పేద కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు పెట్టాయి. ప్రభుత్వాలు ఆర్థిక సాయం అందించడంతో చిన్న కుటుంబాలు కొంత ఉపశమనం పొందుతున్నాయి. అయితే కొందరు ఈ పథకాలను అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నారు. పెళ్లైన ఓ వివాహిత ప్రభుత్వ డబ్బుల కోసం ఏకంగా సొంత అన్ననే మళ్లీ మ్యారేజ్ చేసుకుని నీచానికి ఒడిగట్టింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
2024, మార్చి 5న మహారాజ్‌గంజ్ జిల్లాలోని లక్ష్మీపుర్ బ్లాక్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 38 నిరుపేద కుటుంబాలకు చెందిన జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. అనంతరం వారందరికీ ‘సీఎం వివాహ పథకం’ కింద వధువుకు మంగళసూత్రం, ట్రంకుపెట్టె, దుస్తులతో పాటు రూ.51 నగదు అందించారు.
ఈ కానుకలకు ఆశపడిన ఓ వివాహిత మళ్లీ పెళ్లి డ్రామాకు తెరలేపింది. ఏడాది క్రితమే ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లైనప్పటికీ విషయం దాచిపెట్టి.. ప్రభుత్వం నుంచి సాయం కొట్టేయాలన్న దురుద్దేశంతో సొంత అన్ననే పెళ్లి చేసుకుని సర్కార్ అందించిన కానుకలను అందిపుచ్చుకుంది.
ఇది కూడా చదవండి: Vinay Kumar: రష్యాకు భారత రాయబారిగా వినయ్ కుమార్ నియామకం..
అయితే ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు షాక్ అయ్యారు. ఉపాది నిమిత్తం ఆమె భర్త వేరే ప్రాంతంలో ఉంటున్నాడు. తాజాగా జరిగిన పెళ్లి ఫొటోలను ఆమె భర్తకు చేరవేశారు. ఫొటోలను చూసిన అతగాడు తీవ్ర ఆగ్రహానికి గురై వెంటనే మహారాజ్‌గంజ్ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరడంతో ఆగ్రహించిన సీఎం యోగి విచారణకు ఆదేశించారు. మరోవైపు లక్ష్మీపుర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
