Site icon NTV Telugu

MLC Vijayashanti : తెలంగాణ ఉద్యమం చేసింది నేనే – కేసీఆర్‌కు తెలంగాణ సొంతం కాదు

Vijayashanti

Vijayashanti

MLC Vijayashanti : తెలంగాణ రాజకీయాల్లో విజయశాంతి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నుంచి బయటకు వచ్చిన అనంతరం ఆమె బీఆర్‌ఎస్‌పై, కేసీఆర్‌పై, అలాగే బీజేపీ విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ పార్టీని బలవంతంగా విలీనం చేశారని ఆమె ఆరోపించారు. విజయశాంతి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో తాను కేసీఆర్‌ కంటే ముందే క్రియాశీలంగా పాల్గొన్నానని, తెలంగాణ రాష్ట్రం కేసీఆర్‌కు సొంతం కాదని స్పష్టం చేశారు. “నా పార్టీని బలవంతంగా విలీనం చేశారు. తెలంగాణ కోసం నేను పోరాడిన ఫలితం ఇదేనా? నిజాలు మాట్లాడండి,” అని ఆమె వ్యాఖ్యానించారు.

ఒక ఓటుతో రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉంటుందన్న వాగ్దానాన్ని బీజేపీ తప్పించుకుందని, ఆ కారణంగా తాను ఆ పార్టీని వీడానని విజయశాంతి స్పష్టం చేశారు. “తెలంగాణను వ్యతిరేకించిన శక్తులను బీజేపీ రాష్ట్రంలోకి రప్పిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి,” అని ఆమె హెచ్చరించారు.

బీఆర్‌ఎస్ నేతలు, కేసీఆర్ తనపై అనవసర విమర్శలు చేస్తున్నారని విజయశాంతి మండిపడ్డారు. “ఎందుకు అంత కుట్రబుద్ధి? దొరబుద్ధి చూపిస్తున్నారు. బడుగుల బలహీన వర్గాలను చూడకుండా, తెలంగాణను కార్పొరేట్ లబ్ధిదారులకు అంకితం చేశారు,” అంటూ కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించారు.

తెలంగాణను ఉద్యమకారుడి చేతిలో పెట్టిన ప్రజలు ఇప్పుడు ఆర్థికంగా రాష్ట్రాన్ని ఎలా నష్టపరిచారో చూస్తున్నారని ఆమె అన్నారు. “ఏం చేశావో చెప్పు. చేసిన తప్పులు ఒప్పుకో. కేసీఆర్‌ను వదిలిపెట్టకూడదు. లక్షలాది ప్రజల ఆశయాలను మోసం చేసి లక్షల కోట్ల రూపాయలు సంపాదించాడు. ఏడున్నర లక్షల కోట్ల అప్పు చేసింది ఎవరు?” అంటూ విజయశాంతి ఘాటుగా ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడటమే తన ధ్యేయమని విజయశాంతి స్పష్టం చేశారు. భవిష్యత్తులో రాజకీయ పరంగా మరింత దూకుడుగా వ్యవహరించనున్నట్లు ఆమె సంకేతాలు ఇచ్చారు.

YCP: గవర్నర్‌ను కలిసిన వైసీపీ నేతల బృందం.. పలు అంశాలపై ఫిర్యాదు

Exit mobile version