ఇండియా టూర్‌లో మెస్సీ ఆడలేదు. గోల్ చెయ్యలేదు. కాలు కదపలేదు. ప్రత్యర్థి జట్లను వణికించిన ఆ పాదాల మాయాజాలం భారత ప్రేక్షకులు వీక్షించనే లేదు. అతను ఆడకపోవడం వెనక చాల కథ వుంది. అది కొందరికి విచిత్రంగా, వింతగా కూడా అనిపించొచ్చు. ఇంతకీ అతను ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడకపోవడానికి కారణమేంటి? మెస్సీ అంటే ప్రపంచవ్యాప్తంగా పిచ్చి. భారత అభిమానులకు ఎనలేని అభిమానం. అతన్ని చూడాలనే కాదు…అతని ఆటను స్వయంగా చూసి తరించాలని వేల రూపాయల టికెట్ కొనుక్కుని వెళ్లారు. కోల్‌కత, హైదరాబాద్, ముంబై, ఢిల్లీల్లో జనం బ్రహ్మరథం పట్టారు. కానీ అతను ఫోటోలకు ఫోజులివ్వడమే కానీ..ఆట ఆడలేదు. ఎందుకంటే, అతని లెగ్స్ వ్యాలూ 9 వేల కోట్లు. ఔను. అతని కాళ్ల విలువ అక్షరాల 9 వేల కోట్లు. ఈ కాస్ట్ వెనక కహాని ఏంటి?
అర్జెంటీనా దిగ్గజ ఫుట్ బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా ఎనలేని క్రేజ్ వుంది. భారత దేశ పర్యటనలోనూ ఎటుచూసినా అద్భుతమైన స్వాగతం లభించింది. కోల్‌కతాలోనైతే ఆయనపై క్రేజ్ బీభత్సకాండగా మారింది. హైదరాబాద్‌లోనూ ఊహించనిస్థాయిలో బ్రహ్మరథం లభించింది. ముంబైలోనూ ఓ రేంజ్‌లో జనప్రవాహం కదలివచ్చింది. చివరిరోజు ఢిల్లీలోనూ ఓ స్థాయిలో అభిమానగణం వెల్లువెత్తింది. ఆయనను చూడ్డానికి, ఆయన ఆటను వీక్షించడానికి వేల రూపాయల టికెట్ కొని ప్రేక్షకులు తరలివచ్చారు. టీవీలు, స్మార్ట్‌ఫోన్లలో కోట్లాదిమంది లైవ్ తిలకించారు. కానీ మెస్సీ ఎక్కడా ఆట ఆడకపోవడం అందర్నీ అసంతృప్తికి గురి చేసింది. దాని వెనక అసలు కారణం మరింతగా షాకిస్తోంది.
కోల్‌కతలో క్రికెట్ తో పాటు ఒక్కోసారి క్రికెట్‌ను మించిన ఫుట్‌బాల్ పిచ్చి వుంది. స్టేడియంలో మెస్సీ ఆడతాడని బెంగాలీ ఫ్యాన్స్ ఆశించారు. మెస్సీ మెరుపులు, చిరుతలాంటి పరుగు కళ్లారా చూస్తామని భావించారు. కానీ మెస్సీ కనీసం కాలు కదపలేదు. ఫ్యాషన్ షోలో క్యాట్ వాక్ మోడల్‌లా అలా నడచుకుంటూ పోయాడు. చేతులు ఊపుతూ అభివాదం చేస్తూ పోయాడు. పట్టుమని అరగంట కూడా స్టేడియంలో వుండకపోవడంతో, ఆయన వీరోచిత ఆటకాదు కదా…కనీసం ప్రశాంతంగా చూడలేకపోయారు. దాంతో స్టేడియాన్ని బద్దలు కొట్టేశారు. మెస్సీ ఎందుకు కాలికి పని చెప్పలేదని అసలు కారణమని తెలుసుకుని, కోల్‌కతా ఫ్యాన్స్ ఇదేం విచిత్రమని ఆశ్చర్యపోయారు.
కోల్‌కతాలో ఆడలేదు సరే…కనీసం హైదరాబాద్‌లోనైనా లెగ్గుకు పని చెబుతాడని అందరూ అనుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి టీం వర్సెస్ మెస్సీ టీం హోరాహోరిగా మ్యాచ్ జరుగుతుందని భావించారు. కొన్ని రోజుల నుంచి మెస్సీతో ఆడేందుకు సీఎం రేవంత్ రెడ్డి తెగ ప్రాక్టీస్ కూడా చేశారు. ఆయన ఫుట్‌బాల్ ఆటగాడి డ్రస్‌లోనే జెర్సీ, ఫుట్‌బాల్ షూస్ వేసుకుని రెడీ అయ్యారు. కానీ మెస్సీ మాత్రం టీ షర్ట్, ప్యాంట్‌తోనే దర్శనమిచ్చాడు. కనీసం ఫుట్‌బాల్ ప్లేయర్‌గా కనిపించలేదు. నలుగురు గుమికూడి ఏదో బాల్ అటు ఇటు పాస్ చేసుకున్నారు. మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ అనుకున్నారు. కానీ అదే అసలు మ్యాచ్ అని, గోల్స్ కూడా కొట్టారని, చాలా సేపు సస్పెన్స్ తర్వాత గానీ అందరికీ అర్థంకాలేదు. అలా హైదరాబాద్‌లోనూ మెస్సీ మెస్మరైజింగ్ ప్లే మిస్సయ్యింది. అందరూ కట్టకట్టుకుని డిజప్పాయింట్ అయ్యారు.
పోనీ ముంబైలోనైనామ మనోడు కాలు కదిపాడా అంటే అదీ లేదు. సచిన్ టెండూల్కర్‌తో ఫోటోలు దిగడమే సరిపోయింది. ఇద్దరూ జెర్సీలు మార్చుకోవడమే మురిసిపాటయ్యింది. గోల్ పోస్ట్ లేదు….గోల్ కీపర్‌కు మెస్సీ బాల్‌ను తన్నింది లేదు. ఎంతో ఆశించి, వేలు ఖర్చుపెట్టి, పనీపాట పక్కనపెట్టుకుని మెస్సీ మ్యాజిక్‌ను చూద్దామనుకున్న ముంబై చాలా నిరాశపడింది. మెస్సీ టూర్‌లో చివరిరోజయిన ఢిల్లీలోనైనా ఆడతాడని అందరూ తెగ ఆశలు పెట్టుకున్నారు. ప్రొఫెషనల్‌గా, పక్కా ప్లేయర్‌గా ఫైనల్ టుక్, టచ్ ఇస్తాడని లెక్కలేశారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో కూడా ఫన్ గేమ్‌లా ఆడాడు. ఒక్క గోల్ కూడా చెయ్యలేదు. ఫోటోలు, జెర్సీలు, అభివాదాలతో సరిపోయింది. సీ యూ సూన్ ఇండియా అంటూ టూర్ ముగించాడు. అలా ఢిల్లీ ఫ్యాన్స్‌నూ ఉసూరుమనించాడు.
ఇంతకీ మెస్సీ ఎందుకు ఆడలేదు….కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీలో కనీసం ఒక్క గోల్ కూడా ఎందుకు చెయ్యలేదు? కోట్లాదిమంది అభిమానులను ఎందుకు నిరాశ పరిచాడు? కనీసం ఒక ఐదు నిమిషాలైనా, ఈ గోల్ పోస్ట్ నుంచి ఆ గోల్ పోస్ట్ వరకు బాల్ ను పాస్ కూడా ఎందుకు చెయ్యలేదు? గోల్ కీపర్‌ను తికమక చేసి గోల్ ఎందుకు కొట్టలేదు…పెనాల్టీ షూటౌట్‌లా కూడా గోల్‌ను ఎందుకు చెయ్యలేదని…భారతీయులు తెగ బాధపడ్డారు. మనవాళ్లు సరైన మర్యాద చెయ్యనందుకు ఫీలయ్యాడేమోనని అనుకున్నారు. గ్రేట్ ఆఫ్ ఆల్ టైమ్ ఆటగాడు నొచ్చుకున్నాడేమోనని శంకించారు. కానీ మనోడు కాలికి పని చెప్పకపోవడానికి అసలు కారణం తెలుసుకుని విస్తుపోయారు. ఈ లెగ్స్ కాస్ట్ ఎంతో తెలుసా….లియోనెల్ మెస్సీ ఎడమ కాలి విలువెంతో ఐడియా వుందా? మెస్సీ పాదాల ఇన్సూరెన్స్ 9వేల కోట్లు. అవును.. .మీరు విన్నది నిజమే. మెస్సీ లెగ్స్ వ్యాల్యూ 1 బిలియన్ డాలర్.. అక్షరాలా 9వేల కోట్లు. అందులో ఎడమపాదం విలువ 7వేల కోట్లు.
ఇంతవిలువైన ఎడమకాళ్లను అందుకే వాడలేదు మెస్సీ. ఎందుకంటే రెండు కాళ్లకు ఇన్సూరెన్స్ చేయించాడు. మళ్లీ మీరు ఆశ్చర్యపోతున్నారా….ఇది నిజంగా నిజం. ఆయన కాళ్లకు 9 వేల కోట్ల రూపాయల బీమా వుంది. మెస్సీ కాళ్లు సాధారణ కాళ్లు కావు. కోట్ల రూపాయల ఆస్తి. అంతర్జాతీయ స్పోర్ట్స్ ఇన్సూరెన్స్ అంచనాల ప్రకారం, అతని కెరీర్‌లో వివిధ దశల్లో మెస్సీ కాళ్లకు సుమారు 700 మిలియన్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్ల వరకు బీమా వుందని అంచనా. ఇక ఎడమకాలికైతే ఏకంగా ఏడు వేల కోట్ల ఇన్సూరెన్స్ వుంది.
ఎడమకాలికి అంత ఇన్సూరెన్స్ ఎందుకంటే, ఆ కాలే మెస్సీ ప్రధాన బలం. గోల్స్, ఫ్రీకిక్స్, డ్రిబ్లింగ్ అన్నీ ఎక్కువగా ఎడమ కాలుతోనే చేస్తాడు మెస్సీ. ఒకవేళ ఏదైనా గాయమై ఆట కొనసాగించలేని సిచ్యువేషన్ వస్తే….క్లబ్‌లు, స్పాన్సర్లు నష్టపోవడమే కాదు రోడ్డునపడతాయి. అందుకే ఫైనాన్షియల్ ప్రొటెక్షన్‌కు ఇంత భారీ మొత్తంలో బీమా చేయించారు. ఇండియాలో ఆడి, గాయమైతే ఇన్సూరెన్స్ వర్తించదు. డబ్బులు రావు. అందుకే మనోడు ఇండియాలో తన కాళ్ల మాయాజాలాన్ని ప్రదర్శించలేదు. ఉత్సవ విగ్రహంలా వుండిపోయాడు..మహా అయితే రోబోలా అటు ఇటు తిరిగాడు. ఎందుకంటే బీమా మహిమ…కాళ్ల విలువ.
విజువల్స్
ఎందుకు ఆడలేదు….ఎందుకు ఆడలేదన్న ప్రశ్నకు ఇదే సమాధానం. ఇంత భారీ ఇన్సూరెన్స్ కారణంగా, మెస్సీ ఇండియా టూర్ లో మ్యాచ్ ఆడలేకపోయాడు. మెస్సీ ఆడటానికి పర్మిషన్ వున్నది కేవలం అర్జెంటీనా జాతీయ జట్టు, తన క్లబ్ కు మాత్రమే. ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు లేదా ఇతర ఈవెంట్లలో పూర్తి స్థాయిలో ఆడితే, ఇన్సూరెన్స్ నిబంధనలు ఉల్లంఘన అవుతాయి. బీమా డబ్బులు రావు. అందుకే ఎడమకాలికి గాయం కాకుండా, బంగారు బాతుగుడ్డులా, అపురూపంగా కాపాడుకున్నాడు మెస్సీ. మెస్సీ లాంటి ఆటగాడి పైన కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. అతన్ని స్పాన్సర్ చేస్తున్న క్లబ్, అతని ఎండార్స్‌మెంట్లు, మ్యాచ్‌లు, బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్ ఇలా ఎక్కడ చూసినా కోట్ల డాలర్లు ఉంటాయి. అలాంటి వ్యక్తికి చిన్న ఇంజూర్ అయినా అన్ని సంస్థలు వీధినపడతాయి. అందుకే రక్షణ కోసం భారీ ప్రీమియంతో పాలసీలు తీసుకుంటారు. కెరీర్‌ను ముగించేంత పెద్ద గాయాలు, దీర్ఘకాలిక గాయాల నుంచి ఈ పాలసీలు కాపాడతాయన్నది వారి లెక్క. మెస్సీ మెస్మరైజింగ్ ఆట చూడలేదని ఇండియన్స్ ఎంత బాధపడినా, వాస్తవం ఇదే. ఎందుకంటే మెస్సీ అనేవాడు ఆటగాడే కాదు…ఒక అసెట్ కూడా. అతని ప్రతీ అడుగూ కొన్ని వందల కోట్లతో ముడిపడి ఉంటుంది.
విజువల్స్
బీమా వుంది కదా దీమాగా ఆడొచ్చు కదా అని అనుకోవడానికి వీల్లేదు…ఈ ఇన్సూరెన్స్ అనేది అధికారిక మ్యాచ్‌లు, యూరో లీగ్ వంటి పెద్ద వాటికే కవర్ ఇస్తుంది. దేశాల మధ్య పోటీలు, వాటి ప్రాక్టీస్ సెషన్లు క్లబ్ అనుమతించిన శిక్షణా శిబిరాలకు మాత్రమే బీమా వర్తిస్తుంది. చారిటీ, ఎగ్జిబిషన్, ప్రమోషనల్ మ్యాచ్‌లు మాత్రం బీమా కవరేజ్ వుండదు. ఇవి కూడా కవర్ కావాలంటే క్లబ్, వైద్యబృందం, బీమా కంపెనీల అనుమతి వుండాలి. అదనంగా కోట్లలో ప్రీమియం చెల్లించాల్సి వుంటుంది. అయినా రిస్క్ వుండొచ్చు. ఇలాంటి మ్యాచ్‌లతో గాయం అయితే కేరీర్ మొత్తం ముగిసిపోవచ్చు. అది అతనికే నష్టంకాదు. కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారా సామ్రాజ్యం దెబ్బతింటుంది. అందుకే పెద్దగా ప్రయోజనం లేని ఎగ్జిబిషన్ చారిటీ మ్యాచ్‌ల కోసం క్లబ్‌లు మెస్సీ లాంటి ఆటగాడితో రిస్కులు చెయ్యడానికి సాహసించవు. అందుకే మన ఇండియా టూర్‌లో మెస్సీ కాలు కదపలేదు.
జనరల్‌గా ఇన్సూరెన్స్ బాడీ మొత్తానికి ఎవరైనా చేయించుకుంటారు. యాక్సిడెంట్ పాలసీ తీసుకుంటారు. అదంతా సామాన్యులు తీసుకునే బీమా. కానీ చాలామంది సెలబ్రిటీలు తమ శరీర భాగంలోని అత్యంత ఆకర్షణీయమైన భాగానికి బీమా దీమా తీసుకుంటారు. ఎందుకంటే, మనిషి జీవితంలో ఇన్సూరెన్స్ కీలకం. అందులోనూ సెలబ్రిటీలు, క్రీడాకారులకు తమ కెరీర్ పరంగా ప్రతి అవయవం అత్యంత ప్రధానం. వారిలో మోస్ట్ ప్లస్ పాయింట్ బాడీ పార్ట్ కు ఏమైనా అయితే, వారి మొత్తం క్లోజ్. అందుకే తమ బాడీ పార్ట్స్ కు ఇన్సూరెన్స్ చేయించుకుంటారు. చాలా మంది సెలబ్రిటీలు తమ శరీరంలోని విలువైన పార్ట్‌కు బీమా చేయించుకున్నారు. ఇన్ని శరీర భాగాలకు ఇన్సూరెన్స్ కచ్చితమైన లిమిట్ లేదు. సాధారణంగా కొన్ని పార్ట్స్‌కు బీమా వుండేలా చూసుకుంటారు. అందులో.. గొంతు, పెదవులు, పిరుదులు, కళ్లు, కాళ్లు, చేతులు, వేళ్లు, బ్రెస్ట్, మొత్తం శరీరం, వృషణాలు, నాలుక, చెవులు, భుజాలు, మొఖం, పాదాలు, ముక్కు’, క్లోమ గ్రంథి సెక్సువల్ ఆర్గాన్స్, ఇలా బాడీ పార్ట్స్ కు ఇన్సూరెన్స్ చేసుకుంటారు.
ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ కళ్లతోనే మాయ చేస్తుంది. ఆ నయనాలే ఆమెకందం. అభిమానులను మంత్రముగ్దులను చేసే తన కళ్లకు ఇన్సూరెన్స్ చేయించుకున్నారని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దేశం గర్వించదగ్గ గాయని లతా మంగేష్కర్. ఆ సుమధురస్వరమే దేశాన్ని ఓలలాడించింది. అందుకే తన ఎవర్‌గ్రీన్ వాయిస్‌కి బీమా చేయించుకుంది. కొంతమంది తారలకు వాయిస్ బిగ్ అసెట్. అందులో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ స్వరానికి తిరుగులేదు. ఆయన గద్గద స్వరానికి కోట్లాదిమంది ఫిదా. ఆ గ్రేట్ గళానికి అమితాబ్ బీమా చేయించుకున్నాడని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా తన కంఠానికి ఇన్సూరెన్స్ చేయించుకున్నాడని ప్రచారం వుంది.
కొందరు తారలు నవ్వితే రత్నాలు రాలినట్టు వుంటుంది..అందుకే ఆ నవ్వుకు కూడా ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. అందమైన నవ్వు నటి, గాయని సింథియా ఎరివో స్మైల్‌కు ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. బ్రిటన్‌కు చెందిన సింథియా గ్రామీ, ఎమ్మీ, టోనీ వంటి అవార్డులు కొల్లగొట్టింది. ఆస్కార్‌కు కూడా నామినేట్ అయిన నటి. ఎరివో ముందు పళ్లల్లో కొంచెం గ్యాప్ ఉంటుంది. దానివల్ల తన నవ్వు స్పెషల్‌గా వుంటుందని సింథియా గ్రహించారు. అందుకే ఆమె తన నోటిని 16.5 కోట్ల రూపాయలకు బీమా చేయించారు.
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా తన పెదవులపై భారీ మొత్తానికి బీమా చేయించుకున్నారని చాలాకాలంగా ప్రచారంలో వుంది. తన పెదవులపై కాపీరైట్ హక్కులు కూడా పొందారట. ఇక హాలీవుడ్ సుందరి జూలియా రాబర్ట్స్ చిరునవ్వుకు ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె కూడా తన నవ్వుకు ఇన్సూరెన్స్ చేయించుకున్నారని హాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ బ్యూటీ మల్లికా షెరావత్ మొత్తం శరీరానికి బీమా చేస్తామంటూ ఇన్సురెన్స్ కంపెనీలు ఆమెను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. ఇందుకోసం పలు ఇంటర్నేషనల్ బీమా సంస్థలు రూ.50 కోట్ల విలువైన ఇన్సూరెన్స్ ప్రపోజల్స్ ఇచ్చాయని ప్రచారం జరిగింది.
బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం ఇన్సూరెన్స్ సంగతి అందర్నీ స్టనయ్యేలా చేస్తుంది. ఆయన తన పిరుదులకు సుమారు రూ.10 కోట్ల ఇన్సూరెన్స్ తీసుకున్నారన్న పుకారు షికారు కొట్టింది. బిగ్‌బాస్ బ్యూటీ రాఖీ సావంత్ కూడా తన పిరుదులకు బీమా చేయించుకున్నారని అప్పట్లో బాలీవుడ్‌లో వైరలైంది. చేతులు, వేళ్లకు కూడా ఇన్సూరెన్స్ తీసుకున్నవారున్నారు. ఒలింపిక్ బాక్సర్ విజేందర్ సింగ్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చేతులకు బీమా చేయించుకున్నారని తెలుస్తోంది.
హాలీవుడ్‌లో జేమ్స్‌బాండ్ హీరోల క్రేజీనే వేరు. వారిలో కాస్త డిఫరెంట్ హీరో డేనియల్ క్రేగ్. బాండ్ పాత్రధారుల్లో అత్యంత ధనికుడు కూడా ఈయనే. ఓ షూటింగ్‌లో యాక్సిడెంట్ జరిగి గాయపడ్డారు. అందుకే ఆయన టోటల్ బాడీకి ఆయన ఇన్సూరెన్స్ చేయించాడు. నటీనటులకు వారి అవయవాలు, అందం, నటన, స్వరం అత్యంత ప్రధానం. అలాగే క్రీడాకారులు, వారి క్రీడా నైపుణ్యాలు వారి బ్రాండ్‌కు, ఆదాయానికి కీలకం. అనుకోకుండా జరిగే ప్రమాదాలు, గాయాలు లేదా ఏదైనా అనారోగ్య సమస్య..వారి కెరీర్‌ను దెబ్బకొడతాయి. అందుకే ప్రతి బాడీ పార్ట్‌కు ఇన్సూరెన్స్ చేయించారు.
సాకర్‌లో మరో గోల్డెన్ లెగ్ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డో. పోర్చుగల్‌కు చెందిన ఈ ఫుట్‌బాల్ దిగ్గజం ఇప్పటిదాకా 900 పైగా గోల్స్ చేశాడు. మెస్సీకి ప్రత్యర్థి. ఓ ఫుట్‌బాల్ ఆటగాడిగా రొనాల్డోకు తన కాళ్లు చాలా ఇంపార్టెంట్. అందుకే ఆయన తన ఒక్కో కాలిని 45 మిలియన్ల డాలర్లకు బీమా చేయించాడు. ప్రఖ్యాత గాయని జెన్నిఫర్ లోపెజ్ కూడా తన స్వరానికి కాదు ఇన్సూరెన్స్ చేయించకోలేదు. తన బ్యాక్‌కు బీమా చేయించుకుంది. ఏకంగా 27 మిలియన్ డాలర్లకు ఇన్సూరెన్స్ తీసుకుంటుందట. మరో గాయని రిహన్నా కూడా తన లెగ్స్ కు ఇన్సూరెన్స్ చేయించుకుంది. ఏకంగా ఒక మిలియన్ డాలర్లకు తన లెగ్స్ కు బీమా తీసుకుంది.
సంగీతం ద్వారా సుసంపన్నురాయ్యింది టేలర్ స్విఫ్ట్. తన పాటలతో ఉర్రూతలూగించింది. 2008లో యు బిలాంగ్ విత్ మి పాటతో గొప్ప పాపులారిటీ సాధించింది ఈ అమెరికన్ పాప్ సింగర్. పాటతో పాటు ఆమె పొడవాటి కాళ్లూ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. 2015 వరల్డ్‌టూర్ సందర్భంగా టేలర్ తన కాళ్లను 40 మిలియన్ డాలర్లకు బీమా చేశారనే వార్తలు గుప్పుమన్నాయి. యాత్రల్లో, స్టేజీ మీద నృత్యాల్లో కాళ్లకు దెబ్బలు తగులుతాయనే భయంతో అంత పెద్ద మొత్తం బీమా చేయించుకున్నారట టేలర్. ఇక మరింత విచిత్రమేమిటంటే అమెరికన్ కమెడియన్, రియాలిటీ షో స్టార్ నిక్ క్యానన్.. తన ప్రైవేటు పార్ట్స్‌కు ఏకంగా 10 మిలియన్ డాలర్లు అంటే సుమారు 83 కోట్లకు బీమా చేయించుకున్నారట. తన శరీరంలో అత్యంత విలువైన భాగానికి బీమా చేయించుకుంటే తప్పేంటని అతను అన్నాడట.
ఎలిజబెత్ టేలర్ తన స్తనాలకు ఇన్సూరెన్స్ చేయించుకుందట. జూలియా రాబర్ట్స్ స్మైల్‌కి బీమా దీమా వుండాలని భావించిందట. ఇలా చెప్పుకుంటూపోతే ప్రపంచవ్యాప్తంగా ఎందరో తమ శరీర భాగాలకు ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. మూవీ సెలెబ్రిటీలు, క్రీడాకారులు తమ వృత్తికి, ఆదాయానికి కీలకంగా ఉండే బాడీ పార్ట్స్‌ను ఇన్సూరెన్స్ చేయించుకోవడం వెనక అనేక బలమైన కారణాలున్నాయి. నటీనటులకు వారి అవయవాలు, అందం, నటన, స్వరం అత్యంత ప్రధానం. అలాగే క్రీడాకారులు, వారి క్రీడా నైపుణ్యాలు వారి బ్రాండ్‌కు, ఆదాయానికి కీలకం. అనుకోకుండా జరిగే ప్రమాదాలు, గాయాలు లేదా ఏదైనా ఆరోగ్య సమస్యలతో ఈ కీలక బాడీ పార్ట్స్ కు నష్టం జరిగితే.. అది వారి కెరీర్‌నే ప్రమాదంలోకి నెట్టేస్తుంది. అదే జరిగితే వారి బ్రాండ్, ఆదాయానికి నష్టం. అందుకే, ముందు జాగ్రత్తగా స్టార్లు వారి శరీర భాగాలకు బీమా కవరేజ్ వుండేలా చూసుకుంటారు. ఇలాంటి బీమా పాలసీలు సెలబ్రిటీల మార్కెటింగ్‌కు కూడా బాగా ఉపయోగపడతాయి. అందరూ చర్చించుకునేలా చేస్తాయి. అది వారి బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంచుతాయి.
మెస్సీ లాంటి ఆటగాడు….మామూలు ఆటగాడు. సాకర్ ప్రపంచాన్ని శాసించే ప్లేయర్. ఒక్కరోజుకే స్టార్ కాదు. బిజినెస్ భాషలో అతనొక లాంగ్‌టర్మ్.. హై రిటర్న్ అసెట్. అందుకే అలాంటి వ్యవస్థను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలూ జరుగుతాయి. ఇదంతా షార్ట్స్ వేసుకుని.. బూట్లు తగిలించుకుని గ్రౌండ్‌లోకి దిగినంత ఈజీ కాదు. అందుకే మెస్సీ మన ఇండియాలో అడుగుపెట్టినా, కాలు కదపలేదు. రెచ్చిపోయి ఫుట్ బాల్ ఆడలేదు. ఏదో అలా కాలు కదిపాడంతే. ఎందుకంటే, అతని కాలే అతనికి ఆస్తి. ఇలా ఎందరో క్రీడాకారులు, సినీ తారలు తమ శరీర భాగాలను ఇన్సూర్ చేసుకోవడం కొత్తేమీ కాదు. వారి బ్రాండ్ ఆ రేంజ్‌లో వుంది.
విజువల్స్
ఇవి సాధారణంగా సామాన్యుల కోసం ఉద్దేశించినవి పాలసీలు కావు. ఎందుకంటే, ఇలా బాడీపార్ట్స్‌కు ఇన్సూరెన్స్ చేయాలంటే ఎక్కువ మొత్తంలో ప్రీమియం చెల్లించాలి. అధిక ఆదాయం ఉన్న సెలెబ్రెటీలు, క్రీడా ప్రముఖులు మాత్రమే ఈ స్థాయిలో ప్రీమియంలు కట్టగలుగుతారు. సెలబ్రిటీలు మాత్రమే ఇలాంటి ఇన్సూరెన్స్‌లు చేయించుకుంటారు. సామాన్య ప్రజలకు ఇది అవసరం కూడా ఉండదు. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులు సెలబ్రిటీలకు నచ్చజెప్పి మరీ ఇలాంటి ఇన్సూరెన్స్‌లను చేయిస్తారు. దీని వెనుక వ్యాపారం, పబ్లిసిటీ యాంగిల్ కూడా వుంటుంది. మొత్తానికి మెస్సీ ఇండియా టూర్‌లో ఎందుకు ఆడలేదన్న డౌట్ వెనక ఇంత కథ వుంది. ఆయన కాళ్ల విలువ 9 వేల కోట్ల రూపాయలు మరి.