Sweets: దీపావళి అంటే వెలుగుజిలుగుల పండుగ.గల్లీ గల్లీ పటాసుల మోతతో హోరెత్తుతుంది.క్రాకర్స్ ఎంత ఫేమస్సో ఈ పండుగకు స్వీట్స్ అంతే ఫేమస్.ఫెస్టివల్ ఏదైనా,ఫంక్షన్ ఏదైనా స్వీట్లు కామన్.కానీ ఇందులో దీపావళి వెరీ వెరీ స్పెషల్. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఇష్టంగా స్వీట్లు లాగించేస్తుంటారు.అందుకే దీపావళి వచ్చిందంటే మిఠాయి దుకాణాలు కిటకిటలాడుతాయి. బల్క్ గా.. టన్నుల కొద్ది తయారు చేస్తుంటాయి. పండగ శుభాకాంక్షలతో పరిశ్రమలు, ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలు, వ్యాపార వేత్తలు ప్రత్యేంగా ఆర్డర్ ఇచ్చి స్వీట్స్ తయారు చేయించి ఉద్యోగులకు ఇస్తారు.ప్రతి ఇంట్లో తీపిపదార్థాలు తెగలాగించేస్తారు.ఇలా ఈ ఒక్క పండుగకే కాదు..మామూలు టైమ్‌లోనూ సిటీల్లో స్వీట్లు తినే వారి సంఖ్య బాగా పెరుగుతోంది.నగర వాసుల్లో అత్యధికులు తీపి ప్రియులే.. నెలకు సగటున 10 సార్లకన్నా ఎక్కువే తింటున్నారు. దేశంలో స్వీట్లకు బెంగాల్ ఫేమస్.కానీ ఇప్పుడు హైదరాబాద్ కూడా పాపులర్ అవుతోంది. ఐటీ సిటీ స్వీట్స్‌కు దాసోహం అంటోంది.తియ్యని వేడుక చేసుకునే సంఖ్య పెరుగుతోంది. పండుగలతో సంబంధం లేకుండా ప్రతీ రోజూ పండుగే అన్నట్లు స్వీట్లు లాగించేస్తున్నారు. నాలుగింట మూడొంతుల మంది ప్రతీ నెలలో పదిసార్లకన్నా ఎక్కువగానే స్వీట్లు తింటున్నారు.
లోకల్ సర్కిల్స్ అనే సంస్థ దీపావళికి ముందు ఓ సర్వే చేసింది. దేశవ్యాప్తంగా 303 జిల్లాల్లో 84 వేల మందికిపైగా అభిప్రాయాల్ని తీసుకుంది. హైదరాబాద్ నుంచి 8,830 మంది ఈస్టడీలో పాల్గొన్నారు. ఈ సర్వే ప్రకారం హైదరాబాద్‌లో రోజువారీ స్వీట్లు తినే వారు 7శాతం మంది. నెలలో 15 కన్నా ఎక్కువసార్లు తింటున్నవారు 24శాతం మంది. 32శాతం మంది నెలలో 8నుంచి 15సార్లు తింటున్నారు. 14శాతం మంది నెలలో 3 నుంచి 7 సార్లు స్వీట్లు తీసుకుంటున్నారు. అస్సలు తినని వారు కేవలం 4శాతమే. సంప్రదాయ స్వీట్లతోపాటు ప్యా కేజ్డ్ స్వీట్ ఫుడ్స్‌ను అంటే కేకులు, బిస్కెట్లు, ఐస్ క్రీములు, చాక్లె ట్లు, క్యాండీలు సైతం హైదరాబాదీలు బాగానే ఇష్టపడుతున్నట్లుగా సర్వేలో తేలింది. 13శాతం మంది ప్రతిరోజూ ఏదో ఒక ప్యాకేజ్డ్ స్వీట్ ఫుడ్స్‌ను తింటున్నారు.
ప్రతి ఫ్యామిలీలో స్వీటు ప్రియులే ఎక్కువ.సర్వేలో పాల్గొన్న వారిలో 15శాతం మంది తమ ఇంట్లోని ప్రతి ఒక్కరూ చక్కెర లేదా చక్కెర ఉత్పత్తులకు బాగా అలవాటయ్యారని తెలిపారు. 18శాతం మంది తమ కుటుంబ సభ్యులలో సగం నుంచి ముప్పావు వంతు మందికి ఈ అలవాటు ఉందని చెప్పుకొచ్చారు. 26శాతం మంది తమ కుటుంబంలో ఎవరికీ మిఠాయిల పట్ల ప్రత్యేకమైన ఇష్టమేమీ లేదని తెలిపారు. స్వీట్లపై ఎంత మమకారం ఉన్నప్పటికీ, నగర ప్రజల్లో ఆరోగ్యం పట్ల కూడా అవగాహన ఉందని తెలిపింది సర్వే. ఒక్కహైదరాబాదే కాదు…జాతీయ స్థాయిలోనూ ఇదే తీరు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఇతర పట్టణాల్లోనూ స్వీట్ల పట్ల మక్కువ బాగా పెరిగిందని సర్వేలో తేలింది. 74శాతం మంది నెలకు మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు సంప్రదాయ భారతీయ స్వీట్లను తింటున్నారు. వీరిలో 5శాతం మంది రోజూ తింటున్నారు. గత ఏడాది జరిగిన సర్వేతో పోలిస్తే ఈసారి స్వీట్ల వాడకం ఏకంగా 40శాతం పెరిగినట్లు తెలిసింది. 79శాతం మంది నెలకు మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు ప్యాకేజ్డ్ స్వీట్ ఫుడ్స్‌ను తింటున్నారు.
మామూలుగా దేశంలో స్వీట్స్ బాగా ఇష్టపడతారు. మరీ ముఖ్యంగా భోజనం ముగించే ముందు ఇది తినడం అలవాటు.లేదంటే భోజనం పూర్తయ్యాక అయినా ఏదో ఒక తీపి పదార్థం తినాల్సిందే. కొన్ని చాక్లెట్స్, లేదా ఐస్ క్రీం, మిఠాయి ఇలా ఏదో ఒకటి ఖచ్చితంగా లాగించేస్తారు. దేశ వ్యాప్తంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకం ప్రసిద్ధి చెందిన స్ట్రీట్ ఫుడ్ స్వీట్స్ దొరుకుతాయి. వీటిని పంచదార లేదా బెల్లంతో తయారు చేస్తారు. స్వీట్ తింటే కొత్త ఉత్సాహం వస్తుంది. ఇక దేశవ్యాప్తంగా ఈ దీపావళి ఖర్చులు ఎంతో తెలుసా… రూ. 1.85 లక్షల కోట్లు. పండుగల సందర్భంగా స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు కానుకలు ఇవ్వడంపెరుగుతోంది. అందుకే ఈసారి ఫెస్టివల్ సీజన్‌లో, ముఖ్యంగా దీపావళి సందర్భంగా గిఫ్టింగ్ గరిష్ట స్థాయికి చేరుకుంటుందని అంచనా. పట్టణ ప్రాంత వాసులు వీటి కోసం దాదాపు రూ. 1.85 లక్షల కోట్లు ఖర్చు చేస్తారని లోకల్ సర్కిల్స్ స్టడీ వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబరు– అక్టోబర్ మధ్య జనం కానుకల కోసం 1.85 లక్షల కోట్లు ఖర్చు చేశారు.
ఈ సర్వే కోసం లోకల్ సర్కిల్ దేశంలోని 314 జిల్లాల్లోని 31 వేల కుటుంబాల నుంచి వివరాలను సేకరించింది. మెజారిటీ జనం స్థానికంగా షాపింగ్ చేయడానికి ఇష్టపడ్డారు.57శాతం పట్టణ కుటుంబాలు వ్యక్తిగతంగా బహుమతులను కొనుగోలు చేసి స్వయంగా అందజేస్తున్నట్లు తేలింది. ఆన్‌లైన్ షాపింగ్ కూడా వేగంగా పెరుగుతోంది. సర్వేలో పాల్గొన్న వారిలో 36శాతం మంది ఆన్‌లైన్‌లో బహుమతులను కొన్నారు. అయితే 21శాతం మంది మాత్రం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసినప్పటికీ, స్వయంగా అందించడానికి ఇష్టపడతామని చెప్పారు. మిగతా వాళ్లు నేరుగా డెలివరీ చేసే విధానాన్ని ఇష్టపడతామని చెప్పారు. ఈ పండగకు స్వీట్లు, బేకరీ ఉత్పత్తులు లేదా చాక్లెట్లు కొంటామని 53 శాతం మంది రెస్పాండెంట్లు చెప్పారు. చాలా మంది సంప్రదాయ బహుమతులను ఇష్టపడుతున్నారు. డ్రై ఫ్రూట్స్‌కు కూడా చాలా గిరాకీ ఉంది. ఈసారి వీటినే బహుమతిగా ఇస్తున్నామని 48శాతం మంది చెప్పారు. మరో 27శాతం మంది రెస్పాండెంట్లు కొవ్వొత్తులు, సువాసనల దీపాలకు ప్రయారిటీ ఇచ్చారు. 18శాతం మంది వంటసామాను, 16శాతం మంది రుచికరమైన ఆహారాన్ని, 12శాతం ఇంటి సామాన్లను, 12శాతం మంది ట్రేలు, టపాసులను కొన్నామని చెప్పారు. మొత్తానికి దేశంలో పండుగలతో సంబంధంలేకుండా స్వీట్లు లాగించేవారిసంఖ్య పెరుగుతోంది.నెలలో ఇంతకుముందు కంటే ఎక్కువసార్లే తింటున్నారు.ఇది పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంది.