ఎక్కడ పుడితేనేం మనిషి తీసుకునే శ్వాస ఒకటే కదా.. ఒకరి గుండె పగిలితే ఆ చీలిక మనలోనూ వినిపించాలి కదా! ఎన్నో శతాబ్దాల క్రితం పెర్షియన్ కవి సాది షిరాజీ చెప్పినట్టు మనుషులంతా ఒకే శరీరానికి భాగాలు.. ఒకరి నొప్పి ఇంకొకరిని తాకాలి.! మరి ఈరోజు అలాంటి భావన ప్రజల్లో కనిపిస్తుందా? ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో ప్రపంచమంతా మానవత్వం గురించి కాకుండా రాజకీయాలే గురించే ఎక్కువగా ఎందుకు మాట్లాడుతోంది?
ఇరాన్‌లో ఓ చిన్నారి నవ్వు మధ్యలోనే ఆగిపోతుంటే మనుషులకు రాజకీయాలే ఎక్కువయ్యాయా? అసలు ఇరాన్ ప్రజలు బయటవారితోనే కాదు.. సొంత దేశంలోనే పరాయి వారిగా బతుకుతున్న విషాదం గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఇలా ఇంటా..బయటా రెండింటి మధ్య చిక్కుకుని ప్రతి రోజు గడిపే ఇరాన్ ప్రజల జీవితాలు ఎప్పటికి మారుతాయి?
ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం కేవలం రెండు దేశాల మధ్య ఘర్షణగా మాత్రమే కనిపించొచ్చు
కానీ వాస్తవం మాత్రం వేరు. ఓవైపు బాంబులు పడుతుంటే.. మరోవైపు ఇళ్లు కూలిపోతుంటే సామాన్యులు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి.
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు పెరుగుతున్న కొద్దీ మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. దాదాపు 2వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని అంచనా. కానీ ఆ సంఖ్యల్లో కనిపించని ఎన్నో కథలు ఉన్నాయి. ఎప్పుడైనా చివరి రోజు కావచ్చనే ఆలోచనతో గడిచే క్షణాలున్నాయి. ఇక్కడ ఒక కీలక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రపంచం ఈ పరిస్థితిని ఎక్కువగా జియోపాలిటిక్స్‌గా చూస్తోంది. అంటే అమెరికా వర్సెస్ ఇరాన్ శక్తుల పోరుగా లెక్కకడుతోంది. అందుకే ఈ సీన్‌లో ఇరాన్ ప్రజల బాధ కనిపించకుండా పోతోంది. ఈ పరిస్థితి ఒక్కరోజులో రాలేదు. దీని వెనుక ఒక లోతైన చరిత్ర ఉంది. 1953లో ఇరాన్‌లో ప్రజాస్వామ్యానికి మొదటి అడుగులు పడుతున్న సమయంలో ప్రధాని మొహమ్మద్ మోసాదెఘ్ ఆ దేశపు ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నాడు. అది ప్రపంచ శక్తులకు నచ్చలేదు. దీంతో ఒక కూప్ జరిగింది.
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చేశారు. ఆ తర్వాత వచ్చిన పాలనలో అసంతృప్తి పెరిగింది. దానికి ముగింపుగా 1979లో జరిగిన ఇరానియన్ రివల్యూషన్ దేశాన్ని పూర్తిగా మార్చేసింది. ఇస్లామిక్ రిపబ్లిక్ ఏర్పడింది. అక్కడి నుంచి ప్రజల జీవితం మరో దిశలోకి వెళ్లింది. జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభుత్వం నియంత్రించడం ప్రారంభించంది.
మహిళల జీవితాలు స్వేచ్ఛ లేకుండా పోయాయి. మహిళలు ఏం ధరించాలి? ఎవరితో మాట్లాడాలనే నియమాలు పెరిగాయి. ఇక్కడ ఒక విరుద్ధమైన వాస్తవం కూడా కనిపిస్తుంది. ఇరాన్‌లో మహిళల లిటరసీ రేటు 85 శాతం దాటింది. యూనివర్సిటీల్లో మహిళల చేరిక 50 నుంచి 60 శాతం వరకు ఉంది. అంటే చదువులో వారు ముందున్నారు కానీ నిజమైన విద్య అంటే కేవలం పుస్తకాలు కాదు కదా..! స్వేచ్ఛ కూడా అవసరం.. రెక్కలు కట్టేసి ఎగరమంటే అది విద్య కాదు. అదే అక్కడి మహిళల పరిస్థితి..! చదువులో ముందున్నా స్వేచ్ఛలో వెనుకబడిన దుస్థితి వారిది. అదే కారణంగా ఎన్నో సార్లు ప్రజలు రోడ్లపైకి వచ్చారు. మహిళలు తమ హక్కుల కోసం గళం ఎత్తారు. కానీ ప్రతిసారి ఆ గళాన్ని అణచివేశారు. 2022లో మహ్సా అమిని ఘటన తర్వాత వచ్చిన ఉద్యమం దేశం మొత్తం కదిలించింది.
విమెన్ లైఫ్ ఫ్రీడమ్ అనే నినాదం దాదాపు 160 నగరాలకు వ్యాపించింది కానీ ఆ ఆశలు కూడా హింసతోనే అణచబడ్డాయి. ఇక్కడితో ఇది ఆగలేదు.. పేదలు, వర్కింగ్ క్లాస్, మైనారిటీలు.. ఇలా ప్రతి వర్గం తమదైన సమస్యలతో పోరాడుతోంది.
కుర్ద్స్, సున్నీలు, బలూచ్ ప్రజలు సాంస్కృతికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వివక్షను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిలో ఇరాన్ ప్రజల మనసులో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. కొంతమంది ఇప్పటికీ ప్రభుత్వాన్ని నమ్ముతున్నారు. కొంతమంది మార్పు కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకొందరు బయట నుంచి సహాయం వస్తుందేమో అని ఆశిస్తున్నారు. కానీ యుద్ధం మొదలైన తర్వాత ఈ ఆశలు కూడా మారుతున్నాయి. ముందు మార్పు కోసం ఎదురుచూసిన వాళ్లు కూడా ఇప్పుడు బాంబుల భయంతో జీవిస్తున్నారు. స్వేచ్ఛ కంటే ముందుగా ప్రాణాలు కాపాడుకోవడం ముఖ్యం అయింది. ఇదే అసలు విషాదం. బయట నుంచి వచ్చే దాడులు..లోపల ఉన్న నియంత్రణ..ఇలా ఈ రెండింటి మధ్య ప్రజలు చిక్కుకుపోయారు. అయితే ప్రపంచం ఒక వైపు మాత్రమే చూస్తోంది. కానీ నిజం రెండు వైపులా ఉంది. ఒకటి ఇంపీరియలిజం. మరొకటి రిలీజియస్ కంట్రోల్.
ఇరాన్ ప్రజలు ఈ రెండింటినీ ఎదుర్కొంటూ ప్రతి రోజు గడుపుతున్నారు చివరికి ఒక సాధారణ ఇరానియన్ మహిళ మనసులో ఉన్న భావన ఇదే. బాంబులు ఆగిపోయిన తర్వాత కూడా మార్పు రాకపోతే మిగిలేది కూలిపోయిన ఇళ్లే. అందుకే ఇలాంటి వ్యవస్థ మారకపోతే ఎప్పటికైనా ఇరాన్ పాలన కూలక తప్పదు. అది బయట నుంచా..లోపలా నుంచా అన్నది మాత్రం ఇప్పటికైతే చెప్పలేం.