Young Candidates Won in Telangana Elections 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పూర్తయ్యాయి. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. తొలి రౌండ్ నుంచే కాంగ్రెస్ తన హవా కొనసాగించింది. అధికార బీఆర్‌ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తూ.. ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 64 సీట్లు (మ్యాజిక్ ఫిగర్ 60) కైవసం చేసుకోగా.. బీఆర్‌ఎస్ 39 సీట్లు గెలిచింది. బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందగా.. ఎంఐఎం 7 సీట్లలో సత్తాచాటింది. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పిన్న వయస్కు వారు గెలిచారు. 30 ఏళ్లకు తక్కువగా ఉన్న ముగ్గురు అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
యశస్విని రెడ్డి:
అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి నియోజక వర్గం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి మామిడాల యశస్విని రెడ్డి గెలిచారు. ఆమె వయసు 26. 30 ఏళ్ల రాజకీయ సుధీర్ఘ అనుభవం ఉన్న నేత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై సుమారు 14వేల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. దాంతో తెలంగాణ రాజకీయాల్లో ఇదో సంచలనంగా మారింది. యశస్వినికి ఐటీ శాఖ అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. 2018లో బీటెక్ పూర్తి చేసిన యశస్విని.. వివాహం అనంతరం అమెరికాకు వెళ్లిపోయారు.
మైనంపల్లి రోహిత్:
మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు భారి మెజారిటీతో గెలిచారు. తన సమీప బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని పద్మా దేవేందర్ రెడ్డిపై సుమారు 9 వేల ఓట్లతో జయకేతనం ఎగురవేశారు. రోహిత్ వయసు 26. మైనంపల్లి హన్మంతరావు కుమారుడే ఈయన. మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మైనంపల్లి హన్మంతరావు.. బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి సుమారు 25వేల ఓట్లతో గెలిచారు. రోహిత్ రావు మేడ్చల్‌లోని మెడిసిటీ వైద్య కళాశాల నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశారు.
పర్ణికా రెడ్డి:
నారాయణపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన చిట్టెం పర్ణికా రెడ్డి గెలుపొందారు. ఆమె వయసు 30. బీఆర్ఎస్ అభ్యర్థి రాజేందర్ రెడ్డిపై దాదాపు 8 వేల ఓట్ల ఆధిక్యతో విజయం సాధించారు. పర్ణిక ప్రస్తుతం భాస్కర వైద్య కళాశాలలో పీజీ చేస్తున్నారు. పర్ణిక తాత చిట్టెం నర్సిరెడ్డి మక్తల్ ఎమ్మెల్యేగా.. తండ్రి చిట్టెం వెంకటేశ్వర్ రెడ్డి పీసీసీ సభ్యుడిగా పని చేశారు.