Site icon NTV Telugu

Kohli-Rohit: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అభిమానులకు షాక్!

Kohli Rohit

Kohli Rohit

వచ్చే ఆగస్టులో జరగాల్సిన భారత్, బంగ్లాదేశ్ పరిమిత ఓవర్ల సిరీస్ వాయిదా పడింది. ఈ విష‌యాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ధ్రువీక‌రించింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ), బీసీసీఐ సంయక్తంగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపింది. కొత్త షెడ్యూల్‌ను తరువాత విడుదల చేస్తామని బీసీసీఐ పేర్కొంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 2026లో నిర్వ‌హించేందుకు బీసీబీ సముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.

బంగ్లాదేశ్‌లో షేక్‌ హసీనా ప్రభుత్వం కుప్పకూలాక హింసాత్మక ఘటనలతో బంగ్లా అట్టుడికింది. ప్రముఖులపై కూడా దాడులు జరిగాయి. దాంతో బంగ్లా-భార‌త్ సిరీస్‌పై ముందునుంచి నీలినీడ‌లు క‌మ్ముకున్నాయి. బంగ్లా ప‌ర్య‌ట‌న‌కు టీమిండియాను పంపేందుకు ప్ర‌భుత్వ అనుమతి కోసం బీసీసీఐ ఇన్నాళ్లు ఎదురు చూసింది. భద్రతా కారణాల దృష్ట్యా పర్యటనను వాయిదా వేసుకోమని ప్రభుత్వం బీసీసీఐకి సూచించిన నేపథ్యంలో శనివారం కీలక ప్రకటన చేసింది. బంగ్లా-భార‌త్ మధ్య వన్డే, టీ20 సిరీస్‌లు ఆగస్టు 17 నుండి ప్రారంభం కావాల్సి ఉంది. ముందుగా మూడు వన్డేలు, ఆపై మూడు టీ20లు జరగాల్సి ఉండే.

Also Read: Vaibhav Suryavanshi: 50 ఓవర్లు ఆడుతా, నెక్స్ట్‌ టార్గెట్‌ అదే.. వైభవ్‌ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగ్లాదేశ్ పర్యటన వాయిదాతో టీమిండియా స్టార్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అభిమానులకు షాక్ తగిలింది. రోహిత్, కోహ్లీలు టెస్ట్, టీ20లకు వీడ్కోలు పలికి.. కేవలం వన్డేలలో మాత్రమే ఆడుతున్నారు. బంగ్లాదేశ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో రోహిత్-కోహ్లీ ఆటను చూడాలని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. అభిమానులు మరి కొన్ని నెలలు వేచి చూడాల్సిందే. ఆక్టోబ‌ర్‌లో ఆస్ట్రేలియాతో జ‌రిగే వ‌న్డే సిరీస్‌లో కోహ్లీ, రోహిత్ ఆడ‌నున్నారు. అంటే ఇంకా మూడు నెలలు ఇద్దరు మైదానంలోకి దిగారన్నమాట.

Exit mobile version