హైదరాబాద్ : సంతోష్ నగర్ గ్యాంగ్ రేప్ కేసు ను చేధించారు పోలీసులు. ఈ రేప్ కేసులో యువతి ఆడిన నాటకాన్ని బట్టబయలు చేశారు పోలీసులు. తనను ముగ్గురు ఆటో డ్రైవర్ లు ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారని నిన్న సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ లో యువతి ఫిర్యాదు చేయగా… ప్రత్యేక దర్యాప్తు టీమ్ లు ఏర్పాటు చేసి.. దర్యాప్తు నిర్వహించారు. యువతి చెప్పిన సమయానికి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు పోలీసులు. అయితే..సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కిడ్నాప్, అత్యాచారం జరిగినట్లుగా ఎక్కడ కూడా ఆనవాళ్లు దొరకలేదు. మంగళవారం రాత్రి సంతోష్ నగర్ లోని యాదగిరి థియేటర్ వద్ద ఆటో ఎక్కినట్లు పోలీసులకు చెప్పిన యువతి.. ఆటో ఎక్కిన తర్వాత మరొక ఇద్దరు యువకులు వెనకాల తన పక్కనే కూర్చున్నారని చెప్పింది.
ఈ నేపథ్యంలోనే తాను స్పృహ కోల్పోయానని చెప్పింది యువతి.. ఆ తర్వాత తనను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. చంపేందుకు ప్రయత్నం చేశారు అంటూ యువతి ఆరోపించింది. దీంతో దర్యాప్తు చేసిన సంతోష్ నగర్ పోలీసులు… దర్యాప్తులో షాకింగ్ నిజాలను వెలికితీశారు. గ్యాంగ్ రేప్ కేసులో యువతి హై డ్రామా ఆడినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని పోలీసుల విచారణలోనూ తాజాగా యువతి ఒప్పుకుంది. తన బాయ్ ఫ్రెండ్ కు ఎంగేజ్ మెంట్ అయిన నేపథ్యంలో… అతన్ని ఈ కేసులో ఇరికించాలని ఆ యువతి డ్రామాలు ఆడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక యువతి పై లైంగిక దాడి జరగలేదని దర్యాప్తు అధికారులకు మెడికల్ రిపోర్ట్ కూడా అందింది. అయితే… కట్టుకథ అల్లిన యువతి పై పోలీసులు ఎలాంటి చర్యలు చేపడుతారో వేచి చూడాలి.