Virat Kohli wins ICC ODI Player of the Year Award: దశాబ్దంన్నర కాలంగా భారత క్రికెట్ బ్యాటింగ్‌కు వెన్నెముకగా ఉండి రికార్డుల సునామీ సృష్టిస్తున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. మరో అరుదైన ఘనత సాధించాడు. ‘ఐసీసీ వన్డే క్రికెట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అత్యధికసార్లు అందుకున్న ఏకైక క్రికెటర్‌గా విరాట్ చరిత్రకెక్కాడు. వన్డే క్రికెట్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు గెలుచుకున్న కోహ్లీ.. ఈ ఘనతను అందుకున్నాడు. గతంలో 2012, 2017, 2018లలో కూడా ఈ అవార్డును కింగ్ సొంతం చేసుకున్నాడు.
ఐసీసీ వన్డే క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఐసీసీ గురువారం ఎక్స్ ద్వారా ప్రకటన చేసింది. భారత క్రికెటర్లు శుభ్‌మన్ గిల్, మొహమ్మద్ షమీల నుంచి గట్టి పోటీ ఎదురైనా.. చివరికి ఐసీసీ కోహ్లీనే ఈ అవార్డుకు ఎంపిక చేసింది. 2023లో కోహ్లీ వన్డేలలో అద్భుతంగా రాణించాడు. 27 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. 24 ఇన్నింగ్స్‌లలో 1,377 పరుగులు చేశాడు. వికెట్ తీయడంతో పాటు 12 క్యాచ్‌లు అందుకున్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో 11 ఇన్నింగ్స్‌లలో కోహ్లీ 765 పరుగులు చేశాడు.
Also Read: Padma Shri Awards: రోహన్ బోపన్న, జోష్న చిన్నప్పలకు పద్మశ్రీ అవార్డులు!
విరాట్ కోహ్లీ ఖాతాలో ఐసీసీ అవార్డుల సంఖ్య 10కి చేరింది. 10 ఐసీసీ అవార్డులు అందుకున్న తొలి ప్లేయర్‌గా కోహ్లీ మరో రికార్డు అందుకున్నాడు. అత్యధిక ఐసీసీ అవార్డులు అందుకున్న జాబితాలో శ్రీలంక దిగ్గజ క్రికెటర్ కుమార సంగక్కర (4), భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (4) ఉన్నారు. ఐదు బీసీసీఐ అవార్డులు గెలుచుకున్న కోహ్లీ.. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డ్స్‌ను మూడుసార్లు సొంతం చేసుకున్నాడు. ఇక ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్‌ను 12 సార్లు అందుకున్నాడు.