World Worst Currency no-3: రష్యా కరెన్సీ రూబుల్ పరిస్థితి రివర్స్ అయింది. మారకం విలువ ఏడాది కనిష్టానికి పడిపోయింది. అమెరికా డాలరుతో పోల్చితే ఒకటీ పాయింట్ ఒక శాతం, యూరోపియన్ యూరోతో పోల్చితే ఒక శాతం తగ్గింది. ఒక డాలర్ కొనాలంటే 82 పాయింట్ రెండు ఎనిమిది రూబుల్స్ చెల్లించాల్సి వస్తోంది. ఒక యూరో కోసం ఏకంగా 90 పాయింట్ సున్నా ఆరు రూబుల్స్ సమర్పించాల్సిన పరిస్థితి నెలకొంది.
read more: Sports Sponsorships: ఆదాయం @ మైదానం. మన దేశ క్రీడా రంగానికి మరపురాని సంవత్సరం
రూబుల్ వ్యాల్యూ 2022 ఏప్రిల్ తర్వాత ఈ రేంజులో డౌన్ కావటం ఇదే తొలిసారి. విదేశీ మారక నిల్వలు పతనం కావటం.. పాశ్చాత్య దేశాల వ్యాపార సంస్థలు మూతపడం మరియు సంబంధిత ఆస్తులను దేశీయ పెట్టుబడిదారులకు అమ్ముకోవాల్సి రావటం వల్ల రష్యా కరెన్సీకి చుక్కలు కనిపిస్తున్నాయి. పాశ్చాత్య దేశాల ఆస్తులను లోకల్ ఇన్వెస్టర్లు కొనుగోలు చేస్తుండటంతో వాటికి డాలర్లలో చెల్లింపులు చేయాల్సి వస్తోంది.
దీనికి తోడు మార్చి నెలలో చమురు ధరలు తగ్గటం వల్ల ఎగుమతుల రూపంలో రావాల్సిన ఆదాయానికి గండిపడింది. ఈ నేపథ్యంలో రష్యా కరెన్సీ రూబుల్.. ప్రపంచంలోనే 3వ అతి చెత్త పనితీరు కనబరుస్తున్న నగదుగా తలదించుకొని నిలబడింది. వరస్ట్ పెర్ఫార్మెన్స్ విషయంలో రూబుల్ కన్నా ముందు ఈజిప్ట్ కరెన్సీ పౌండ్ మరియు అర్జెంటీనా కరెన్సీ పెస్కో మాత్రమే ఉన్నాయి.
ఈ విషయాలను రాయిటర్స్ సంస్థ వెల్లడించింది. అయితే.. మార్చి నెల చివరలో ఆయిల్ రేట్లు మళ్లీ పెరగటంతో రష్యా కరెన్సీ విలువ తిరిగి పుంజుకుంటుందని ట్రేడర్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. రష్యా.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అందువల్ల ఆ దేశానికి ఆయిలే ప్రధాన ఆదాయ వనరుగా మారింది.
కాబట్టి.. పాశ్చాత్య దేశాల్లో బ్యాంకింగ్ వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకోవటం.. ఒపెక్ ప్లస్ దేశాలు చమురు ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించటం.. పరోక్షంగా రష్యాకు కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు. మార్చి చివరి వారంలో 70 డాలర్లు పలికిన బ్రెంట్ క్రూడాయిల్ రేటు లేటెస్టుగా 85 డాలర్లకు పెరగటం గమనించాల్సిన విషయం.