NTV Telugu Site icon

YSRCP: పవన్‌ పిఠాపురం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారంతో వైసీపీ అలర్ట్!

Pawan Kalyan

Pawan Kalyan

YSRCP: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారంతో అధికార పార్టీ వైసీపీ అలర్ట్ అయ్యింది. ప్రస్తుతం పిఠాపురం వైసీపీ కోఆర్డినేటర్‌గా ఉన్న ఎంపీ వంగా గీతకు సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. ఆ పిలుపు నేపథ్యం ఇన్‌ఛార్జ్ వంగా గీత హుటాహుటిన తాడేపల్లికి బయలుదేరి వెళ్లారు. ముద్రగడ కుటుంబాన్ని పార్టీనలో చేర్చుకుని పిఠాపురం నుంచి బరిలోకి దింపాలన్న ఆలోచనలో వైసీపీ ఉన్నట్లు సమాచారం. వంగా గీతకు కాకినాడ పార్లమెంట్ పరిధిలో మరో అసెంబ్లీ నియోజకవర్గాన్ని కేటాయించే ప్రతిపాదనను వైసీపీ పెద్దలు పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

Read Also: GVL Narasimha Rao: కేంద్రం అవకాశం ఇస్తే విశాఖ ఎంపీగా పోటీ చేస్తా..

పవన్‌కల్యాణ్‌ పిఠాపురం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుండగా.. దానికి తగ్గట్లుగానే జనసేన నేతలు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి వైసీపీ కూడా అలర్ట్‌ అయ్యింది. పిఠాపురం నుంచి పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తే.. బలమైన ప్రత్యర్థిని బరిలో నిలపాలని వైసీపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ పిఠాపురం సిట్టింగ్‌ వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబును కాదని.. కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతకు పిఠాపురం కోఆర్డినేటర్‌గా అధిష్ఠానం బాధ్యతలను అప్పగించింది. ప్రస్తుతం ఆమె నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు కూడా చేసుకుంటున్నారు.

Read Also: YSRCP: వైసీపీలోకి పులివెందుల టీడీపీ నేత సతీష్ రెడ్డి

ముద్రగడ పద్మనాభం పవన్‌కల్యాణ్‌కు సంబంధించి గురువారం బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ముద్రగడ జనసేన పార్టీలో చేరే అవకాశం లేదని ఆ లేఖ ద్వారా స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం లేదా ఆయన కుటుంబంలోని ఎవరినైనా బరిలో నిలపాలనే యోచనలో వైసీపీ పెద్దలు ఉన్నట్లు సమాచారం. ముద్రగడ కుటుంబ సభ్యులు బరిలో ఉంటే బలమైన పోటీ ఉంటుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దానికి తగ్గట్లుగానే వంగా గీతను పిలిపించి పార్టీ పెద్దలు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.