Virat Kohli Instagram: విరాట్ కోహ్లీ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసం లేదు. క్రికెట్ ఆడే స్టైల్, ఫ్యాషన్‌కు అభిమానులు భారీగా ఉన్నారు. సోషల్ మీడియా ఖాతాలో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. అయితే.. శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా డిజిటల్ ప్రపంచం గందరగోళంలో పడిపోయింది. కారణం.. కోట్లాది అభిమానుల హృదయాల్లో “కింగ్”గా నిలిచిన విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ ఖాతా అకస్మాత్తుగా కనిపించకుండా పోవడమే. 27 కోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్న @virat.kohli ప్రొఫైల్ ఒక్కసారిగా మాయమవడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. లింక్ ఓపెన్ చేయగానే “ఈ పేజీ అందుబాటులో లేదు” అనే సందేశమే కనిపించింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇలా జరగడంతో సోషల్ మీడియాలో కలకలం రేగింది.
READ MORE: Gandhi Talks Review : గాంధీ టాక్స్ రివ్యూ.. విజయ్ సేతుపతి మూకీ సినిమా ఎలా ఉందంటే?
విరాట్ కోహ్లీ ఇప్పటికి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవలే న్యూజిలాండ్‌పై 124 పరుగుల అద్భుత ఇన్నింగ్స్‌తో ఐసీసీ వన్డే బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని తిరిగి సాధించాడు. అలాంటి సమయంలో ఇన్స్టాగ్రామ్ నుంచి అకస్మాత్తుగా గల్లంతవడం అభిమానులకు జీర్ణించుకోలేని విషయంగా మారింది. ఇన్స్టాగ్రామ్ ఖాతా కనిపించకపోయినా, విరాట్ కోహ్లీ ఎక్స్ (మునుపటి ట్విట్టర్) ఖాతా మాత్రం యాక్టివ్‌గా ఉండి. ఈ అంశంపై విరాట్ నుంచి ఎలాంటి వివరణ రాలేదు. ఇంతలో సోషల్ మీడియాలో ఊహాగానాలు పెరిగిపోయాయి. పెద్ద స్థాయి హ్యాక్ జరిగిందా? లేక విరాట్ కావాలనే కొంతసేపు సోషల్ మీడియా నుంచి దూరమయ్యాడా? అనే చర్చలు నడిచాయి. మీమ్స్ భారీగా పుట్టుకొచ్చాయి. అందులో “నిహిలిస్ట్ పెంగ్విన్” మీమ్ ప్రత్యేకంగా వైరల్ అయింది. ఎక్కడికో నడుచుకుంటూ వెళ్లిపోయే పెంగ్విన్ చిత్రాన్ని విరాట్ తాత్కాలికంగా ఇంటర్నెట్ నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయాడని సరదాగా మీమ్స్ చేసుకున్నారు.
ఈ అంశంపై నిపుణులు తమ అభిప్రాయాలు చెప్పడం మొదలుపెట్టారు. ఇలాంటి పెద్ద ఖాతాల్లో సాంకేతిక లోపాలు రావచ్చని, భారీ ట్రాఫిక్ వల్ల తాత్కాలికంగా ఖాతా నిలిపివేసి ఉండే అవకాశం ఉంటుందని చెప్పారు. పూర్తిగా డిలీట్ అయితే తిరిగి రావడం కష్టం, కానీ ఇది అలా కాదని కొందరు అంచనా వేశారు. కానీ.. దాదాపు ఆరు గంటల తర్వాత అభిమానులకు గుడ్‌న్యూస్ అందింది. విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ ఖాతా మళ్లీ యాక్టివ్ అయింది. ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా, ఖాతా తిరిగి రావడంతో ఆందోళన తగ్గింది. ఇది సాంకేతిక లోపమా? లేక ఉద్దేశపూర్వకంగా తీసుకున్న చిన్న విరామమా? అన్నది ఇప్పటికీ తెలియరాలేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా బయటపడింది. ఆసియాలోనే అత్యధిక ఫాలోవర్లు కలిగిన వ్యక్తైన విరాట్ కోహ్లీ ఖాతా కొన్ని గంటలు షాట్ డౌన్ కావడంతో దాదాపు ప్రపంచం మొత్తం గమనించింది.