Visakhapatnam: అది విశాఖ పట్నం శివారు ప్రాంతం.. హైవేకు 150 మీటర్ల దూరం. చుట్టు గుబురుగా పెరిగిన సరుగుడు తోట.. పొదల్లో ఓ మహిళ మృతదేహం. సగం కాలిపోయి గుర్తుపట్టడానికి వీలుకాని స్థితిలో డెడ్ బాడీ. పరిశీలించగా ఆమె నెలలు నిండిన గర్భిణీ. ఇంతకీ ఆమెను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? ఎక్కడో చంపి ఇక్కడకు తీసుకొచ్చి తగలబెట్టారా? లేదంటే ఇక్కడే చంపేసి తగలబెట్టి పారిపోయారా? ఒక మృత దేహం ఎన్నో ప్రశ్నలు? అనకాపల్లి జిల్లా సబ్బవరం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. సబ్బవరం మండలం బాటజంగాలు పాలెం బంజరు వద్ద గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది..
READ MORE: DRDO Manager: బాధ్యతాయుత పదివిలో ఉండి.. ఇలాంటి గలీజు పనులేంటి మాస్టారు!
అనకాపల్లి – అనంద పురం జాతీయ రహదారికి 150 మీటర్ల దూరంలో.. గుర్తు తెలియని మహిళ మృతదేహం కాల్చిపడేసి ఉందని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. ఆమె వయసు సుమారు 25 నుంచి 30 ఏళ్లు ఉంటుందని గుర్తించారు. గిరిజన తెగకు చెందిన గర్భిణీ అని తేల్చారు. ఆమె డెత్ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. విశాఖ నుంచి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్, RFSL బృందాలను రప్పించి శాంపిల్స్ సేకరించారు.. బాటజంగాలపాలెం పంచాయతీ పరిధిలోని బంజరు వద్ద విశాఖకు చెందిన అంజి బాబు సరుగుడు తోట సమీపంలో విద్యుత్ సిబ్బందితో కలిసి జంగిల్ క్లియరెన్స్‌కు వెళ్లినప్పుడు పొదల్లో మహిళ మృతదేహాన్ని గుర్తించాడు. వెంటనే ఈ సమాచారాన్ని బాటజంగాల పాలేం సర్పంచ్‌కు సమాచారం ఇచ్చాడు.
READ MORE: Gujarat Honour Killing: చేజేతులా కన్నకూతుర్నే చంపేశాడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
ఆయన సబ్బవరం పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలను బట్టి, కాళ్లు చేతులు తాడులతో కట్టి, వేరే తాడుతో గొంతు నులిమి చంపినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయన్నారు పోలీసులు. తెల్లవారుజామున ఇక్కడకు మృతదేహాన్ని తీసుకొచ్చి పడేసినట్లు అనుమానిస్తున్నారు.. ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక పోలీసు బృందాలను నియమించామని పోలీసులు తెలిపారు. చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లలో మహిళ మిస్సింగ్ కేసులు నమోదైన దాన్ని బట్టి హత్యకు గురైన మహిళ ఎవరు అనేది నిర్ధారించే అవకాశం ఉంది. హత్యకు గురైన గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని 3 రోజులు పాటు అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్లో గుర్తించేందుకు ఉంచుతారు. ఆ తర్వాత పోస్టుమార్టం నిర్వహించనున్నారు పోలీసులు..