Perni Nani: ఇల్లు అలకగానే పండగ కాదు.. రేపు మళ్లీ వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే మీకు ఏ ఖర్మ పడుతుందో మీరే ఆలోచించుకోండి అంటూ హెచ్చరించారు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుకి వయసు పెరిగే కొద్దీ ఆలోచనా సరళి కుంచిత పోకడలు పెరిగిపోతున్నాయి. ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపించాల్సిన అవసరం ఉంది. కానీ, పులివెందుల జడ్పీటీసీకి మాత్రమే బై ఎలక్షన్ పెట్టాడు అని దుయ్యబట్టారు.. అయితే, ఎన్ని అడ్డంకులు పెట్టినా పులివెందుల జడ్పీటీసీకి నామినేషన్ వేశాం. నామినేషన్లు వేసిన దగ్గర్నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రౌడీలను దించాడు. చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలను మనం సినిమాల్లో మాత్రమే చూసుంటాం. కానీ, ఇప్పుడు చంద్రబాబు అందరికీ నేర్పిస్తున్నాడు. బీసీ నేత, వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, రాముపై దాడి చేయించాడు. కార్లు ధ్వంసం చేసి.. కత్తులు, రాడ్లతో పైశాచికంగా దాడి చేశారని మండిపడ్డారు..
Read Also: YS Jagan: పులివెందుల వైసీపీ నేతలకు వైఎస్ జగన్ ఫోన్.. దాడిపై ఆరా
ఇక, ఈ దాడిపై పోలీసులకు ముందే తెలుసు.. సినిమా స్క్రిప్ట్ మాదిరి ముందుగానే పథకం ప్రకారం ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు పేర్ని నాని.. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ను ఆసుపత్రిలో చేర్పించామని పోలీసులు చెబుతున్నారు. దాడులకు సంబంధించి ముందుగా సమాచారం మీకు తెలియదా.? అని ప్రశ్నించారు.. పులివెందులలో గెలిచామని తన వాపును చూపించేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్క కేసు కూడా లేని వారిపై బైండోవర్లు పెట్టారు. ఎన్నికల చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదు. చంద్రబాబు గూండా రాజ్యాన్ని అలవాటు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, ఇల్లు అలకగానే పండగ కాదు.. రేపు జగన్ వస్తే మీకు ఏ ఖర్మ పడుతుందో మీరే ఆలోచించుకోండి అని హెచ్చరించిన ఆయన.. భయభ్రాంతులకు గురిచేసి గెలిచామని జబ్బలు చరుచుకోవద్దు.. ఎన్నికల కమిషనర్ చూస్తూ ఊరుకుంటే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపించాలని ఎన్నికల కమిషనర్ ను కోరామన్నారు మాజీ మంత్రి పేర్ని నాని..