NTV Telugu Site icon

Virat Kohli-Babar Azam: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్‌ అజామ్‌తో స్నేహం.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విరాట్ కోహ్లీ!

Virat Kohli Babar Azam

Virat Kohli Babar Azam

Virat Kohli recalls first interaction with Babar Azam: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్‌ అజామ్‌ను ఆ దేశ మాజీలు, ఫాన్స్ ఎప్పటికప్పుడు పోల్చుతుంటారు. కెరీర్ ఆరంభం నుంచి పరుగుల వేటలో ఉన్న కోహ్లీ కంటే.. బాబర్ టాప్ క్లాస్ బ్యాటర్ అంటూ ప్రశంసిస్తుంటారు. ఇందుకు కారణం.. గత కొన్నాళ్లుగా అన్ని ఫార్మాట్‌లలో బాబర్ నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ప్రత్యర్థి ఎవరైనా తనదైన బ్యాటింగ్‌తో పరుగుల వరద పారిస్తున్నాడు. అయితే నిలకడకు మారుపేరుగా మారిన కోహ్లీ-బాబర్ తొలిసారి వన్డే ప్రపంచకప్‌ 2019 సందర్భంగా నేరుగా మాట్లాడుకున్నారట. ఈ విషయాన్ని తాజాగా కోహ్లీనే స్వయంగా చెప్పాడు.

తాజాగా స్టార్ స్పోర్ట్స్‌తో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. 2019లో మొదటిసారి కలిసినప్పుడు బాబర్‌ అజామ్‌ తనకు ఎంత గౌరవం ఇచ్చాడో ఇప్పటికీ అదే మర్యాదతో వ్యవహరిస్తాడని తెలిపాడు. ‘ప్రపంచకప్ 2019 సందర్భంగా బాబర్ అజామ్‌తో తొలిసారి మాట్లాడా. పాక్ ఆటగాడు ఇమాద్‌ వసీమ్‌ అండర్‌ 19 నుంచే నాకు పరిచయం. అతడే బాబర్‌ను నా వద్దకు తీసుకొచ్చి.. నాతో మాట్లాడాలని ఉందని చెప్పాడు. ఇద్దరం ఓ చోట కూర్చుని చాలా సమయం మాట్లాడుకున్నాం. ఆ రోజు బాబర్‌ నా పట్ల ఎంతో గౌరవభావం చూపించాడు. ఇప్పటికీ అదే మర్యాద ఇస్తాడు. అందులో ఎలాంటి మార్పు లేదు’ అని కోహ్లీ అన్నాడు.

Also Read: IND Playing XI vs WI: నేడే ఐదవ టీ20.. స్టార్ ప్లేయర్‌పై వేటు! భారత తుది జట్టు ఇదే

‘బాబర్ అజామ్‌ మంచి బ్యాటర్. ఇప్పుడు మూడు ఫార్మాట్లలోనూ అతడు టాప్‌ బ్యాటర్. నిలకడగా రాణిస్తూ అత్యుత్తమ ప్రదర్శన ఇస్తున్నాడు. బాబర్ ఆటను చూసేందుకు నేను చాలా ఇష్టపడతా’ అని విరాట్ కోహ్లీ తెలిపాడు. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న వివాదాల కారణంగా.. ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. దాంతో ఐసీసీ టోర్నీల్లోనే ఇండో-పాక్ మ్యాచ్‌ను చూడాల్సి వస్తోంది. మరో కొద్ది రోజుల్లో దాయాదుల మధ్య పోరు జరగనుంది. ఆసియా కప్‌ 2023తో పాటు వన్డే ప్రపంచకప్‌లో భారత్ -పాక్ తలపడనున్నాయి.