మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బిల్లును ప్రభుత్వం అమలు చేయాల్సి వస్తే ఇప్పుడే చేయాలన్నారు. దీనికి డీలిమిటేషన్ ఎందుకని ప్రశ్నించారు. నేటి నుంచే మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయవచ్చని తెలిపారు. మహిళా రిజర్వేషన్ మంచిదే అయినప్పటికీ.. అందులో రెండు లోపాలున్నాయని తెలిపారు. ముందుగా రిజర్వేషన్ అమలు చేయడానికి ముందు జనాభా గణన, డీలిమిటేషన్ చేయవలసి ఉంటుందని కేంద్రం తెలపగా.. అవసరం లేదని అన్నారు. ఈ రెండు పనులు చేయడానికి చాలా సంవత్సరాలు పడుతుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అప్పటికి అది అమలవుతుందో లేదో అనేది ఎవరికీ తెలియదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Read Also: Protest of stone masons: హైదరాబాద్ లో కల్లు గీత కార్మికుల ఆందోళన
రిజర్వేషన్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం మళ్లింపుకు పాల్పడుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓబీసీ జనాభా లెక్కల నుంచి మళ్లింపు జరుగుతోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలోని కార్యదర్శులు, క్యాబినెట్ కార్యదర్శుల కులాల వర్గం గురించి ఆయన ప్రస్తావించారు. ఓబీసీల కోసం ఇన్ని పనులు చేస్తుంటే 90 మందిలో కేవలం ముగ్గురే ఓబీసీ కేటగిరీకి చెందిన వారు ఉండటం ఏంటని అన్నారు. దేశ బడ్జెట్‌లో ఐదు శాతాన్ని ఓబీసీ అధికారులు నియంత్రిస్తున్నారని తెలిపారు.
Read Also: Ashtadigbandhanam Review: అష్ట దిగ్భంధనం రివ్యూ
ఓబీసీల గురించి ప్రధాని ప్రతిరోజూ మాట్లాడుతున్నారని.. వారి కోసం ప్రధాని ఏం చేశారని ప్రశ్నించారు. నిర్ణయాధికారుల్లో ఐదు శాతం మందికి మాత్రమే ఎందుకు స్థానం కల్పించారని ప్రశ్నించారు. దేశంలో ఓబీసీ జనాభా ఐదు శాతం మాత్రమేనా.. దేశంలో ఓబీసీలు ఎంతమంది ఉన్నారో తెలుసుకుంటానని రాహుల్ అన్నారు. 2010లో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు ప్రకారం ఓబీసీ కోటా కల్పించనందుకు చింతిస్తున్నారా అని రాహుల్ ను మీడియా ప్రశ్నించగా.. దీనికి ఆయన అంగీకరిస్తూ.. 100 శాతం పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. అది అప్పుడే జరగాల్సిందని తెలిపారు. కానీ తాము దానిని కచ్చితంగా పూర్తి చేస్తామని అన్నారు.