టీమిండియా మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మలు విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. 2020లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ ఇద్దరు.. 2025లో విడిపోయారు. చహల్ కొన్నిరోజులుగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఆర్జే మహ్వశ్తో డేటింగ్లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. చహల్-మహ్వశ్ కలిసి టీమిండియా మ్యాచ్‌లకు హాజరవ్వడంతో.. సమ్‌థింగ్.. సమ్‌థింగ్ అంటూ నెట్టింట ప్రచారం సాగుతోంది. తాజాగా దీనిపై యూజీ పరోక్షంగా ఓ హింట్ ఇచ్చాడు.
ఇటీవల గౌతమ్ గంభీర్, రిషబ్ పంత్, అభిషేక్ శర్మతో పాటు యుజ్వేంద్ర చహల్ నెట్‌ఫ్లిక్స్‌లో టెలికాస్ట్ అవుతున్న ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’లో పాల్గొన్నారు. హోస్ట్ కపిల్ శర్మ సరదాగా అందిరిని ప్రశ్నలు అడిగాడు. ఈ క్రమంలో ‘మిస్టరీ గర్ల్’ గురించి చహల్‌ను ప్రశ్నించాడు. ‘ఇప్పటికే దేశం మొత్తం తెలుసు’ అని యూజీ బదులిచ్చాడు. వెంటనే రిషబ్ పంత్ మాట్లాడుతూ.. విడాకుల తర్వాత చహల్ స్వేచ్ఛా మనిషి అయ్యాడన్నాడు. దాంతో అక్కడ నవ్వులు పూశాయి. మొత్తానికి మహ్వశ్తో డేటింగ్ నిజమే అని యూజీ చెప్పకనే చెప్పాడు. మహ్వశ్తో డేటింగ్ నిజమే అని చహల్ అంగీకరించాడని సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Kohli-Rohit: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అభిమానులకు షాక్!
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన మహ్వశ్.. ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ నుంచి మాస్ కమ్యూనికేషన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. ప్రాంక్ వీడియోలతో యూట్యూబ్‌లో చాలా పాపులర్ అయ్యారు. అదే సమయంలో రేడియో జాకీగానూ గుర్తింపు సాధించారు. ఇక యుజ్వేంద్ర చహల్‌తో డిన్నర్ డేట్, టీమిండియా మ్యాచ్‌లకు హాజరవ్వడంతో ఫేమస్ అయ్యారు. మహ్వశ్ బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల ‘ప్యార్ పైసా ఔర్ ప్రాఫిట్’ అనే సిరీస్‌లో కనిపించారు.