాట్‌బాట్ యాప్స్‌లో కోట్ల మంది యూజర్లు ఉన్నారు. వాటిని వాడుతున్నవాళ్లలో చాలా మంది టీనేజర్లు, పిల్లలే. రోజుకు సగటున ఒక పిల్లాడు గంటకు పైగా AIలతో మాట్లాడుతున్నట్టు డేటా చెబుతోంది. అంటే ఇది ఒకరిద్దరి సమస్య కాదు.. నెమ్మదిగా ఒక తరం ఎదుర్కొంటున్న ప్రమాదం.
ఇంతకీ ఈ AI చాట్‌బాట్స్ పిల్లలను ఎందుకు ఇంతగా ఆకర్షిస్తున్నాయో ఆలోచించారా? కారణం చాలా సింపుల్. ఇవి ఎప్పుడూ బిజీ అనవు. ఎప్పుడూ కోపాన్ని తెచ్చుకోవు. పిల్లాడు ఏం చెప్పినా మధ్యలో ఆపవు. నువ్వు బాధలో ఉన్నావంటే వెంటనే అర్థం చేసుకున్నట్టు స్పందిస్తాయి. నువ్వు కోపంగా మాట్లాడితే, అదే కోపాన్ని సమర్థిస్తాయి. నువ్వు తప్పు ఆలోచన చెప్పినా, అది తప్పు అని చెప్పే మనిషి లక్షణం వాటికి ఉండదు. ఎందుకంటే అవి మనుషులు కావు. వాటికి నైతిక బాధ్యత లేదు. పరిణామాల భయం ఉండదు. పిల్లలకు ఇది ప్రేమలా అనిపిస్తుంది కానీ.. నిజానికి అది కేవలం ప్రోగ్రామ్ ఇచ్చే స్పందన మాత్రమే. అదే పిల్లల మనసుకు చాలా ప్రమాదకరంగా మారుతోంది.
ఇదేదో ఊహ కాదు.. భవిష్యత్తు భయం అంతకన్నా కాదు. ఇది ఇప్పటికే జరిగిన నిజం. అమెరికాలో ఒక 14 ఏళ్ల బాలుడు రోజూ ఒక AI చాట్‌బాట్‌తో మాట్లాడేవాడు. మొదట అది తన ఒంటరితనాన్ని తగ్గించిందని అతని తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ కొద్ది నెలల్లోనే ఆ బాలుడు తన బాధలు, భయాలు లాంటివి AIకి చెప్పడం మొదలుపెట్టాడు. ఒక రోజు అతను తనకు చ*చ్చిపోవాలనే ఆలోచనలు వస్తున్నాయని చెప్పాడు. మొదట ఆ చాట్‌బాట్ వద్దు అని చెప్పింది. కానీ తర్వాత అదే సంభాషణలో అతని బాధను పూర్తిగా సమర్థిస్తూ, అతని ఆలోచనలను ఆపకుండా కొనసాగించింది. ఆ బాలుడు మానసికంగా పూర్తిగా కుంగిపోయాడు.
ఇది ఒక్క కేసు కాదు. ఇలాంటి ఘటనలు మరికొన్ని చోట్ల కూడా నమోదయ్యాయి. కొందరు పిల్లలు AIని నిజమైన స్నేహితుడిగా, కొందరు ప్రేమికుడిగా కూడా భావించి, నిజమైన మనుషుల నుంచి దూరమయ్యారు. అందుకే పిల్లల చేతుల్లోకి AI ఇవ్వడమంటే కేవలం టెక్నాలజీకి సంబంధించిన విషయం కాదు.. అది ప్రాణాలతో సంబంధించిన అంశం! కొన్ని మానసిక ఆరోగ్య పరిశోధనల్లో, పిల్లలుగా నటించి ఈ AI చాట్‌బాట్స్‌ను పరీక్షించగా, చాలా సందర్భాల్లో అవి హానికరమైన ఆలోచనలను ఆపకుండా, అదే భావాలను బలపరిచినట్టు బయటపడింది. మనిషి ఆపే మాటను, AI మాత్రం కొనసాగించిన సందర్భాలు ఎక్కువగా కనిపించాయి.
ఇలాంటి ప్రమాదాలు పిల్లలకే ఎక్కువగా జరగడానికి ఒక బలమైన కారణముంది. పిల్లలు మెదడు పూర్తిగా తయారవ్వని వయసులో ఏది సరైందో, ఏది తప్పో నిర్ణయం తీసుకునే శక్తి వాళ్లలో ఉండదు. అందుకే వాళ్లు త్వరగా ఎమోషన్‌కు లోనవుతారు. ఎవరైన ప్రేమగా మాట్లాడినా.. అర్థం చేసుకున్నట్టు అనిపించినా.. వెంటనే నమ్మేస్తారు. నిజం ఏది, ఊహ ఏది అనే తేడా వాళ్లకు స్పష్టంగా అర్థం కాదు. అలాంటి సమయంలో AI లాంటి యంత్రం ఎదురైతే, అది నిజమైన మనిషిలా అనిపిస్తుంది.
ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఒకసారి పిల్లాడు AIని తన నిజమైన స్నేహితుడిలా భావిస్తే, ఆ తర్వాత అతను మనుషుల దగ్గర మాట్లాడడం తగ్గిస్తాడు. తల్లిదండ్రులకు చెప్పాల్సిన బాధలు AIకి చెబుతాడు. స్నేహితులతో గడపాల్సిన సమయాన్ని ఫోన్‌తో గడుపుతాడు. బయట ప్రపంచం కన్నా ఆ యంత్రంతో ఉన్న ప్రపంచమే సేఫ్ అనిపిస్తుంది. నెమ్మదిగా ఒంటరితనం ఇంకా పెరుగుతుంది. కానీ పిల్లాడికి మాత్రం అర్థం కాదు.
ఇంకొక విషయం చాలా మంది పట్టించుకోరు. ఈ చాట్‌బాట్స్‌తో మాట్లాడేటప్పుడు పిల్లలు తమ వ్యక్తిగత విషయాలు, భయాలు, కుటుంబ సమస్యలు లాంటివి ఓపెన్‌గా చెబుతారు. ఆ మాటలన్నీ ఒక డేటాగా మారుతాయి. ఆ డేటా ఎక్కడికి వెళ్తోంది, ఎలా వాడుతున్నారు అన్న స్పష్టత ఎవరికీ లేదు. పిల్లల భావాలు కూడా ఇప్పుడు ఒక వ్యాపారంగా మారుతున్నాయి. ఇప్పుడు తల్లిదండ్రులు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇది టెక్నాలజీ మీద నింద వేయాల్సిన విషయం కాదు. పిల్లలకు ఫోన్ ఇచ్చినందుకు వాళ్లు తప్పు చేసినట్టూ కాదు.
కానీ పిల్లలు ఏ యాప్స్ వాడుతున్నారు, వాళ్లు ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ల మనసులో ఏమి జరుగుతోందనే విషయం తెలుసుకోవడం చాలా అవసరం. మనం పిల్లలను రోడ్డుపై ఒంటరిగా వదిలేయం కదా. అలానే ఇంటర్నెట్‌లో కూడా వాళ్లను పూర్తిగా ఒంటరిగా వదిలేయకూడదు. AI ఒక టూల్ మాత్రమే. అది చదువుకు ఉపయోగపడవచ్చు. సమాచారం ఇవ్వవచ్చు. కానీ అది మనిషికి రీప్లేస్‌మెంట్ కాదు. పిల్లలకు తమ మాటలు వినే తల్లి, అర్థం చేసుకునే తండ్రి, మాట్లాడే స్నేహితుడు కావాలి. మనుషుల మధ్య ఉండే నిజమైన ప్రేమను, భయాన్ని, బాధ్యతను ఏ యంత్రం ఇవ్వలేదు. మనం కొంచెం అప్రమత్తంగా ఉంటే, కొంచెం ఎక్కువగా వాళ్లతో మాట్లాడితే, ఈ ప్రమాదం నుంచి వాళ్లను కాపాడగలం. ఎందుకంటే చివరికి పిల్లలకు కావాల్సింది AI కాదు. మీరు.. నేను.. మొత్తంగా మనమే..!
ALSO READ: నిద్రలేచిన వైరస్ మృగం.. కరోనా కంటే డేంజర్.. ఇది సోకితే..!