మహిళల వన్డే ప్రపంచకప్ 2025ను భారత్ గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో చిత్తు చేసింది. దాంతో 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు హర్మన్ సేన తెరదించింది. మిథాలీ రాజ్ నాయకత్వంలో రెండుసార్లు భారత్ ఫైనల్‌కు వెళ్లినా.. నిరాశ తప్పలేదు. ఈసారి పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ.. దక్షిణాఫ్రికాను సునాయాసంగా ఓడించి టీమిండియా విజేతగా నిలిచింది. మ్యాచ్ అనంతరం దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. ఫాన్స్ అయితే టపాసులు కాలుస్తూ తెగ ఎంజాయ్ చేశారు. మొదటిసారి మెగా టోర్నీ గెలవడంతో బీసీసీఐ భారత మహిళా జట్టుకు భారీ నజరానా ప్రకటించింది.
వన్డే ప్రపంచకప్ 2025 గెలవడంతో భారత మహిళా జట్టు రూ.39 కోట్ల ప్రైజ్‌మనీని సొంతం చేసుకుంది. ఇక భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రూ.51 కోట్ల నజరానాను ప్రకటించింది. ఈ మొత్తాన్ని ప్లేయర్లు, కోచ్‌లు, సహాయక సిబ్బందికి అందజేయనున్నారు. మొత్తంగా విశ్వ విజేతగా నిలిచిన భారత్ రూ.90 కోట్లు దక్కించుకుంది. ఐసీసీ లేదా బీసీసీఐ నుంచి ఇంత మొత్తం రావడానికి కారణం జై షా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బీసీసీఐ కార్యదర్శిగా (2019-24) బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి భారత మహిళా క్రికెట్‌కు జై షా అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఆపై ఐసీసీ ఛైర్మన్ అయ్యాక మరింత ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలోనే మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ప్రైజ్‌మనీని ఏకంగా 297 శాతం పెంచారు.