ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ ‘జెప్టో’ డెలివరీ బాయ్ అత్యాచారయత్నం చేశాడు. ఓ ఐటీ ఉద్యోగిని కిరాణా సామాగ్రి డెలివరీ ఇచ్చిన అనంతరం.. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అత్యాచారయత్నం చేశాడు. యువతి గట్టిగా కేకలు వేయడంతో.. డెలివరీ బాయ్ అక్కడి నుంచి పరారీ అయ్యాడు. ఐటీ ఉద్యోగిని ఫిర్యాదు చేయగా.. పోలీసులు డెలివరీ బాయ్‌ని అరెస్ట్ చేశారు. ఈ ఘటన చెన్నైలోని కుబేరన్ నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
మడిపాక్కంకు చెందిన మహిళా ఐటీ ఉద్యోగిని జెప్టో యాప్ ద్వారా కిరాణా సామాగ్రికి ఆర్డర్ చేసింది. గోపీనాథ్ అనే డెలివరీ బాయ్ కిరాణా వస్తువులను డెలివరీ చేశాడు. సెల్‌ఫోన్ చార్జింగ్ లేదని, ఎమర్జెన్సీ అని చెప్పి.. కాసేపు ఛార్జింగ్ పెట్టుకుంటానని కోరడంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని గోపీనాథ్‌ను ఇంటి లోపలకి అనుమతించింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆమెపై గోపీనాథ్ అత్యాచారయత్నం చేశాడు. యువతి గట్టిగా కేకలు వేయడంతో డెలివరీ బాయ్ ఇంట్లో నుంచి పరారీ అయ్యాడు.
చుట్టుపక్కల వారు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఇంట్లోకి వెళ్లి చూశారు. విషయం తెలుసుకున్న వారు ఈ ఘటనపై జెప్టోకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఐటీ ఉద్యోగిని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు. విచారణ చేపట్టి గోపీనాథ్‌ను అరెస్ట్ చేశారు. తప్పు చేయడమే కాకుండా, బాధిత మహిళ విషయాన్ని చెప్పిన జెప్టో స్పందించకపోవడంపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.