అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025లో భాగంగా మరో గిన్నిస్ రికార్డు కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. విశాఖలో 26,395 మంది గిరిజన విద్యార్థులతో సూర్య నమస్కారాలు చేయించే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద సూర్య నమస్కార కార్యక్రమం ఉండబోతుంది. రేపు వాతావరణం అనుకూలించక వర్షం పడితే.. ఆర్కే బీచ్ రోడ్డులో కార్యక్రమాలు రద్దు చేసి మొత్తం కార్యక్రమం ఇదే వేదిక వద్ద నిర్వహించే అవకాశం ఉంది.
వాతావరణం అనుకూలంగా ఉంటే ఆర్కే బీచ్ రోడ్డులో గిన్నిస్ రికార్డు పూర్తయిన తర్వాత ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు ఏయుకు వచ్చి విద్యార్థుల సూర్య నమస్కారాలను పది నిమిషాల పాటు పరిశీలిస్తారు. ఏజెన్సీ నుండి గిరిజన విద్యార్థులను 106 పాఠశాలల నుంచి 495 బస్సుల్లో విశాఖకు తీసుకువస్తున్నారు. యోగ దినోత్సవం కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా సూర్య నమస్కార కార్యక్రమం నిలవనుంది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 26 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఐదు లక్షల మందితో యోగా డే ఉత్సవాలతో గిన్నిస్ రికార్డును ఏపీ ప్రభుత్వం సాధించనుంది. సూర్య నమస్కారాల కార్యక్రమంతో మరో రికార్డు సాధించాలని చూస్తోంది.
Also Read: Maoist Aruna: మావోయిస్టు అగ్రనేత అరుణ అంత్యక్రియలు పూర్తి!
జూన్ 21న ఉదయం 6.25కు యోగాంధ్ర 2025 కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఉదయం 6.30 నుంచి 7 గంటల వరకు అతిథులు ప్రసంగించనున్నారు. 6.30 నుంచి 6.45కు కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి, ఏపీ సీఎం, ఏపీ డిప్యూటీ సీఎం ప్రసంగిస్తారు. ఆపై ప్రధాని 15 నిమిషాలు ప్రసంగించనున్నారు. 7 గంటలకు ఆసనాలు ప్రారంభించి.. 7.45 వరకు నిర్వహిస్తారు. దాంతో యోగాంధ్ర 2025 ముగుస్తుంది. యోగాంధ్ర 2025 కోసం నేడు ప్రధాని విశాఖకు రానున్నారు.
