నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘అఖండ 2’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుంది. ఈ సినిమాకి కలెక్షన్ల వర్షం కురుస్తోంది. అయితే, ఈ సినిమాలో కొన్ని సీన్స్ మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా, తలతో దిష్టి తీసే సీన్‌తో పాటు, హెలికాప్టర్ ఫ్యాన్‌ను త్రిశూలంతో తిప్పే సీన్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
అయితే, ఈ సీన్ వైసీపీ ఎన్నికల గుర్తు అయిన ఫ్యాన్‌ను, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తిప్పుతున్నట్టుగా కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. తాజాగా, మీడియాతో ముచ్చటించిన సందర్భంగా బోయపాటి శ్రీనుకు ఇదే ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన స్పందిస్తూ, తనకు అలాంటి ఉద్దేశం ఏమీ లేదని అన్నారు. తాను ఎవరినైనా విమర్శించాలి అనుకుంటే, నేరుగా డైలాగ్స్‌తో విమర్శిస్తా కానీ, ఇలా డొంకతిరుగుడుగా విమర్శించే అవసరం లేదని అన్నారు.
హెలికాప్టర్ పేలినప్పుడు అందులో నుంచి వచ్చే ఏదైనా, అక్కడ ఉన్న జనాన్ని హాని కలిగించబోతుండగా, అఖండ అడ్డుకోవాల్సిన వచ్చేలా సీన్ రాసుకున్నామని అన్నారు. అప్పుడు ఉన్న అన్నింటిలో ఫ్యాన్ అయితే అనువుగా ఉంటుందని భావించి, అక్కడ ఆ ఫ్యాన్ రెక్కలను వాడాం తప్ప, ఎవరినీ విమర్శించాలి అనే ఆలోచన తమకు లేదని ఆయన అన్నారు. అలాగే, అఖండ సినిమా కేవలం ఒక సినిమా కాదని, భారతదేశ ఆత్మ అని అన్నారు. ఏదైనా విషయం అందరికీ నచ్చాల్సిన అవసరం లేదని, నచ్చని వారు ట్రోల్ చేస్తూ ఉండి ఉండవచ్చని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
