దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రచార సభలో పాల్గొనేందుకు ప్రధాని మోడీ ఆయా రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. శనివారం మహారాష్ట్రలోని నాందేడ్‌లో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ టార్గెట్‌గా మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికల్లో రాహుల్‌ను వయనాడ్ నుంచి కూడా ప్రజలు తరిమికొడతారని వ్యాఖ్యానించారు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి మరో లోక్‌సభ స్థానాన్ని చూసుకోవల్సిందేనని ప్రధాని జోస్యం చెప్పారు.
ఇది కూడా చదవండి: Eetala Rajendar: ముడోసారి మోడీ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం
మహారాష్ట్రలోని నాందేడ్‌లో జరిగిన ర్యాలీలో మోడీ మాట్లాడారు. రాహుల్ యువరాజు వయనాడ్‌లో కూడా ఓడిపోతారని.. తర్వాత మరో సురక్షిత స్థానం చూసుకోవాల్సి ఉంటుందని విమర్శలు గుప్పించారు. మొదటి దశ పోలింగ్‌లో ఎన్డీయేకు ఏకపక్షంగా ఓట్లు పడినట్లు తెలుస్తోందన్నారు. అమేథీలో గతంలో ఓడిపోయిన కాంగ్రెస్ యువరాజు.. వయనాడ్‌లోనూ ఓడిపోనున్నారు. విపక్ష ఇండియా కూటమికి చెందిన కొందరు నేతలు లోక్‌సభను వదిలి రాజ్యసభకు వెళ్లిపోతున్నారని మోడీ ఎద్దేవా చేశారు. వారికి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేదన్నారు. గత కాంగ్రెస్ హయాంలో జరిగిన పాలనా పరమైన సమస్యలు చక్కదిద్దేందుకు పదేళ్లు పట్టిందని.. దేశానికి ఇంకా ఎంతో చేయాల్సింది ఉందని తెలిపారు. ఇండియా కూటమి అవినీతి అక్రమాలను కాపాడుకోవడానికి కలిసి వచ్చిన స్వార్థపరుల గుంపు అని మోడీ ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి: Vellampalli Srinivas: టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదు..!
ఈసారి సోనియాగాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కూడా ప్రత్యక్ష ఎన్నికలకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ విమర్శించినట్లుగా సమాచారం. మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధినాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇక దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రశాంతంగా ముగిసింది. ఇక సెకండ్ విడత ఏప్రిల్ 26న జరగనుంది. అనంతరం మే 7, 13, 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి. ఈసారి ఎన్డీఏకు 400 సీట్లు వస్తాయని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: DK Shivakumar: ‘‘ఓట్లు వేస్తేనే నీరు’’.. డిప్యూటీ సీఎంపై పోలీస్ కేసు..