NTV Telugu Site icon

Lok Sabha Speaker Election: స్పీకర్‌ ఎన్నికలో బిగ్‌ ట్విస్ట్..! ఎన్డీఏకు వైసీపీ మద్దతు

Bjp Ycp

Bjp Ycp

Lok Sabha Speaker Election: లోక్‌సభ స్పీకర్‌ ఎన్నికల వేళ జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.. తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని కోరింది భారతీయ జనతా పార్టీ.. దీనిపై సానుకూలంగా స్పందించింది వైసీపీ.. అయితే, లోక్‌సభ స్పీకర్‌ ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని వైసీపీ నిర్ణయించడం ఆసక్తికరంగా మారింది.. దీంతో, ఎన్డీఏ అభ్యర్థికి మరింత బలం పెరిగింది.. వైసీపీకి లోక్‌సభలో నలుగురు ఎంపీలు ఉన్నారు.. ఎన్డీఏకు ఇప్పటికే 293 సభ్యుల బలం ఉంది.. వైసీపీ సభ్యుల సపోర్ట్‌తో ఎన్డీఏ బలం 297కు పెరిగినట్టు అయ్యింది.

Read Also: Kidney Stones : కిడ్నీలో రాళ్లున్నాయా..? అయితే ఇలా చెక్ చెప్పండి..

కాగా, అటు ఎన్డీఏ.. ఇటు ఇండియా కూటమిలో లేకుండా తటస్థంగా ఉంది వైసీపీ.. ఇప్పుడు స్పీకర్‌ ఎన్నిక విషయంలో అనూహ్యంగా ఎన్డీఏకు బయటి నుంచే మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది..ఈ పరిణామం.. జాతీయ రాజకీయాల్లోనే కాకుండా.. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లోనూ ఆసక్తికరంగా ఉంది.. ఎన్డీఏ కూటమిలో బీజేపీ బలం 240 స్థానాలు మాత్రమే.. మ్యాజిక్‌ ఫిగర్‌ 272కి 32 స్థానాలు తక్కువగా ఉన్నాయి.. దీంతో.. టీడీపీ 16 సీట్లు, జేడీయూ 12 సీట్లు కలుపుకుంటేనే ఎన్డీఏకు మ్యాజిక్‌ ఫిగర్‌ దక్కుతుంది. అయితే, స్పీకర్‌ ఎన్నికల్లో ఇండియా కూటమి ఎత్తుగడలు వేస్తుండడంతో.. అత్యంత అప్రమత్తం అయ్యింది బీజేపీ.. ఎందుకైనా మంచిది అంటూ.. వైసీపీ లాంటి తటస్థ పార్టీల మద్దతు అడుగుతుంది. స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవం చేయాలన్న సాంప్రదాయంలో భాగంగా అన్ని పార్టీల మద్దతు కోరడం ఆనవాయితీ.. ఇందులో భాగంగానే వైసీపీ మద్దతు అడిగింది బీజేపీ.. అయితే, ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉండడంతో.. వైసీపీ మద్దతు ఎవరికి? అనే సస్పెన్స్‌ కొనసాగింది.. కానీ, ఆ ఉత్కంఠకు తెరదించిన వైసీపీ.. ఎన్డీఏకు మద్దతు ప్రకటించింది.. స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవం కావాలన్న ఉద్దేశంతోనే వైసీపీ మద్దతు ప్రకటించినట్టుగా తెలుస్తోంది. కాగా, రేపు లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక జరగనున్న విషయం విదితమే.