స్వదేశంలో బంగ్లాదేశ్‌తో భారత్ రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. తొలి టెస్టు కోసం బీసీసీఐ సెలెక్టర్లు భారత జట్టును ఆదివారం ఎంపిక చేశారు. కారు ప్రమాదానికి గురైన వికెట్ కీపర్ రిషబ్ పంత్ రెండేళ్ల తర్వాత టెస్టుల్లో జట్టులోకి వచ్చాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతిని ఇస్తారనుకున్నా.. సెలెక్టర్లు అతడిని ఎంపిక చేయడం గమనార్హం. అయితే బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, సీనియర్ పేసర్ మహ్మద్ షమీలకు భారత టెస్ట్ జట్టులో చోటు దక్కలేదు. ఇందుకు కారణం లేకపోలేదు.
ఫామ్ లేమితో శ్రేయస్ అయ్యర్ గతేడాది బీసీసీఐ కాంట్రాక్ట్‌ను కోల్పోయాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో గాయపడిన శ్రేయస్ రంజీ ట్రోఫీలో ఆడలేదు. దాంతో బీసీసీఐ ఆగ్రహానికి గురయ్యాడు. కొన్ని సిరీస్‌లకు సెలెక్టర్లు అతడిని పక్కన పెట్టేశారు. ఐపీఎల్ 2024లో కేకేఆర్‌ను విజేతగా నిలిపాడు. అయినా టీ20 ప్రపంచకప్ 2024లో కూడా దక్కలేదు. ఇక దులీప్ ట్రోఫీ 2024కి ఎంపిక చేయడంతో శ్రేయస్ మళ్లీ జాతీయ జట్టులోకి తీసుకుంటారని భావించారు. అయితే బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు శ్రేయస్‌ను ఎంపిక చేయలేదు. సుదీర్ఘ ఫార్మాట్‌లో నిలకడ లేని ప్రదర్శన కారంగానే సెలక్టర్లు అతడిని పరిగణలోకి తీసుకోలేదు. దులీప్ ట్రోఫీలో ఒక ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన శ్రేయాస్.. అంతకుముందు బుచ్చిబాబు ట్రోఫీలో రాణించలేదు.
Also Read: Joe Root: టెస్టుల్లో చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ స్టార్ జో రూట్!
వన్డే ప్రపంచకప్ 2023 తర్వాత గాయం కారణంగా మహ్మద్ షమీ జట్టుకు దూరమయ్యాడు. శస్త్రచికిత్స చేసుకొని కోలుకొన్న షమీ.. ప్రాక్టీస్ ప్రారంభించాడు. బంగ్లాతో టెస్టు సిరీస్‌కు షమీని పరిగణనలోకి తీసుకుంటామని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ హింట్ ఇచ్చాడు. అయితే నేరుగా జాతీయ జట్టులోకి రావాలంటే.. ముందుగా దేశవాళీలో ఆడాలని బీసీసీఐ నిబంధన పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీలో అతడు పాల్గొనలేదు. అక్టోబర్‌లో జరిగే రంజీ ట్రోఫీలో ఆడి భారత జట్టులోకి వస్తాడని తెలుస్తోంది. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో అతడు ఆడే అవకాశాలు ఉన్నాయి.