Lella Appi Reddy: ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలలో పాల్గొనటం చంద్రబాబుకు ఇష్టం లేదని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. రౌడీయిజం చేసి, రిగ్గింగులు చేసి గెలుపొందాలనుకోవటం దారుణమని ఆరోపించారు. అరాచకాలకు వత్తాసు పలికిన ఇద్దరు ఎస్పీలపై సస్పెన్షన్ వేటు పడిందని.. చంద్రబాబు ట్రాప్‌లో పడి పోలీసు అధికారులు తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. తాడిపత్రిలో పెద్దారెడ్డి ఇంట్లో సీసీకెమెరాలను పోలీసులే పగలకొట్టటం దేనికి సంకేతమంటూ ఆయన ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా చేసే కుట్ర ఎవరు చేశారో తేలాలన్నారు.
నరసరావుపేటలో ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డి ఇంటిపై పట్టపగలే దాడి చేశారని.. అక్కడి పోలీసు అధికారుల ప్రోద్బలంతోనే ఈ దాడులు జరిగాయని ఆయన ఆరోపణలు చేశారు. టీడీపీకి మద్దతు ఇచ్చిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. జూన్ 4న జగన్ సునామీ వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించిన ఆయన.. వ్యవస్థలను మేనేజ్ చేసే కుట్రలతో చంద్రబాబు బిజీగా ఉన్నారంటూ విమర్శలు గుప్పించారు. పురంధేశ్వరి ఇచ్చిన లిస్టు ప్రకారం పోలీసు అధికారులను మార్చారని.. ఆ మార్చిన చోటే హింస చెలరేగిందంటే అర్థం ఏంటని ప్రశ్నించారు. ఒక కుట్ర ప్రకారమే ఈ అల్లర్లు జరిగాయని లేళ్ల అప్పిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.
