Bitra island: భారతదేశం తన వ్యూహాత్మక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని భావిస్తోంది. హిందూ మహాసముద్రంలో భారత్ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని అనుకుంటోంది. ఈ మేరకు ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులను అభివృద్ధి చేయడంతో పాటు, అక్కడ త్రివిధ దళాలను మోహరిస్తోంది. ముఖ్యంగా, భారత నేవీ కోసం అనేక కొత్త ఏర్పాట్లను చేస్తోంది. ఉద్రిక్త సమయంలో చైనాకు సరకు రవాణా కట్ చేసేలా, మలక్కా జలసంధిని కంట్రోల్ చేసేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
Read Also: Honeymoon: హనీమూన్ కోసం పెళ్లి విందు వేలం.. సోషల్ మీడియాలో దుమారం”
బిట్రాతో వ్యూహాత్మక రక్షణ:
ఇదిలా ఉంటే, అరేబియా సముద్రంలో లక్షదీవుల్లో కూడా రక్షణ అవసరాల కోసం పెద్ద ఏర్పాట్లను చేయనున్నట్లు తెలుస్తోంది. దీని కోసం లక్షదీవుల్లో ‘‘బిట్రా ద్వీపాన్ని’’ స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయి. జూలైలో ప్రభుత్వ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం భూబాగాన్ని స్వాధీనం చేసుకుని, దాన్ని రక్షణ వ్యూహాత్మక అవసరాల కోసం బదిలీ చేయాలని చూస్తోంది. ఇప్పటికే, కవరట్టిలో ఐఎన్ఎస్ ద్వీపరక్షక్, మినికాయలో ఐఎన్ఎస్ జటాయు తర్వాత బిట్రా ద్వీపం ఇప్పుడు రక్షణ అవసరాలకు ఆతిథ్యం ఇచ్చే మూడో ద్వీపం అవుతుంది.
బిట్రా ద్వీపం అరేబియా సముద్రంలో వ్యూహాత్మక స్థానంలో ఉంది. అంతర్జాతీయ షిప్పింగ్ మార్గాలకు దగ్గరగా ఉండటంతో నిఘా, రక్షణకు చాలా ముఖ్యమైంది. ఇక్కడ నుంచి అంతర్జాతీయ రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి, గల్ఫ్ ఆఫ్ అడెన్, మలక్కా జలసంధిపై పై నిఘా వేసే అవకాశం ఉంది. పొరుగుదేశాల నుంచి పొంచి ఉన్న ప్రమాదాల నేపథ్యంలో భారత్ కీలక దిశగా అడుగులు వేస్తోంది.
ఇక్కడి నుంచి నేరుగా పాకిస్తాన్ లోని కరాచీ పోర్టుతో పాటు, ఆ దేశంలో చైనా నిర్మిస్తున్న గ్వాదర్ పోర్టుపై నిఘా వేయవచ్చు. ఉద్రిక్త సమయాల్లో ఈ రెండూ కూడా భారత నేవీ పరిధిలోకి వస్తాయి. చైనా ‘‘స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్’’ పేరుతో భారత్ చుట్టూ ఒక వ్యూహాన్ని అల్లుతోంది. ఈ నేపథ్యంలోనే మన నేవీని, రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవాలని భారత్ చూస్తోంది. ఇప్పటికే, చైనా ఆఫ్రికాలోని జిబౌటిలో ఒక స్థావరాన్ని కలిగి ఉంది. ఇక శ్రీలంకలోని హంబన్ టోటా రేవును లీజుకు తీసుకుంది. మయన్మార్ కోకో ఐలాండ్స్‌లో మిలిటరీ స్థావరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌లోని పలు రేవులను అభివృద్ధి చేస్తున్న సమచారం ఉంది. వీటన్నింటికి విరుగుడుగా ఇప్పటికే భారత్ అండమాన్ నికోబార్ దీవుల్లో పెద్ద ఎత్తున సైనిక కార్యకలాపాలను నిర్వహిస్తోంది. లక్షదీవుల ద్వారా పాకిస్తాన్‌తో పాటు గల్ఫ్ దేశాల రవాణాపై నిఘా వేయవచ్చు.
Read Also: Kollu Ravindra: “త్వరలో అతిపెద్ద తిమింగలం”.. లిక్కర్ కేసుపై మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు..
స్థానికుల నుంచి వ్యతిరేకత:
అయితే, ఈ ద్వీపంలో ఉన్న 105 కుటుంబాలనున అక్కడి నుంచి తరలించాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఈ చర్యను చాలా మంది వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ‘‘సేవ్ బిట్రా ఐలాండ్’’ అనే ప్రచారాన్ని ప్రారంభించారు. దీనికి మద్దతుగా కొచ్చిలో నిరసన నిర్వహించారు. లక్షదీవుల ఎంపీ హమ్దుల్లా సయీద్ ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తున్నారు. తమ పూర్వీకులు అప్పగించిన ఈ భూమి మాకు మాత్రమే చెందుతుందని చెప్పారు. రక్షణ అవసరాల కోసం ఇప్పటికే చాలా భూమిని కేంద్రానికి అప్పగించామని సయీద్ చెప్పారు. అక్కడి జనాలను తరిమివేసే కుట్రగా అభివర్ణించారు.