NTV Telugu Site icon

World Cup 2023: శత్రుత్వానికి చెక్‌.. సారీ చెప్పిన నవీన్-ఉల్-హక్, హగ్‌ చేసుకున్న కోహ్లీ!

Virat Kohli

Virat Kohli

World Cup 2023: ప్రపంచ కప్ 2023లో బుధవారం రాత్రి ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లపై భారత బ్యాట్స్‌మెన్ పూర్తిగా ఆధిపత్యం చెలాయించారు, క్రికెట్ అభిమానులు కూడా హృదయాన్ని హత్తుకునే దృశ్యాన్ని చూశారు. ఫిరోజ్ షా కోట్లా స్టేడియం (ప్రస్తుతం అరుణ్ జైట్లీ స్టేడియం)లో జరిగిన మ్యాచ్‌లో భారత స్టార్ విరాట్ కోహ్లీ ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ నవీన్-ఉల్-హక్‌ను ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. కొన్ని నెలల క్రితం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ సందర్భంగా ఇద్దరు ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో విరాట్ కోహ్లీ, నవీన్ ఉల్ హక్‌ల మధ్య జరిగిన గొడవ అందరికీ గుర్తుండే ఉంటుంది. లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ గొడవ జరిగింది. మొదట నవీన్ ఉల్ హక్, కోహ్లీల మధ్య ఆరంభమైన గొడవ కొట్టుకునేంత వరకు వెళ్లింది. లక్నో మెంటార్ గౌతమ్ గంభీర్ ఎంట్రీతో గొడవ మరింత హీటెక్కింది. అప్పట్లో ఆ గొడవకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ గొడవ అనంతరం నవీన్ ఉల్ హక్ చేసిన మ్యాంగో పోస్టులు కోహ్లీ అభిమానులకు చిర్రెత్తించాయి. అప్పటి నుంచి కోహ్లీ అభిమానులకు నవీన్ ఉల్ హక్ బద్ద శత్రువుగా మారిపోయాడు.

Also Read: IND vs AFG: రోహిత్ సెంచరీ.. అఫ్గానిస్థాన్‌పై భారత్‌ ఘన విజయం..

ఇదిలా ఉండగా ఐపీఎల్‌లో గొడవ కాస్తా వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లో సద్దుమణిగినట్లయింది. నవీన్‌ ఉల్‌ హక్‌ సారీ చెప్పగా.. విరాట్‌ కోహ్లీ అతడిని కౌగిలించుకున్నాడు. కోహ్లీ అభిమానులు వారి మధ్య జరిగిన సంభాషణను చూసి కోహ్లీ.. కోహ్లీ అంటూ నినాదాలు చేశారు. ఇప్పుడు విరాట్ కోహ్లీ, నవీన్-ఉల్-హక్ మధ్య సయోధ్యకు సంబంధించిన ఈ వీడియో ఇంటర్నెట్‌లో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఇద్దరు ఆటగాళ్ల క్రీడాస్ఫూర్తిని ప్రజలు అభినందిస్తున్నారు.

156 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ ఇషాన్ కిషన్ రూపంలో పడిపోవడంతో విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. అలాంటి పరిస్థితుల్లో అఫ్గాన్‌ కెప్టెన్‌ హష్మతుల్లా షాహిదీ బంతిని నవీన్‌ ఉల్‌ హక్‌ చేతికి ఇవ్వడంతో ప్రేక్షకులు కోహ్లీ-కోహ్లీ అంటూ నినాదాలు చేశారు. ఇక విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తుండగా.. 26వ ఓవర్‌ను వేయడానికి నవీన్ ఉల్ హక్ వచ్చాడు. కోహ్లీ నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లోకి రాగానే.. కోహ్లీ వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించాడు. కోహ్లీ కూడా అంతే ఆప్యాయంగా పలకరించాడు. పరస్పరం కౌగిలించుకుని ఒకరికొకరు ఆల్ ద బెస్ట్ చెప్పుకున్నారు. దీని తర్వాత, విరాట్ అభిమానుల వైపు చూపిస్తూ, నవీన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం మానేయాలని అభ్యర్థించాడు. ఐపీఎల్‌ సందర్భంగా రాజుకున్న వైరానికి కోహ్లీ, నవీన్‌ ఉల్‌ హక్‌లు ప్రపంచకప్‌ వేదికగా ముగింపు పలికారు.

Also Read: World Cup 2023: గాజాకు మద్దతుగా పాక్ క్రికెటర్ రిజ్వాన్.. సెంచరీ అంకితం.. నెటిజన్ల రియాక్షన్ ఇదే..

ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ భారత్‌కు 273 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 131 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి 90 బంతుల్లో 8 వికెట్ల తేడాతో భారత్‌కు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. విరాట్ కోహ్లీ 56 బంతుల్లో 55 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడాడు. చివరికి ఫోర్ కొట్టి మ్యాచ్‌ను గెలుచుకున్నాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో శనివారం జరగనున్న భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు భారత్‌కు ఇది పెద్ద విజయం. 273 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన భారత జట్టు ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ 156 పరుగుల బలమైన భాగస్వామ్యంతో శుభారంభం చేశారు. ఇషాన్ కిషన్ 50 పరుగుల ముందు ఔటయ్యాడు, కానీ విరాట్ కోహ్లి వచ్చి ఆ పని పూర్తి చేసాడు. ఆఫ్ఘనిస్తాన్‌పై సెంచరీ చేయడం ద్వారా, రోహిత్ శర్మ ICC ప్రపంచ కప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కూడా నిలిచాడు. ఈ కాలంలో మరెన్నో రికార్డులు నెలకొల్పాడు.