2025…! కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయిన ఏడాది..! ప్రపంచం మొత్తం నెమ్మదిగా ఒకే దిశలో నడిచిన సంవత్సరం ఇది. బ్యాంకులు కూలిపోలేదు.. స్టాక్ మార్కెట్లు(Stock Market) ఒక్కసారిగా కుప్పకూలలేదు.. కానీ ఉద్యోగాలు మెల్లగా మాయమయ్యాయి. కంపెనీలు ఖర్చులు తగ్గించుకున్నాయి. వ్యాపారాలు ఊపిరాడని స్థితికి చేరాయి. పైకి చూస్తే అంతా నార్మల్‌లానే కనిపించింది కానీ లోపల మాత్రం గ్లోబల్ రెసెషన్(Recession) నడుస్తూనే ఉంది.
ఈ సైలెంట్ సంక్షోభం గురించి కొందరు చాలా కాలంగా హెచ్చరిస్తూనే ఉన్నారు. రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత పదేపదే ఇదే మాట చెప్పారు. రానున్న రోజుల్లో ప్రపంచం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోబోతోందన్నారు. మనం గమనించకముందే మన జీవనశైలి మారిపోతుందని చెప్పారు. 2025 కూడా అచ్చంగా అలానే గడిచింది. ఉద్యోగాలు పోయినప్పుడు అది ఒక్క వ్యక్తి సమస్యలా కనిపించింది కానీ.. ఏడాది చివరికి అది ఒక గ్లోబల్ ట్రెండ్‌గా మారిపోయింది. ఇంతకీ ఈ సంక్షోభం ఎక్కడికి దారితియ్యనుంది? 2026లో రెసెషన్ బాంబ్ పేలనుందా?
నిజానికి రెసెషన్ అంటే ఒక్కసారిగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడం కాదు. కనీసం రెండు వరుస త్రైమాసికాల్లో దేశ ఆర్థిక వృద్ధి మైనస్‌లోకి వెళ్లడం.. లేదా ఉత్పత్తి, వినియోగం, ఉద్యోగాలు ఒకేసారి తగ్గడం మొదలైనప్పుడు దాన్ని ఆర్థిక సంక్షోభంగా పిలుస్తారు. 2025లో ప్రపంచం చూసింది ఇంచుమించు ఇలాంటిదే. అమెరికా విషయానికి వస్తే 2025లో GDP వృద్ధి భారీగా మందగించింది. 2023-24లో 2శాతం పైగా ఉన్న గ్రోత్, 2025 మధ్య నాటికి ఒక శాతానికి పడిపోయింది. అదే సమయంలో టెక్ రంగంలో భారీ లేఆఫ్స్ నమోదయ్యాయి. 2025 ఒక్క ఏడాదిలోనే అమెరికాలో టెక్ కంపెనీలు 3 లక్షలకు పైగా ఉద్యోగాలను తొలగించాయి. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా లాంటి కంపెనీలు కలిపి వేల కోట్ల డాలర్ల కాస్ట్ కట్టింగ్ ప్రకటించాయి.
యూరప్ పరిస్థితి ఇంకా ఘోరంగా మారింది. జర్మనీ, బ్రిటన్ లాంటి దేశాలు టెక్నికల్ రెసెషన్ అంచుల వరకూ వెళ్లాయి. 2025లో జర్మనీ పరిశ్రమల ఉత్పత్తి తగ్గింది. ఎనర్జీ ఖర్చులు, వడ్డీ రేట్లు కలిసి చిన్న, మధ్య తరహా పరిశ్రమలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఫ్రాన్స్, ఇటలీలో నిరుద్యోగ రేటు పెరిగింది. యువతలో ఉద్యోగ భద్రతపై భయం మొదలైంది. ఇటు చైనా పరిస్థితి ప్రపంచానికి మరో హెచ్చరికగా మారింది. ఎప్పుడూ డబుల్ డిజిట్ గ్రోత్ చూపించే చైనా 2025లో 4 శాతం లోపే వృద్ధిని చూసింది. రియల్ ఎస్టేట్ రంగం అక్కడ భారీగా కుప్పకూలింది. డెవలపర్ కంపెనీలు అప్పుల భారం తట్టుకోలేక చేతులెత్తేశాయి. దీని ప్రభావం ప్రపంచ సరఫరా వ్యవస్థపై పడింది. చైనా మందగిస్తే, ఆసియా మొత్తం కదలిపోతుందన్నది 2025లో మరోసారి రుజువైంది.
ఇటు భారత్ బయటకు చూస్తే స్టేబుల్‌గా కనిపించింది. GDP వృద్ధి 6 నుంచి 7 శాతం మధ్యలో నమోదైంది. అయితే ఐటీ రంగంలో కొత్త ఉద్యోగాల క్రియేషన్ తగ్గిపోయింది. స్టార్టప్ ఫండింగ్ 2022తో పోలిస్తే 2025లో దాదాపు 40 శాతం తగ్గింది. అనేక స్టార్టప్‌లు సైలెంట్‌గా మూసుకుపోయాయి. వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఫ్రెషర్స్‌కు ఆఫర్ లెటర్లు ఆలస్యం అయ్యాయి. కొన్నిచోట్ల జాయినింగ్‌లే క్యాన్సిల్ అయ్యాయి. ఇక మ్యానుఫ్యాక్చరింగ్ రంగం కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. ఎగుమతులు తగ్గాయి. గ్లోబల్ డిమాండ్ బలహీనంగా ఉండటంతో టెక్స్‌టైల్, లెదర్, ఆటో పార్ట్స్ రంగాల్లో పని గంటలు తగ్గిపోయాయి. కొన్ని పరిశ్రమల్లో కాంట్రాక్ట్ వర్కర్లను తొలగించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు తగ్గడంతో నగరాలపై వలస ఒత్తిడి పెరిగింది.
నిరుద్యోగ గణాంకాలు అధికారికంగా పెద్దగా భయపెట్టేలా కనిపించకపోయినా, గ్రౌండ్ రియాలిటీ వేరే. CMIE అంచనాల ప్రకారం 2025లో పట్టణ యువతలో నిరుద్యోగం కొన్ని నెలల్లో 8 నుంచి 10 శాతం మధ్యలోకి చేరింది. ముఖ్యంగా డిగ్రీ, పీజీ చేసిన యువతలో జాబ్ మిస్‌మ్యాచ్ సమస్య తీవ్రమైంది. చదువు ఉన్నా, ఉద్యోగం లేకపోవడం ఒక సాధారణ పరిస్థితిగా మారింది. అటు ద్రవ్యోల్బణం మరో దెబ్బగా చెప్పాలి. ఆహార ధరలు, అద్దెలు, విద్య, వైద్యం ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. ఆదాయం పెరగని పరిస్థితిలో ఖర్చులు పెరగడం మధ్యతరగతిని తీవ్రంగా ఒత్తిడికి గురిచేసింది. సేవింగ్స్ తగ్గాయి. EMIలు భారంగా మారాయి. వినియోగం తగ్గడంతో మార్కెట్‌లో డిమాండ్ కూడా నెమ్మదించింది. ఒక్కమాటలో చెప్పాలంటే 2025లో ఇండియా రెసెషన్‌లోకి అధికారికంగా వెళ్లలేదు కానీ.. ప్రపంచ రెసెషన్ ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయింది.
ఈ మొత్తం సంక్షోభంలో కీలక పాత్ర పోషించిన అంశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు ఏఐని ఉపయోగించి ఖర్చులు తగ్గించుకోవడం మొదలుపెట్టాయి. అంతర్జాతీయ లేబర్ సంస్థ అంచనాల ప్రకారం, 2025లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8 నుంచి 10 శాతం వరకు వైట్ కాలర్ ఉద్యోగాలపై ఏఐ ప్రభావం పడింది. ఇది ఒక్క టెక్ రంగానికే పరిమితం కాలేదు. మీడియా, అకౌంటింగ్, బ్యాంకింగ్, కస్టమర్ సపోర్ట్, డిజైన్ రంగాల్లో కూడా మానవ ఉద్యోగాల అవసరం తగ్గిపోయింది.
ఇటు వడ్డీ రేట్లు ఈ సంక్షోభానికి మరొక కారణంగా మారాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను ఎక్కువగానే కొనసాగించాయి. దీంతో లోన్ల భారం పెరిగిపోయింది. ఇళ్ల కొనుగోళ్లు తగ్గాయి. ఆటో మొబైల్ రంగంలో డిమాండ్ పడిపోయింది. వినియోగం తగ్గితే ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తుందన్న సూత్రం 2025లో స్పష్టంగా కనిపించింది. ఇక ఇప్పుడంతా 2026 వైపు చూస్తున్నారు. ఎందుకంటే 2025 ఒక పూర్తి రెసెషన్ కాదు.. ఇది ఒక ట్రాన్సిషన్ ఫేజ్. అప్పులు పెరుగుతున్నాయి. ప్రభుత్వాల ఖర్చులు పెరుగుతున్నాయి. యుద్ధాలు ఇంకా ఆగలేదు. మరోవైపు చమురు ధరలు, ఆహార ధరలు ఎప్పుడైనా పెరిగే అవకాశం ఉంది.
ఇదంతా చూస్తే 2026లో భారీ షాక్ తప్పకపోవచ్చు. మొత్తంగా చూస్తే 2025 మనకు ఒక విషయాన్ని స్పష్టంగా కళ్లకు కట్టింది. ఆర్థిక వ్యవస్థ కూలిపోవాలంటే బ్యాంకులు మూతపడాల్సిన అవసరం లేదు. స్టాక్ మార్కెట్ క్రాష్ కావాల్సిన అవసరం లేదు. ఉద్యోగాలు మెల్లగా మాయమైతే చాలు. జీవితం తలకిందులవుతుంది. మరి చూడాలి 2026లో ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ. రెసెషన్ బాంబ్ పేలితే మాత్రం ప్రపంచం మళ్లీ అంధకారంలోకి జారుకోవడమైతే గ్యారెంటీ!
ALSO READ: నిద్రలేచిన వైరస్ మృగం.. కరోనా కంటే డేంజర్.. ఇది సోకితే..!