వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి బెయిల్‌పై విడుదల అయ్యారు. గుంటూరు కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పదివేల పూచీకత్తు, ఇద్దరు జామీన్ల హామీతో బెయిల్ మంజూరైంది. రెండు నెలల పాటు ప్రతి శనివారం గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో సంతకం చేయాలన్న కోర్టు ఆదేశించింది. గోరంట్ల మాధవ్ ఈ నెల 11 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఇక మాధవ్ సహా రాజమండ్రి జైలులో రిమాండ్‌లో ఉన్న ఐదుగురు అనుచరులు కూడా బెయిల్‌పై విడుదల అయ్యారు. గత నెల 10న టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ తో పాటు ఎస్కార్ట్ పోలీసులపై దాడి చేసిన కేసులో గోరంట్ల మాధవ్ అరెస్ట్ అయ్యారు.
Also Read: Nabha Natesh : వాళ్లను క్షమించకూడదు.. పహల్గాం దాడిపై నభానటేష్..
జైలు నుండి విడుదల అయిన అనంతరం గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ… ‘సీఎం చంద్రబాబు హత్య రాజకీయాలు, అక్రమ కేసులు వైసీపీ లీడర్లు, కేడర్‌ను ఏమీ చేయలేవు. మరోసారి కూటమిగా గెలిచే పరిస్థితి కూడా లేదు. ప్రతిరోజు రాష్ట్రంలో రోజుకొక రాజకీయ హత్య జరుగుతుంది, అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. చంద్రబాబు ఆలోచన విధానాలకు నూకలు చెల్లాయి. రాష్ట్ర ప్రజలు ప్రోత్సహించుకుంటున్నారు. అక్రమ అరెస్టులకు, తప్పుడు కేసులకు పుల్‌స్టాప్ పెట్టాలి. ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా ముందుకు వెళ్లాలి. అక్రమ అరెస్టులతో సీఎం చంద్రబాబు నా పిక్క మీద వెంట్రుక కూడా పీకలేరు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూటమి గెలిచేది లేదు, వైసీపీ ఓడేది లేదు. ప్రజలు ప్రభుత్వాన్ని అసహ్యించుకుంటున్నారు. ఇప్పటికైనా అక్రమ అరెస్టులకు పుల్‌స్టాప్ పెట్టి పథకాల అమలు చేయాలి’ అని అన్నారు.