Site icon NTV Telugu

Pakistan: అంతర్జాతీయంగా ఏకాకి, ఛీ కొడుతున్న మిత్రులు.. పహల్గామ్ తర్వాత పాక్ పరిస్థితి..

Pak

Pak

Pakistan: పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మందిని పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’కి చెందిన ఉగ్రవాదులు చంపారు. ఈ దాడిలో పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ ప్రమేయానికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలను భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు చేతికి అందాయి. అయితే, భారత్‌తో ఉద్రిక్తతల నడుమ పాకిస్తాన్ తన నైజాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రపంచ దేశాల ముందు చేయని ప్రయత్నం లేదు. పాకిస్తాన్‌కి ప్రస్తుతం సాయం చేసే మిత్రులు ఎవరూ కనిపించడం లేదు. దీంతో మిత్రుల మద్దతు సంపాదించడానికి దాయాది దేశం అనేక ఇబ్బందులు పడుతోంది.

పాకిస్తాన్ విశ్వసనీయత ప్రపంచదేశాల ముందు వేగంగా క్షీణిస్తోంది. పహల్గామ్ దాడి తర్వాత తన మిత్రదేశాల మద్దతు కూడగట్టలేకపోయింది. ఇప్పుడు ప్రపంచ వేదికపై పాక్ ఏకాకిగా మిగిలింది. ఒకప్పుడు పాకిస్తాన్‌ని గట్టిగా సమర్థించిన గల్ఫ్ దేశాలు ఇప్పుడు ఆ దేశం వైపే చూడటం లేదు. పాక్ పీఎం షహజాబ్ షరీఫ్ సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాల మద్దతు పొందేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ రెండు దేశాలతో పాటు మెజారిటీ ముస్లిం దేశాలు భారత్ వైపు ఉన్నాయి. ఖతార్ వంటి దేశాలు ఇప్పుడు తటస్థతను పాటిస్తున్నాయి.

ఇక పాకిస్తాన్ ఆల్ వెదర్ ఫ్రెండ్ చైనా కూడా ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. రెండు దేశాలు ఉద్రిక్తతలు పెరగకుండా చూసుకోవాలని సలహా ఇవ్వడానికి మాత్రమే పరిమితమైంది. అయితే, టర్కీ, మలేషియా వంటి కొన్ని దేశాలు పాకిస్తాన్‌కి మద్దతు ఇస్తున్నాయి. టర్కీ వైమానిక దళానికి చెందిన సి-130 విమానం ఇటీవల పాకిస్తాన్‌కి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత టర్కీ నేవీకి చెందిన టీసీజ బుయుకాడ అనే షిప్ కరాచీకి పోర్టుకు వచ్చింది.

Read Also: AP Liquor Scam: ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో కీలక పరిణామం.. నిందితులుగా ఆ ముగ్గురు!

ఇక సోమవారం జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో పాకిస్తాన్‌ని ఏ దేశం కూడా నమ్మలేదు. UNSC క్లోజ్డ్ డోర్ సెషన్‌లో పాకిస్తాన్‌పై భద్రతా మండలిలోని దేశాలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పాకిస్తాన్, భారత్‌కి వ్యతిరేకంగా చెప్పిన విషయాలను భద్రతా మండలి సీరియస్‌గా తీసుకోలేదు. కొన్ని దేశాలు ఈ దాడిలో లష్కరే తోయిబా ప్రమేయం ఉందా..? అని ప్రశ్నిస్తే దీనికి పాకిస్తాన్ దగ్గర సమాధానమే లేదని నివేదికలు చెబుతున్నాయి.

ఇది కాకుండా, యూరప్ దేశాలు, అమెరికా కూడా పాకిస్తాన్ మాటల్ని నమ్మే పరిస్థితి లేదు. కేవలం, నోటి మాట వరకే ‘‘ఉద్రిక్తతలు పెంచవద్దు, ఇరు దేశాలు సంయమనంతో ఉండాలి’’ అనే కామెంట్స్ చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో పాకిస్తాన్ వల్ల ఏ దేశానికి ఎలాంటి ప్రయోజనం లేదని అన్ని దేశాలు ఒక నిర్ణయానికి వచ్చాయి. చైనా విషయానికి వస్తే డ్రాగన్ కంట్రీ పాకిస్తాన్‌లో చేపట్టిన బిలియన్ డాలర్ల ప్రాజెక్ట్ ‘‘చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(CPEC) ఉండటం వల్ల పాకిస్తాన్‌కి మద్దతు ఇవ్వాల్సి వస్తుంది. పాక్‌లోని గ్వాదర్ పోర్టు వంటి తమ ఆస్తులకు ఎక్కడ ప్రమాదం ముంచుకొస్తుందో అని ఆ దేశం భయపడుతోంది.

పాకిస్తాన్ తన పొరుగున ఉన్న ఏ దేశంలో స్నేహపూర్వక సంబంధాలను కలిగి లేదు. ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్, భారత్ ఇలా అన్ని దేశాలతో సమస్యలు కొని తెచ్చుకుంది. చివరకు ఆప్ఘనిస్తాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం కూడా పహల్గామ్ దాడి విషయంలో భారత్‌కి మద్దతు తెలుపుతోంది. నిజానికి, పాకిస్తాన్‌లోని నాలుగు ప్రావిన్సుల్లో బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తంఖ్వాల్లోనే పాకిస్తాన్ ప్రభుత్వానికి, వారి ఆర్మీకి మద్దతు లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్‌ ఇప్పుడు అంతర్జాతీయంగా ఒంటరి అయింది. మిత్రులు ఎవరూ కూడా ఈ విషయంలో భారత్‌ని కాదని ముందుకు రాని పరిస్థితి నెలకొంది.

Exit mobile version