Stone pelting attack on YS Jagan Case: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా జరిగిన రాయి దాడి ఘటనలో పోలీసులు కీలక పురోగతిని సాధించారు. కేసు విచారణ నిమిత్తం 8 బృందాలు 48 గంటలు పనిచేయగా.. కీలక ఆధారాలను గుర్తించినట్టు తెలిసింది. సింగ్ నగర్ డాబా కొట్ల సెంటర్ లో వైఎస్ జగన్ పై ఈ నెల 14వ తేదీన రాత్రి 8 గంటలు దాటిన తర్వాత రాయితో గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో జగన్ ఎడమ కంటి కనుపాపపైన గాయమైంది. అదే సమయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ కు కూడా గాయమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ నిమిత్తం సిట్ ను ఏర్పాటు చేశారు.
ఇక, ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ టీవీ ఫుటేజీలు, పబ్లిక్ తీసిన వీడియోలు, ఫోన్ కాల్ డేటాను పరిశీలించగా ఒక కీలక బ్రేక్ త్రూ దొరికింది పోలీసులు.. స్థానికంగా నివసించే సత్తి అతని స్నేహితులకు సీఎం జగన్‌పై దాడితో సంబంధం ఉన్నట్టు ఆధారం దొరకటంతో ఆ ఐదుగురిని మంగళవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సత్తి మట్టి పనిచేసుకుంటాడు. వయస్సు 17 వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సత్తిని మత్తు కోసం సొల్యూషన్ తాగుతున్నాడని కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తామని చెప్పి తీసుకెళ్ళారని సత్తి తల్లి రమణ చెబుతున్నారు. స్థానికంగా ఉన్న అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళగా అక్కడ సత్తి అతని స్నేహితులు లేరని వారికి ఏమీ తెలియదని వదిలి పెట్టాలని సత్తి తల్లి కోరారు.
సీఎం వైఎస్ జగన్ పై వివేకానంద స్కూల్ దగ్గర నుంచి సత్తి దాడికి పాల్పడినట్టుగా పోలీసులు దాదాపుగా నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. అయితే, దాడి ఎందుకు చేశారు, ఎవరి ప్రోద్భలంతో చేశారు అనే కారణాలపై పోలీసులు ఐదుగురిని విచారిస్తున్నట్టు సమాచారం. సీసీఎస్ పోలీస్ స్టేషన్ లో వీరిని విచారిస్తున్నట్టు తెలిసింది. పోలీసులు సేకరించిన సమాచారం, అనుమానితులు చెప్పే సమాచారాన్ని బేరీజు వేసి పక్కా ఆధారాలతో కేసు చేధించే పనిలో పోలీసులు ఉన్నట్టు తెలిసింది. సీఎం జగన్ వంటి హైప్రొఫైల్ ఉన్ వ్యక్తిపై దాడి కావటంతో అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే వివరాలు వెల్లడించే అవకాశలు ఉన్నట్టు తెలుస్తోంది.