యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ ఉన్నపళంగా సింహాచలంలో ప్రత్యక్షమయ్యాడు. చెన్నై ఎయిర్‌పోర్ట్ నుంచి కనిపించకుండా పోయిన బయ్యా సన్నీ.. నెల రోజుల తర్వాత సింహాచలంలో కనిపించాడు. సింహాచలంలో ఫొటోస్ దిగి.. ‘నేను వచ్చేశా’ అంటూ మరో యూట్యూబర్ అన్వేష్ టార్గెట్‌గా పోస్ట్‌లు పెట్టాడు. ‘వైజాగ్ వెళ్తున్నా, మీ ఇంటికెళ్తా, మీ అమ్మానాన్నకి ధైర్యం చెబుతా. నువ్వు టెన్షన్ పడకు’ అంటూ మంగళవారం పోస్ట్ చేశాడు. ప్రస్తుతం బయ్యా సన్నీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
బయ్యా సన్నీ యాదవ్ నెల రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. పాకిస్తాన్ వెళ్లి వస్తుండగా.. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ఎన్ఐఏ అరెస్ట్ చేసిందంటూ వార్తలు వచ్చాయి. పాకిస్తాన్ కోసం సన్నీ గూఢచారిగా పనిచేస్తున్నాడంటూ ఆరోపణలు వచ్చాయి. పాక్‌లో జాకీర్ నాయక్ సమ్మిట్‌కు బయ్యా సన్నీ హాజరయ్యాడు. అయితే బయ్యా సన్నీ నిజంగా ఎన్‌ఐఏ అదుపులో ఉన్నాడా? లేదా? అనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. బయ్యా సన్నీ తండ్రి మాత్రం కొడుకు గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా సమాచారం ఇవ్వలేదు.
నెల రోజుల తర్వాత విశాఖపట్నం చేరుకున్న బయ్యా సన్నీ యాదవ్.. సింహాచలంలో ఫోటోలు దిగి నేను వచ్చేసాను అంటూ పోస్ట్ చేశాడు. మరొక యూట్యూబర్ అన్వేష్ ఇంటికి వెళ్తున్నట్లు పోస్ట్ చేశాడు. ‘నన్ను గత రాత్రి ఎవరో కిడ్నాప్ చేశారు, ఇప్పుడే విడిచిపెట్టారు. వచ్చే నాలుగు రోజులు నాకు ఎంతో కీలకం. రెడీ టు ఫేస్ ఎవ్రీ థింగ్’ అంటూ బయ్యా సన్నీ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. చెన్నైలో అరెస్ట్ అయిన బయ్యా సన్నీ సింహాచలంలో ప్రత్యక్షమవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నెల రోజుల పాటు ఎక్కడికి వెళ్లారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.