Botsa Satyanarayana: జూన్ 9న విశాఖపట్నంలో రెండోసారి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు మంత్రి బొత్స సత్యనారాయణ.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో మళ్లీ వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రభుత్వం రావాలి అనే విధంగా పోలింగ్ జరిగింది.. ఇచ్చిన మాట తప్పకుండా జగన్ ఐదేళ్లు పని చేశారు.. ఎన్నికల్లో జగన్ కొత్త ట్రెండ్ తీసుకువచ్చారు.. మంచి జరిగితే ఓటు వేయాలని జగన్ కోరారు అని గుర్తుచేశారు. విద్య, వైద్యం, పరిపాలనలో సంస్కరణలు కొనసాగిస్తామని జగన్ చెప్పారు.. ఇవన్నీ చూసి ఓటు వేయాలని జగన్ కోరటం ఇప్పటి వరకు ఎవరూ చేయలేదన్నారు. అయితే, టీడీపీ సహనం కోల్పోయి దాడులు చేస్తోందని మండిపడ్డారు.. తాను ఈ పని చేశానని చెప్పుకోలేని పరిస్థితి చంద్రబాబుది అని ఎద్దేవా చేశారు.. ఎన్టీఆర్ హయాంలో, వైఎస్ హయాంలో వచ్చినటువంటి పాజిటీవ్ వైబ్రేషన్లు ఇప్పుడు మళ్లీ వస్తున్నాయి. వైనాట్ 175 లక్ష్యానికి దగ్గర్లోనే సీట్లు గెలవబోతున్నాం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
ఇక, మేం సంయమనం పాటిస్తున్నాం. మా నేత ఓ పిలుపిస్తే అంతా నిమిషంలో మారిపోతుందని హెచ్చరించారు బొత్స.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం మంచిది కాదు అని హితవుపలికిన ఆయన.. మేమే ప్రభుత్వాన్ని నడపాలి.. మేమే శాంతి భధ్రతలను కాపాడాలి.. మేం అధికారంలోకి రాగానే అందరూ తోక ముడుస్తారని వ్యాఖ్యానించారు. సమ న్యాయం పాటిస్తూ పరిపాలన చేశాం. మేం సామాజిక న్యాయం పాటిస్తూ సీట్ల కేటాయింపు చేశాం. టీడీపీ అభ్యర్థుల జాబితా చూడండి.. సామాజిక న్యాయం ఎక్కడా కన్పించదన్నారు. సామాజిక సమీకరణాల పేరుతో రాజకీయం చేసిన నేతలే ఉన్నారు. కానీ, జగన్ తొలిసారిగా సామాజిక న్యాయం చేసి చూపించారని స్పష్టం చేశారు.
గెలుస్తామని చంద్రబాబే చెబుతారు. అసలు చంద్రబాబుకు ఎందుకు ఓటేస్తారు..? అని ప్రశ్నించారు మంత్రి బొత్స.. నన్ను చూసి ఓటేయమని చంద్రబాబు ఏనాడైనా చెప్పారా..? చంద్రబాబు చరిత్ర అంతా మోసాలే అని దుయ్యబట్టారు.. రుణమాఫీ, బాబు-జాబు అంటూ మోసం చేశారు. కానీ, జగన్‌కు క్రెడిబులిటీ ఉంది. చంద్రబాబుకు ఆ క్రెడిబులిటీ ఉందా..? అని ప్రశ్నించారు. జగన్ పాలనలోనే మన ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయని పేదొడు అనుకుంటున్నాడు. అసలు ఈ ఆఫీస్ అప్డేట్ చేస్తే చంద్రబాబు ఎందుకు గోల చేస్తున్నారు..? అని మండిపడ్డారు.. ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ మీద దుష్ప్రచారం చేశారు. చంద్రబాబు గోల వల్లే డీబీటీ పథకాలు నిధులు లబ్దిదారులకు వెళ్లలేదన్నారు. ఇప్పుడు సంక్షేమ పథకాలకు నిధులు జమ అవుతున్నాయని తెలిపారు మంత్రి బొత్స సత్యనారాయణ.