ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన నలుగురు వైసీపీ జెడ్పీటీసీలు జనసేనలో చేరారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ కండువా కప్పుకున్నారు. జనసేనాని నలుగురు జెడ్పీటీసీలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చింతలపూడి జెడ్పీటీసీ సభ్యులు పొల్నాటి శ్రీనివాసరావు, తాడేపల్లిగూడెం జెడ్పీటీసీ సభ్యులు ముత్యాల ఆంజనేయులు, అత్తిలి జెడ్పీటీసీ సభ్యురాలు అడ్డాల జానకి, పెరవలి జెడ్పీటీసీ సభ్యురాలు కొమ్మిశెట్టి రజనీ జనసేన పార్టీలో చేరారు.
రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషి, గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు తమను అమితంగా ఆకట్టుకున్నాయని జెడ్పీటీసీలు తెలిపారు. ప్రజా ప్రతినిధులకు సైతం వైసీపీలో గౌరవం లేదని, గత మూడున్నరేళ్లుగా ఆ పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ గారు చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకువెళ్తామన్నారు.
ఆర్య వైశ్య ప్రముఖులు కూడా జనసేనలో చేరారు. చార్టెర్డ్ అకౌంటెంట్, రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు పెనుగొండ సుబ్బారాయుడు, శ్రీశైలం వైశ్య సత్ర సముదాయం అధ్యక్షులు దేవకీ వెంకటేశ్వర్లు, కాశీ అన్నపూర్ణ చౌల్ట్రీస్ అధ్యక్షులు శ్రీ భవనాసి శ్రీనివాస్ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. కులమతాలకు అతీతంగా పవన్ ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమాలు, అవినీతి రహిత పాలనకు ఆకర్షితులై జనసేనలో చేరినట్టు వారు తెలిపారు. పవన్ ఆలోచనలు, సిద్ధాంతాలు రాష్ట్ర బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తాయన్నారు.