మోస్ట్ అవైటెడ్ సినిమా ‘అఖండ తాండవం’ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో, నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట నుంచే సినిమాకి మంచి పాజిటివ్ టాక్ లభించింది. ఈ నేపథ్యంలో కలెక్షన్లు కూడా గట్టిగానే వస్తున్నాయి.
‘
అఖండ’ సినిమా 2021లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో ఆ సినిమాకి సీక్వెల్‌గా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా చివరిలో కూడా మరో భాగానికి అవకాశం ఉంది అన్నట్టుగా ఓపెన్ ఎండింగ్ ఇచ్చారు. ఈ సినిమా ఎండింగ్‌లోనే శంబాల అనే ప్రాంతానికి అఖండ వెళుతూ ఉండడం చూపించారు.
ఇక తాజాగా మీడియాతో ముచ్చటించిన బోయపాటి శ్రీను, అఖండ మూడవ భాగం అక్కడి నుంచే ప్రారంభం కాబోతుందని క్లారిటీ ఇచ్చేశారు. “అక్కడ ముగించాం కాబట్టి అక్కడి నుంచే ప్రారంభించాల్సి ఉంటుందంటూ” ఆయన మాట్లాడారు. అయితే, అఖండ నుంచి ‘అఖండ 2’కు స్పాన్ (విస్తృతి) పెరిగిందని, ఇప్పుడు మూడవ భాగానికి ఆ స్పాన్ మరింత పెరుగుతుందని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ సినిమాని సంయుక్తంగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మించారు. అయితే, రిలీజ్ కావాల్సిన రోజు వాయిదా పడిన ఈ సినిమా ఒక వారం తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయినా ఎక్కడా తగ్గకుండా ఈ సినిమా ప్రభావం చూపిస్తోంది.