వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వృద్ధురాలిని కారు ఆపి స్వయంగా పలకరించారు. అంతేకాదు సదరు మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా తన పార్టీ నాయకుడికి అప్పగించారు. జగన్ ఆదేశాల మేరకు ఆ నాయకుడు స్వయంగా ఆస్పత్రికి తీసుకెళ్లి.. దగ్గరుండి మరి వైద్యం అందించారు. అంతేకాదు వృద్ధురాలికి డబ్బు సహాయం కూడా అందించారు.
Also Read: Nadendla Manohar: ఆదివారాల్లో కూడా రేషన్ షాపులు.. జూన్ 1 నుంచి సరుకులు పంపిణీ!
నేడు దివంగత మహానేత వైఎస్సార్ తండ్రి వైఎస్ రాజారెడ్డి శత జయంతి. ఈ సందర్భంగా వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులు విజయవాడలోని నిర్మల శిశు భవన్‌కు వెళ్లారు. వారధి వద్ద ఓ వృద్ధురాలిని బస్సు ఢీకొట్టగా.. ఆమె రెండు కాళ్లకి తీవ్ర గాయాలు అయ్యాయి. అదే సమయంలో శిశువిహార్ నుంచి తాడేపల్లి తిరిగి వస్తున్న వైఎస్ జగన్.. ప్రమాదంను గమనించి వృద్ధురాలి వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. ఆమెను ఆస్పత్రిలో చేర్పించే బాధ్యతను ఎమ్మెల్సీ అరుణ్‌కు అప్పగించారు. ఎమ్మెల్సీ అరుణ్ 108కు పలుమార్లు ఫోన్ చేసినా సిబ్బంది స్పందించలేదు. అటువైపుగా వెళ్తున్న ప్రైవేట్ అంబులెన్స్‌లో వృద్ధురాలిని విజయవాడ జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స అందించేంతవరకూ అక్కడే ఉన్నారు. విషయం తెలిసిన వారు వైఎస్ జగన్ మంచి మనసును ప్రశంసిస్తున్నారు.