వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద దండయాత్ర చేస్తానంటే ఊరుకోమంటూ హెచ్చరించారు. అధికారం ఉందని విర్రవీగితే ప్రజలే సమాధానం చెప్తారన్నారు. ప్రజలకు అనుగుణంగా ప్రభుత్వాలు పని చేయాలన్నారు. ధర్నాల పేరుతో వైసీపీ నేతలు దోపిడికి తెగబడుతున్నారని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసిందని, కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు వినియోగించకపోవడంతో వ్యవసాయ రంగం చిన్నా భిన్నమైందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ… ‘రాష్ట్రం ఏర్పడి ఏడాది పూర్తి అయ్యింది. వ్యవసాయాధారిత రాష్ట్రం ఏపీ. 65 శాతం మంది వ్యవసాయం, వ్యవసాయ అనుబంధరంగాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం ఈ రంగానికి పెద్దపీట వేసింది. గత ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసింది. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు వినియోగించకపోవడంతో వ్యవసాయ రంగం చిన్నా భిన్నమైంది. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాన్ని లైన్లో పెట్టీ స్ట్రీమ్ చేస్తున్నాము. కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ ఏడాది పంట దిగుబడి విపరీతంగా ఉంది, ధరల విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోతే సకాలంలో స్పందిస్తుంది మా ప్రభుత్వం. నాలుగు పంటలకు సమస్యలు వచ్చాయి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మిర్చి, చిత్తూరు జిల్లాలో మామిడి, కోకో, నల్లబల్లి పంట సమస్యలు వచ్చాయి. మిర్చి రైతు నష్టపోయారు. కోకో పంట విషయంలో ప్రభుత్వం ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. ఏపీ చరిత్రలో కోకో పంటకు నష్టం వచ్చిందని ఎప్పుడు వినలేదు. ప్రభుత్వం ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకు చొరవ చూపిస్తున్నాము. కేజీ కి 5 రూపాయలు తక్కువ కాకుండా కోకో రైతులకు 14 కోట్లు ప్రభుత్వం ఇచ్చింది’ అని తెలిపారు.
Also Read: IND vs ENG:: సుందర్ వికెట్ తీసినా.. జడేజా కారణంగానే స్టోక్స్ ఔట్! లంచ్‌కు ముందు ఏం జరిగిందంటే
‘ప్రకాశం జిల్లాలో నల్లబల్లి పంటకు సీఎం చొరవ తీసుకొని అవసరమైతే మనమే కొనాలని చెప్పారు. రూ,..350 కోట్లు కేటాయించి మార్క్ ఫెడ్ ద్వారా 12 వేలకు తగ్గకుండా పొగాకు రైతులను ఆదుకున్నాము. వైసీపీ నేతలు కూడా ఫోన్ చేసి నమ్మలేకపోయామని చెప్పారు. మామిడి, తోతపురి పంట ఈ ఏడాది 6.5 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చింది. గత పంట కొన్న పరిశ్రమలు ఇప్పుడు కొత్త పంట కొనలేదు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు స్పందించలేదు. 12 రూపాయలకు కొనాలని మేము ఆదేశించాము. కర్ణాటకలో మామిడి 16కి కొంటే.. ఏపీ కొనలేదు అని వైసీపీ నేతలు మీడియాలో ప్రచారం చేశారు. కర్ణాటకలో ఒక ఎకరాకు రెండు క్వింటాలు మాత్రమే కొనాలని కర్ణాటక ప్రభుత్వం షరతు విధించింది. కర్ణాటక ప్రభుత్వం 5 ఎకరాల వరకు మాత్రమే మామిడికి సీలింగ్ విధించింది. దీన్ని కూడా రాజకీయాలు చేస్తున్నారు. ఆ వ్యక్తి పేరు, పార్టీ పేరు ఎత్తాలంటేనే నాకు అసహ్యం వేస్తుంది. 51 వేల మామిడి రైతుల దగ్గర 3.5 లక్షల మెట్రిక్ టన్నుల పంట కొనుగోలు చేస్తాం. మామిడి గుజ్జు తయారీ పరిశ్రమ దారులతో మాట్లాడి 12 రూపాయలకు కొనుగోలు చేసేలా సీఎం చంద్రబాబు నాయుడు ఒప్పించారు. కర్ణాటకలో మామిడి రైతుల విషయంలో కేంద్ర మంత్రి ఇచ్చిన జీవోను తప్పుగా ప్రచారం చేశారు’ అని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు.