Site icon NTV Telugu

Vizag Hotels: విశాఖ హోటల్స్‌కు తాకిన యుద్ధ ప్రభావం.. మరో రెండు రోజుల్లో అన్నీ క్లోజ్!

Vizag Hotels

Vizag Hotels

Vizag Hotels Face Closure Threat as Commercial LPG Shortage: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ముడి చమురు, గ్యాస్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడడంతో అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాల ప్రభావం భారత్‌లో కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో సమస్యలు తలెత్తడంతో పలు రంగాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. యుద్ధ ప్రభావం ఇప్పుడు పర్యాటక నగరం విశాఖపట్నంలోని హోటల్ రంగానికీ తాకింది.

వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా తగ్గిపోవడంతో దేశంలోని పలు నగరాల్లో ఇప్పటికే సుమారు 20 శాతం హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడినట్లు హోటల్స్ అసోసియేషన్ తెలిపింది. ఇదే పరిస్థితి కొనసాగితే మరో రెండు రోజుల్లో విశాఖలో కూడా హోటళ్లు స్వచ్ఛందంగా మూతపడే పరిస్థితి రావచ్చని అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. విశాఖ నగరంలో గత వారం రోజులుగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా ఉందని హోటల్ యజమానులు చెబుతున్నారు. నాలుగు రోజుల క్రితం వరకు ఒక కమర్షియల్ సిలిండర్ ధర సుమారు రూ.1300 ఉండగా.. ప్రస్తుతం అది రూ.1700 దాటింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే త్వరలోనే రూ.3000 వరకు పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

Also Read: Amara Charitable Trust: పేదల సాధికారతకు ‘అమరా ఛారిటబుల్ ట్రస్ట్’ చేయూత.. బోగోలు అభివృద్ధికి రూ.15 కోట్ల విరాళం!

విశాఖ నగరంలో చిన్నా పెద్దా కలిపి సుమారు 1000 హోటళ్లు ఉన్నాయి. వీటికి ప్రతి నెలా దాదాపు 65 వేల కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అవసరం అవుతాయి. అయితే ప్రస్తుతం కేవలం 45 వేల సిలిండర్లు మాత్రమే సరఫరా అవుతున్నాయని అసోసియేషన్ సభ్యులు చెబుతున్నారు. రాబోయే రెండు రోజుల్లో కేవలం 12 నుంచి 14 వేల సిలిండర్లను మాత్రమే సరఫరా చేయగలమని గ్యాస్ ఏజెన్సీలు చెబుతున్నాయి. ఇప్పటివరకు రోజుకు మూడు షిఫ్టులుగా గ్యాస్ సిలిండర్ల సరఫరా జరిగేదని, కానీ ఇప్పుడు మూడు రోజులకు ఒకసారి మాత్రమే సరఫరా జరుగుతోందని హోటల్ యజమానులు తెలిపారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే హోటళ్లను మూసివేయడం తప్ప మరో మార్గం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలని హోటల్స్ అసోసియేషన్ కోరుతోంది. గ్యాస్ సరఫరాను సాధారణ స్థితికి తీసుకువచ్చి హోటల్ రంగాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Exit mobile version