wife kills husband: కలకాలం ఒకరికి ఒకరు తోడునీడగా ఉంటామని ప్రతిజ్ఞ చేసి, తీరా జీవితాంతం తోడుగా నిలిచే భాగస్వాములను క్షణాల్లో ఖతం చేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ కోవకు చెందినదే ఈ వార్త కూడా. కానీ ఇక్కడ ఓ సంచలన విషయం ఏంటంటే.. తన భర్తను చంపడానికి ఓ భార్య గూగుల్‌ను ప్లాన్ అడగటం. తన భర్తను హత్య చేసిన తర్వాత తప్పించుకునే మార్గాలను ఆమె గూగుల్, సోషల్ మీడియాలో వెతికినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంచలన ఘటన జైపూర్‌లో వెలుగుచూసింది.
READ MORE: Allu Arjun : ఆ విషయంలో అల్లు అర్జున్ సూపర్ అంతే..
ఫ్రెండ్స్‌తో కలిసి ఖతం చేసింది..
ముహానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ భార్య తన స్నేహితులతో కలిసి తన భర్తను హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసులో ప్రధాన నిందితురాలు మృతుడి భార్య సంతోష్ దేవి అని పోలీసులు పేర్కొన్నారు. ఆమె తన ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి భర్తను హత్య చేసిందని తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. నిత్యం తన భర్త తనను కొట్టడం, అనుమానాలతో వేధించడంతో విసిగిపోయిన సంతోష్ దేవి ఎలాగైన తన భర్త మనోజ్‌ను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకుంది. దీనికి ఆమె గూగుల్, సోషల్ మీడియా సాయం తీసుకుంది. అలాగే తన భర్తను హత్య చేయడానికి తన స్నేహితుడు రిషి శ్రీవాస్తవ, రిషి మిత్రుడు మోహిత్ శర్మలు ఆమెకు సాయం చేశారు. హత్య చేసిన తర్వాత తప్పించుకునే మార్గాలను సోషల్ మీడియాలో వెతికింది. హత్య తర్వాత వాళ్లు పట్టుబడకుండా ఉండటానికి గూగుల్‌లో అనేక ప్రముఖ హత్య కథనాలను చవిదినట్లు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి చంపారు..
పథకం ప్రకారం ఆగస్టు 16న నిందితుడు మోహిత్ మల్పురా గేట్ నుంచి మనోజ్ ఇ-రిక్షాను అద్దెకు తీసుకున్నాడు. ఇస్కాన్ ఆలయానికి వెళ్లాలని చెప్పి అందులో ప్రయాణీకుడిగా కూర్చున్నాడు. సుమేర్ నగర్ వైపు తిరిగేటప్పుడు, అప్పటికే అక్కడ ఉన్న రిషితో కలిసి మనోజ్ గొంతును పదునైన బ్లేడుతో కోసి హత్య చేసి నిందితులిద్దరూ కాలినడకన పారిపోయారు. తర్వాత వాళ్లు కొత్త బట్టలు కొనుగోలు చేయడంతో పాటు వారి సిమ్ కార్డులను తీసేసి ఫోన్‌లు స్విచ్ ఆఫ్ చేశారు. మరణించిన మనోజ్ భార్య సంతోష్‌దేవి కూడా వారితో పాటు పారిపోయింది. పోలీసులు ఈ కేసు సంబంధించిన ఆధారాలను FSL బృందం సహాయంతో సేకరించారు. హత్య జరిగిన ప్రదేశం నిర్జనంగా ఉండటంతో పాటు, అక్కడ సీసీటీవీ కెమెరాలు లేవు. కానీ ఘటనా స్థలానికి సమీప రోడ్లపై ఉన్న కెమెరా ఫుటేజ్‌లో మనోజ్‌తో పాటు మరొక వ్యక్తి కనిపించాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితులని అరెస్టు చేశారు. మృతుడి భార్య నెల రోజుల క్రితమే హత్యకు ప్లాన్ చేసిందని పోలీసులు తెలిపారు.
ఆ మహిళ తన భర్తను చంపడానికి, హత్య చేసే విధానం, తప్పించుకునే మార్గాలు, ఒక వేళ పోలీసులకు దొరికితే శిక్ష విధించే విధానాల గురించి గూగుల్‌లో అనేక వీడియోలను చూసిందని పోలీసులు తెలిపారు. ఆమె హత్య చేసే ప్రాంతాన్ని పరిశీలించడంతో పాటు, ఆమె హత్య కోసం కొత్త సిమ్ కార్డులను కూడా ఉపయోగించిందని పోలీసులు తెలిపారు.