Abhishek Banerjee: రాళ్లు విసురుతున్నారు.. కోడిగుడ్లతో కొడుతున్నారు..మమత మేనల్లుడుపై ఎందుకింత కసి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ ప్రజలు ఒకప్పుడు కమ్యూనిస్టుల సుదీర్ఘ పాలనకు వ్యతిరేకంగా ఎలాగైతే మమతా బెనర్జీకి బ్రహ్మరథం పట్టారో… అదే ప్రజలు అంతే ఆగ్రహంతో తృణమూల్ కాంగ్రెస్‌ను పాతాళానికి తొక్కేశారు. అయితే ఎన్నికల్లో ఘోరంగా ఓడించినా బెంగాలీల ఆగ్రహం చల్లారినట్టు లేదు. అందుకే టీఎంసీ కార్యకర్తలు…నేతలు.. ఎక్కడ కనిపించినా దాడులకు దిగుతున్నారు. ముఖ్యంగా మమత హయాంలో ఓ రేంజ్లో చెలరేగిపోయిన ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్టీని టార్గెట్ చేసుకున్నారు. అభిషేక్ బెనర్టీ బెంగాల్ వీధుల్లో కనిపిస్తే చాలు..ఆయనపై రాళ్లు…కోడిగుడ్లు పడుతున్నాయి. బెంగాల్ ప్రజలకు అభిషేక్ బెనర్జీపై ఎందుకింత కసి…?
అభిషేక్ బెనర్టీ రాష్ట్ర సంపదను దోచుకున్నారా?
అన్నీ కలిసొస్తే మమతాబెనర్జీ తర్వాత ముఖ్యమంత్రి పీఠంగా కూర్చోవాల్సిన వ్యక్తి..ఇలా నడిరోడ్డులో జనాగ్రహానికి తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ క్షణమైతే పశ్చిమబెంగాల్లో అధికార మార్పిడి జరిగిందో అప్పటి నుంచే అభిషేక్ బెనర్టీకి వ్యతిరేకంగా ఆందోళనలు మొదలయ్యాయి. వ్యక్తిగతంగా టీఎంసీ.. మమతా బెనర్జీపై కసి కంటే అభిషేక్ బెనర్జీపై ఆగ్రహంతో ప్రజలు ఊగిపోతున్నారు. ఎందుకంటే.. బెంగాలీలు అభిషేక్ బెనర్జీని కేవలం ఓడిపోయిన పార్టీ నాయకుడిగా మాత్రమే చూడటం లేదు… రాష్ట్ర సహజ సంపదను కొల్లగొట్టిన… యువత భవిష్యత్తును నాశనం చేసిన అవినీతి సామ్రాజ్యానికి.. అణచివేతకు ప్రతిరూపంగా భావిస్తున్నారు. మమత బెనర్టీ మేనల్లుడిపై అకస్మాత్తుగా ఇంతటి సామూహిక వ్యతిరేకత వెల్లువెత్తడానికి ప్రధానంగా ఆయన చుట్టూ అల్లుకున్న వేల కోట్ల రూపాయల కుంభకోణాలే కారణంగా కనిపిస్తున్నాయి.
Also Read
- Halloween: అర్థరాత్రి 12 దాటగానే వింత శబ్దాలు.. ఆ యూనివర్శిటీలో దెయ్యాలున్నాయా?
- Bengal Police: మమతా గూండాల బట్టలూడదీసి..! పశ్చిమబెంగాల్లో రౌడీల భరతం పడుతున్న సువెందు అధికారి
- IRAN-US DEAL: అక్షరాల రూ.28లక్షల కోట్ల భారీ డీల్.. ఇరాన్-అమెరికా యుద్ధంలో కీలక మలుపు!
- Suvendu Adhikari: బంగ్లాదేశ్ గుండెల్లో వణుకు పుట్టిస్తోన్న బెంగాల్ సీఎం.. అక్రమ వలసదారుల తాట తీస్తున్నాడుగా!
బొగ్గు స్మగ్లింగ్ స్కామ్ అంటే ఏంటి?
అభిషేక్ బెనర్జీ పేరు కొన్నేళ్లుగా పశ్చిమ బెంగాల్‌ను కుదిపేసిన అత్యంత వివాదాస్పదమైన బొగ్గు స్మగ్లింగ్ కుంభకోణంతో నేరుగా ముడిపడి ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని కునుస్తోరియా కజోరా కోల్‌ఫీల్డ్స్ కేంద్రంగా వేల కోట్ల రూపాయల అక్రమ బొగ్గు రవాణా మైనింగ్ దందా ఏళ్ల తరబడి యథేచ్ఛగా కొనసాగింది. ఈ కుంభకోణంపై సీబీఐ నవంబర్ 2020లో మొదటి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ దర్యాప్తు ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించింది.
ఈడీ న్యాయస్థానానికి సమర్పించిన ఆధారాల ప్రకారం.. బొగ్గు కుంభకోణం ద్వారా వచ్చిన వేల కోట్ల రూపాయల ముడుపులలో ప్రధాన భాగం నేరుగా అభిషేక్ బెనర్జీకి… ఆయన భార్య రుజిరా బెనర్జీకి ఆయన మరదలు మేనకా గంభీర్‌కు చేరింది. ఈ నిధులను హవాలా మార్గాల ద్వారా లండన్ థాయ్‌లాండ్‌లలోని వారి ఖాతాల్లోకి మళ్లించినట్లు ఈడీ బలమైన ఆధారాలు సేకరించింది. ఈ కేసుకు సంబంధించి అభిషేక్ బెనర్జీ ఆయన భార్య రుజిరా బెనర్జీలను ఈడీ అనేకసార్లు విచారించింది. రాష్ట్ర సహజ వనరులను ఒక మాఫియా తరహాలో దోచుకుని విదేశాలకు తరలించారని మెజార్టీ బెంగాల్ ప్రజలు అభిషేక్‌పై ఆగ్రహంతో ఉన్నారు.
బొగ్గు కుంభకోణం రాష్ట్ర ఖజానాను కొల్లగొడితే… నిరుద్యోగ యువత భవిష్యత్తును విద్యా వ్యవస్థను అంధకారం చేసిన ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం అభిషేక్ బెనర్జీ ప్రతిష్టను మరింత ఘోరంగా దిగజార్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు నాన్-టీచింగ్ సిబ్బంది నియామకాల్లో అర్హత సాధించిన అభ్యర్థులను పక్కనబెట్టి లక్షల రూపాయల లంచాలు తీసుకుని అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టారని అభిషేక్ బెనర్టీ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ కుంభకోణంలో అప్పటి విద్యాశాఖ మంత్రి టీఎంసీ సీనియర్ నాయకుడు పార్థా ఛటర్జీ కీలక పాత్ర పోషించారు. ఈడీ దాడుల్లో ఆయన అనుచరుల ఇళ్లలో కోట్ల కొద్దీ నగదు కుప్పలుగా పట్టుబడటం అప్పట్లో రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. ఈ కుంభకోణంతో అభిషేక్ బెనర్జీకి నేరుగా సంబంధం ఉందన్న ఆధారాలు బయటపడటం ప్రజల ఆగ్రహానికి ప్రధాన కారణమైంది.
అభిషేక్ బెనర్జీ ప్రాతినిధ్యం వహించే డైమండ్ హార్బర్ లోక్‌సభ నియోజకవర్గం కొన్నేళ్లుగా టీఎంసీ అనుకూల మీడియా ద్వారా పార్టీ నాయకుల ద్వారా ఒక ఆదర్శవంతమైన పరిపాలనా నమూనాగా వార్తల్లో నిలిచింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అభిషేక్ ఇక్కడి నుంచే ఏకంగా 7 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కొన్ని బూత్‌లలో అయితే ఏకంగా 99 శాతం ఓట్లు టీఎంసీకే పోలయ్యాయి. అయితే క్షేత్రస్థాయి వాస్తవాలు… స్థానిక ప్రజల జీవన ప్రమాణాలు ఈ అంకెల గారడీకి పూర్తి భిన్నంగా ఉన్నాయి.
ఈ నియోజకవర్గం భౌగోళికంగా బంగ్లాదేశ్ సరిహద్దులకు సుందర్బన్స్ మడ అడవుల ప్రాంతానికి సమీపంలో ఉండటం వలన ఇది అక్రమ సరిహద్దు రవాణాకు… మానవ అక్రమ రవాణాకు ..ఇంధన స్మగ్లింగ్‌కు కేంద్రంగా మారిందని ప్రతిపక్షాలు బలంగా ఆరోపించాయి. తృణమూల్ నాయకులు అక్రమ చొరబాటుదారులతో ఒక సురక్షితమైన ఓటు బ్యాంకును నిర్మించుకున్నారన్నది ప్రధాన విమర్శ. బీజేపీ నాయకులు ఈ డైమండ్ హార్బర్ ప్రాంతాన్ని పాకిస్తాన్‌లోని కరాచీ నగరపు కరడుగట్టిన నేర సామ్రాజ్యానికి కేంద్రమైన ల్యారీ తో పోల్చారంటే అక్కడ ఎంతటి అరాచక పాలన…వసూళ్లు.. సిండికేట్ ఆపరేషన్లు నడుస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఈ మోడల్ అసలు స్వరూపం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యంగా డైమండ్ హార్బర్ లోక్‌సభ పరిధిలోకి వచ్చే ఫాల్టా శాసనసభ నియోజకవర్గంలో జరిగిన రీ-పోలింగ్‌లో బట్టబయలైంది. పోలింగ్ రోజున ఫాల్టా నియోజకవర్గంలో తృణమూల్ గుండాలు యథేచ్ఛగా దౌర్జన్యాలకు పాల్పడ్డారు. కేంద్ర బలగాల పటిష్ట భద్రత మధ్య ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం వచ్చినప్పుడు ఫాల్టా ఫలితాలు సంచలనం సృష్టించాయి. రీ-పోలింగ్‌లో బీజేపీ అభ్యర్థి దేబాంగ్షు పాండా ఏకంగా 71.2% ఓట్ల శాతం సాధించారు.
సోనార్‌పూర్‌లో అభిషేక్ బెనర్జీపై స్థానికులు భౌతిక దాడికి దిగడం వెనుక వేరే కారణాలు కూడా ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన అత్యంత అహంకారపూరితమైన బెంగాలీ సంస్కృతిని అవమానించే వ్యాఖ్యలు ప్రజలను బాధించాయి.
ఎన్నికల సమయంలో ఒక బహిరంగ సభలో అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ…. మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రవీంద్ర సంగీతానికి బదులుగా డీజే మ్యూజిక్ ప్లే చేస్తాం. అప్పుడు మిమ్మల్ని కాపాడటానికి ఢిల్లీ నుంచి ఏ నాయకుడూ రాడు.. అని ప్రతిపక్షాలను సామాన్య ఓటర్లను ఉద్దేశించి తీవ్ర బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ పట్ల గౌరవం ప్రదర్శించే బెంగాలీ సమాజానికి.. ఆయన సాంస్కృతిక వారసత్వమైన రవీంద్ర సంగీతాన్ని కించపరచడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఎన్నికల తర్వాత మిమ్మిల్ని ఎవరూ కాపాడలేరు అంటూ అభిషేక్ బెనర్టీ చేసిన వ్యాఖ్యలను ఓటర్లను చాలా సీరియస్‌గా తీసుకున్నారు.
అభిషేక్ బెనర్జీ ఎదుర్కొంటున్న ప్రస్తుత వ్యతిరేకత కేవలం ప్రతిపక్షాల నుంచి లేదా సామాన్య ప్రజల నుంచి వస్తున్నది మాత్రమే కాదు. సొంత పార్టీ నేతల నుంచి కూడా ఉంది. మమతా బెనర్జీ తన మేనల్లుడిని ప్రత్యామ్నాయ అధికార కేంద్రంగా మార్చడానికి ప్రయత్నించారు. 2011లో మమతా బెనర్జీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆల్-ఇండియా తృణమూల్ యువ అధ్యక్షుడిగా.. సైబర్ యూనిట్ అనధికారిక హెడ్‌గా రాజకీయ రంగ ప్రవేశం చేసిన అభిషేక్… అతి తక్కువ కాలంలోనే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర భవిష్యత్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అత్యున్నత స్థాయికి ఎదిగారు.
అయితే ఈ ఎదుగుదల సహజసిద్ధంగా కింది స్థాయి నుంచి జరిగింది కాదు. తన నాయకత్వాన్ని నిలబెట్టుకోవడానికి.. సీనియర్లను అదుపు చేయడానికి అభిషేక్ బెనర్జీ పార్టీలో ఎన్నో మార్పులు చేశారు. దీంతో అభిషేక్‌పై సొంత పార్టీ నేతలే ఆగ్రహంతో రగిలిపోయేవాళ్లు. ఎటువంటి కింది స్థాయి పోరాటాలు చేయకుండా నేరుగా ఉన్నత పదవిలో కూర్చున్న యువ నాయకుడు తమపై పెత్తనం చెలాయించడాన్ని సీనియర్ నాయకులు సహించలేకపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలా మంది టీఎంసీని వీడటానికి కూడా కారణం ఇదే.
ఒక రాజకీయ నాయకుడి నిజమైన బలం ప్రజల్లో ఉందా లేక రాష్ట్ర యంత్రాంగం కల్పించే కృత్రిమ భద్రతలో ఉందా అనేది అధికారం కోల్పోయిన మరుక్షణం స్పష్టమవుతుంది. ఎన్నికల ఫలితాల తర్వాత అభిషేక్ బెనర్జీ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. దశాబ్దాలుగా అభిషేక్ బెనర్జీ చుట్టూ జెడ్-ప్లస్ కేటగిరీ భద్రతా వలయం ఉండేది. కోల్‌కతా పోలీసులు ఆయనపై ఈగ కూడా వాలకుండా చూసుకునే వాళ్లు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత అభిషేక్ బెనర్జీ భద్రతను తీసేశారు.. ఆయన్ను మరో టీఎంసీ నేతగా మాత్రమే బీజేపీ ప్రభుత్వం భావించింది. కట్టలు తెంచుకున్న జనాగ్రహం కోడిగుడ్ల దాడుల రూపంలో బయటపడింది.
అభిషేక్ బెనర్జీని బెంగాల్ ప్రజలు అసహ్యించుకోవడానికి కారణం కేవలం ఆయన వ్యక్తిత్వం మాత్రమే కాదు.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అవినీతి.. దౌర్జన్యం అణచివేతలతో కూడిన ఒక పాడైపోయిన వ్యవస్థ. భయం నీడలో.. పోలీసు బూట్ల కింద బతికిన ప్రజలు… ఒక్కసారి ఆ భయం తొలగిపోగానే చొక్కాలు పట్టుకుని ఎదురుతిరుగుతున్నారు.
:ఫణి కుమార్ (NTV DIGITAL)
తాజావార్తలు
-
Abhishek Banerjee: రాళ్లు విసురుతున్నారు.. కోడిగుడ్లతో కొడుతున్నారు..మమత మేనల్లుడుపై ఎందుకింత కసి?
-
Ashok Dinda: క్రికెట్ నుంచి రాజకీయాలకు.. బెంగాల్ మంత్రిగా మాజీ భారత పేసర్.!
-
Tragedy: చూడ ముచ్చటైన జంట.. పెళ్లైన కొద్ది గంటల్లోనే విషాదం.. హెలికాప్టర్ ప్రమాదంలో భారత సంతతి పైలట్ మృతి
-
CM Revanth: రూ.1000 కోట్ల నిధులపై సీఎం ఫోకస్.. అధికారులకు సీరియస్ వార్నింగ్.!
-
Virat Kohli Watch Price: ఆ ఒక్క వాచ్ తో ఓ కుటుంబం లైఫ్ టైం సెటిల్ కదయ్యా.. RCB సంబరాల్లో కోహ్లీ వాచ్ హాట్ టాపిక్.!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!