Gujarat Honour Killing: గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో దారుణం జరిగింది. కూతురు ప్రేమను అంగీకరించని ఓ తండ్రి ఆమెకు మరణశాసనం లిఖించాడు. తుచ్ఛమైన పరువు కోసం.. చేజేతులా కన్నకూతురును చంపేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న యువతి పేరు చంద్రిక. ఈ అమ్మాయి నీట్ పరీక్ష కోసం పాలన్‌పూర్‌లో కోచింగ్ తీసుకుంది. నీట్‌లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ఐతే పాలన్‌పూర్‌లో ఉన్న సమయంలోనే హరేష్ చౌధురి అనే యువకుడితో ప్రేమలో పడింది. అక్కడే ఇద్దరూ సహజీవనం చేయడం ప్రారంభించారు. ఈ విషయం చంద్రిక ఇంట్లో తెలియడంతో గొడవలు షురూ అయ్యాయి.
READ MORE: Sundeep Kishan: తెలుగు రాష్ట్రాల్లో పుట్టడం ఆనందదాయకం..!
కూతురు ప్రేమను ఒప్పుకోని తల్లిదండ్రులు చంద్రికను బలవంతంగా ఇంటికి తీసుకు వచ్చారు. అదే సమయంలో హరేష్ చౌధురిని పోలీసులు పాత కేసులో అరెస్ట్ చేశారు. అదే కేసులో అతను జైలుకు కూడా వెళ్లాడు.. ఇక జూన్ 21న హరేష్‌కు బెయిల్ వచ్చింది. అదే రోజు జైలు నుంచి విడుదలయ్యాడు. చంద్రికను కలిసేందుకు ప్రయత్నించాడు. కానీ తల్లిదండ్రులు.. ఆమె జాడ తెలియకుండా జాగ్రత్తపడ్డారు. ఈ క్రమంలో జూన్ 24న హరేష్ కు చంద్రిక ఫోన్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. తనను కాపాడాలని ఆ మెసేజ్‌లో ఉంది. అదే రోజు రాత్రి చంద్రిక మృతి చెందింది.. చంద్రికది సహజ మరణంగా కుటుంబ సభ్యులు తెలిపారు. హడావుడిగా అంత్యక్రియలు కూడా చేసేశారు. కానీ చంద్రిక మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు హరేష్ చౌధురి. చంద్రిక పంపిన మెసేజ్‌లను పోలీసులకు ఫార్వర్డ్ చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసును చేధించారు. తండ్రి సేధాబాయ్ పటేల్, చిన్నాన శివభాయ్ పటేల్ ఆ హత్య చేసినట్లు తేలింది. తారడ్‌లోని థాంటియాలో ఈ మర్డర్ జరిగింది. ఈ కేసులో ఇదర్ని అరెస్టు చేశారు పోలీసులు..
READ MORE: Off The Record: తెలంగాణలో పాగా కోసం బీజేపీ ప్రత్యేక వ్యూహాలు!
అంతకు ముందు చంద్రిక ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసిన హరేశ్ .. హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాడు. కానీ ఈలోగానే ఆమె ప్రాణాలు కోల్పోయింది. సహజ మరణం చెందినట్లు ఆమె కుటుంబం డెత్ సర్టిఫికేట్ సమర్పించింది. కానీ హరేశ్ దీన్ని నమ్మలేదు. చంద్రిక మరణం కేసులో దర్యాప్తు చేపట్టాలని పోలీసుల్ని కోరడంతో విషయం బయటకు వచ్చింది.. విచారణ సమయంలో పోలీసులకు కూడా కొన్ని అనుమానాలు వచ్చాయి. సహజ మరణమే అయినా ఆమెను డాక్టర్ వద్దకు ఎందుకు తీసుకెళ్లలేదనే కోణంలో విచారించారు. కనీసం సోదరుడికి, బంధువులకు కూడా ఆమె చనిపోయిన విషయం చెప్పకుండానే దహన సంస్కారాలు చేసినట్లు గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులపై అనుమానాలు బలపడ్డాయి. చంద్రిక మృతిపై డౌట్స్ రాకుండా ఉండేందుకు.. ఆమెకు మత్తు మందు ఇచ్చారు. ఆ తర్వాత గొంతు నొక్కి చంపేశారు. ఉరి వేసుకున్నట్లు చిత్రీకరించారని పోలీసులు తెలిపారు..