నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా వైసీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశముంది. గవర్నర్ ప్రసంగం జరిగే తొలి రోజు సభలో పాల్గొనాలని పార్టీ నాయకత్వం వ్యూహాత్మకంగా నిర్ణయించినట్లు సమాచారం. గత ఏడాది బడ్జెట్ సమావేశాల తొలి రోజున కూడా గవర్నర్ ప్రసంగ సమయంలో వైఎస్ జగన్ అసెంబ్లీకి హాజరైన విషయం తెలిసిందే. అదే తరహాలో ఈసారి కూడా తొలి రోజు సమావేశాలకు ఆయన హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.
గురువారం (ఫిబ్రవరి 12) వైసీపీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించే అవకాశముంది. ఆ సమావేశం అనంతరం అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ వ్యూహం, పాల్గొనబోయే రోజులు తదితర అంశాలపై అధికారిక నిర్ణయం వెల్లడించనున్నట్లు సమాచారం. మరోవైపు శాసనమండలి సమావేశాలకు మాత్రం వైసీపీ ఎమ్మెల్సీలు యథావిధిగా హాజరవుతారని తెలుస్తోంది.
కూటమి నాయకుల విమర్శలకు చెక్ పెట్టే దిశగా వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే వైసీపీ నేతలపై జరిగిన దాడులు, తిరుమల లడ్డూ వ్యవహారంలో ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: Daily Horoscope: బుధవారం రాశి ఫలాలు.. ఆ రాశి వారికి పదోన్నతులు పక్కా!
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. 10.30 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. దాదాపు ఓ గంట సేపు ఈ ప్రసంగం కొనసాగే అవకాశం ఉంది. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశమై.. సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై తుది నిర్ణయం తీసుకుంటుంది. దాదాపు 20 రోజుల పాటు సమావేశాలు కొనసాగనునాయి. ఈ నెల 14న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.
