Chittoor Ex MLA CK Babu meeting with followers Today: పార్టీలు రారా రమ్మంటున్నాయ్.. అనుచరులు రావాలంటూ ఓత్తిడి చేస్తున్నారు. కానీ ఆయన మాత్రం ఇన్నాళ్లూ సైలెన్స్ ప్లీజ్ అంటూ వచ్చారు. చివరకు మౌనం వీడనున్నారు. ఆయన మరెవరో కాదు చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు. మాజీ ఎమ్మెల్యే సీకే బాబు మళ్లీ రంగంలోకి దిగనున్నారు. మరి కాసేపట్లో సీకే బాబు తన అనుచరులతో కీలక సమావేశం కానున్నారు. ఈ సమావేశం అనంతరం తన రాజకీయ భవిష్యత్తుపై క్లారటీ ఇవ్వనున్నారు.
సీకే బాబు నాలుగు సార్లు చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచారు. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులతో రాయలసీమ ప్రాంత అభివృద్ధి మండలి చైర్మన్‌గా కొంతకాలం పనిచేశారు. 1989 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా చిత్తూరు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి 1994, 1999 ఎన్నికల్లోనూ గెలిచి వరుసగా మూడుసార్లు చిత్తూరు విజేతగా నిలిచారు. 2009 ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ టిక్కెట్ సాధించి.. చిత్తూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
Also Read: Top Headlines @ 9 AM : టాప్ న్యూస్!
2014 ,2019 ఎన్నికల్లో సీకే బాబు పోటీకి దూరంగా ఉండిపోయారు. అయితే చాలా కాలం తరువాత ఎన్నికల సమయం నేపధ్యంలో తన అనుచరులతో నేడు కీలక సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే సీకే బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి అందరిలో నెలకొంది. చిత్తూరులో వైసీపీ బలమైన అభ్యర్థిగా విజయనందా రెడ్డిని బరిలోకి దింపింది. టీడీపీ నుండి గురజాల జగన్ మోహన్ అభ్యర్థిగా ఉన్నారు. ఈ నేపధ్యంలో సీకే బాబు ఏ పార్టీలోకి వెలుతారు అని ఆసక్తిగా మారింది. ఎదో ఒక పార్టీకి మద్దతు మాత్రమే ఇస్తారా? లేక ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతారా? అనే చర్చ జోరుగా సాగుతోంది.